ఐపీఎల్ లో ఈ రోజు మామూలు మజా కాదు

Update: 2016-05-22 09:58 GMT
ఇండియన్ ప్రిమియర్ లీగ్ తొమ్మిదో సీజన్ చివరి దశకు వచ్చేసింది. ఈ రోజే లీగ్ దశ ఆఖరి రోజు. నిజానికి ఈసారి ఐపీఎల్ అనుకున్నంత ఆసక్తికరంగా సాగలేదు. ఆల్రెడీ వరల్డ్ కప్ లో టాప్ క్లాస్ ఎంటర్టైన్మెంట్ అనుభవించిన అభిమానులకు.. ఐపీఎల్ డోస్ సరిపోలేదు. అభిమానులకు బాగా అలవాటైన చెన్నై సూపర్ కింగ్స్.. రాజస్థాన్ రాయల్స్ జట్లు ఈసారి టోర్నీకి దూరమవగా.. మ్యాచ్ లు చాలా వరకు ఏకపక్షంగా సాగడం.. ఇంకా మరికొన్ని కారణాల వల్ల ఐపీఎల్ అంత ఎగ్జయిటింగ్ గా అనిపించలేదు. ఐతే ఈసారి లీగ్ లో ప్రత్యేకత ఏంటంటే.. ప్లేఆఫ్ చేరే జట్లేవన్నది చివరి వరకు తేలకపోవడం. పుణె.. పంజాబ్ జట్లు కాస్త ముందుగా ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకోగా.. ఆరు జట్ల మధ్య నాలుగు ప్లేఆఫ్ బెర్తుల కోసం విపరతీమైన పోటీ సాగింది. లీగ్ దశకు ఈ రోజు చివరి రోజు కాగా నిన్నే రెండు ప్లేఆఫ్ బెర్తులు ఖరారయ్యాయి. గుజరాత్.. సన్ రైజర్స్ రెండూ ప్లేఆఫ్ కు చేరుకున్నాయి.

మిగతా రెండు ప్లేఆఫ్ బెర్తుల కోసం కోల్ కతా.. బెంగళూరు.. ముంబయి.. దిల్లీ రేసులో ఉన్నాయి. ఈ నాలుగు జట్లూ ఏడేసి విజయాలు సాధించాయి. ముంబయి ఆల్రెడీ 14 మ్యాచ్ లు ఆడేయగా.. కోల్ కతా-బెంగళూరు-దిల్లీ తమ చివరి మ్యాచ్ లను ఈ రోజే ఆడబోతున్నాయి. ఈరోజు జరిగే రెండు మ్యాచ్ ల ఫలితాల్ని బట్టి ఈ నాలుగు జట్లలో ప్లేఆఫ్ కు వెళ్లే రెండు జట్లేవో తెలుస్తుంది.

ముందుగా సాయంత్రం కోల్ కతా-సన్ రైజర్స్ తలపడతాయి. ఈ మ్యాచ్ లో కోల్ కతా గెలిస్తే ఆ జట్టు ప్లేఆఫ్ బెర్తు ఖాయం అయిపోతుంది. రాత్రికి జరిగే దిల్లీ-బెంగళూరు మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వాళ్లదే నాలుగో ప్లేఆఫ్ బెర్తు. ఐతే కోల్ కతా ఓడిపోతే ఉంటుంది అసలు మజా. అప్పుడు నాలుగు జట్ల మధ్య హోరా హోరీ తప్పదు. రాత్రికి దిల్లీ గెలిస్తే ఆ జట్టుతో పాటు బెంగళూరు కూడా ముందంజ వేస్తుంది. కోల్ కతా.. ముంబయి ఇంటిముఖం పడతాయి. ఎందుకంటే బెంగళూరు రన్ రేట్ ఎవరూ అందుకోలేని స్థాయిలో ఉంది. కోల్ కతా.. ముంబయి కూడా అప్పుడు ఏడు విజయాలతోనే ఉన్నా బెంగళూరుకే ఛాన్స్ ఉంటుంది. ఐతే బెంగళూరు గెలిస్తే.. దిల్లీ-కోల్ కతా-ముంబయి జట్లలో ఏది ఎక్కువ రన్ రేట్ ఉంటే దానికి ఛాన్స్ దొరుకుతుంది. మొత్తానికి ఈ రోజు ఐపీఎల్ అభిమానులకు మజా మామూలుగా ఉండదన్నమాట.
Tags:    

Similar News