సింప్లిసిటీకి పెద్ద‌పీట‌.. వేడుక కాని కేటీఆర్ పుట్టిన రోజు..!

Update: 2019-07-24 11:43 GMT
ఆయ‌న సీఎం కుమారుడు. ఎమ్మెల్యే కూడా. రాష్ట్రంలో అధికార పార్టీకి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌... ఇన్ని ప‌ద‌వులు, హోదాలు ఉన్న నాయ‌కుడు త‌న పుట్టిన రోజును ఎలా చేసుకోవాలి. ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని ఏముంటుంది? హ‌ంగు ఆర్భాటాల తో చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆయ‌న ఒక్క‌మాట ఊ! అంటే చాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన నాయ‌కులు క్యూ క‌ట్టు కుని వెళ్లి మ‌రీ పూల‌బొకేల‌తో, గిఫ్ట్ ప్యాక్‌లతో, పూల దండ‌ల‌తో ఆయ‌న‌ను ముంచే స్తారు. కానీ, ఆయ‌న ఇవేవీ వ‌ద్ద‌ని సున్నితంగా చెప్పేశారు. మీ మీస్తాయిలో నా పుట్టిన రోజును పేద‌ల మ‌ధ్య‌, అనాథ‌ల మ‌ధ్య జ‌రుపుకోండి.. నా ద‌గ్గ‌ర‌కు ఎవ‌రూ రావొద్దు. మీ డ‌బ్బులు పూల బొకేల కోసం వృథా చేసుకోవ‌ద్దు!! అని తేల్చి పారేశారు.

నిజానికి ఇప్పుడున్న రాజ‌కీయాల్లో ఇలాంటి నాయ‌కులు కూడా ఉంటారా? అంటే.. ఉన్నారు. ఆయ‌నే తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌. బుధ‌వారం ఆయ‌న పుట్టిన రోజు. అయితే, ఎలాంటి హంగు ఆర్భాటాల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా ఆయ‌న సింపుల్‌గా త‌న పుట్టిన రోజును నిర్వ‌హించుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. నేరుగా త‌న కార్యాల‌యానికి చేరుకుని ఎప్ప‌టిలాగానే త‌న ప‌నిలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా త‌న‌ను అభినందించేందుకు వ‌స్తున్న‌వారి విష‌యాన్ని తెలుసుకుని పైవిధంగా ఆదేశించారు.

అయితే, కేటీఆర్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది అభిమానులు, పార్టీ నాయ‌కులు అన్న‌దానం, వ‌స్త్ర దానం వంటివాటికి తెర‌దీశారు. ఇక‌, త‌న తండ్రి పుట్టిన రోజు పురస్కరించుకుని కేటీఆర్ తనయుడు హిమాన్షు కూడా సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాడు. బంజారాహిల్స్ ప్రాంతంలోని బసవతారకం కేన్సర్ హాస్పిటల్ సమీపంలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమానికి హిమాన్షు హాజరయ్యాడు. అక్కడున్నవారితో కలిసిపోయి పలువురికి భోజనాలు వడ్డించి శభాష్ అనిపించుకున్నాడు. అంకుల్, అన్న అంటూ అందరితో కలివిడిగా మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు.

కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రంలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. పలుచోట్ల సేవా కార్యక్రమాలు కొనసాగుతున్న తీరు పలువురు నేతలకు ఆదర్శప్రాయంగా నిలవనుంది. పల్లెల నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దాకా కేటీఆర్ బర్త్‌డే వేడుకలను సేవా కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. రక్తదాన శిబిరాలు.. మొక్కలు నాటడం.. పేదలకు ఆర్థిక సాయం.. ఇలా వివిధ రూపాల్లో తోచినంత సాయం చేస్తున్నారు.  మొత్తానికి కేటీఆర్ నేటి నేత‌ల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

    

Tags:    

Similar News