పవన్ స్ట్రాటజీ ఏంటి?

Update: 2021-11-10 16:48 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు తానేం చేస్తున్నారో అర్ధమవుతున్నట్లు లేదు. రాష్ట్రంలో అధికారికంగా జనసేనకు పొత్తున్నది బీజేపీతో మాత్రమే. తెలుగుదేశం పార్టీతో ఏ విధంగా చూసినా ఎలాంటి సంబంధం లేదు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కలిసి నడవాల్సింది బీజేపీతోనే. అయితే పవన్ పార్టీ నేతలు మాత్రం బీజేపీతో కాకుండా టీడీపీతో కలిసి నడుస్తున్నారు. ఇదేమి విపరీతమో ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నట్లు ఇంతవరకు ఒక్క ప్రకటన కూడా చేయకపోవటం మరింత విచిత్రం.

రాష్ట్రంలో 14 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మిత్రపక్షాలు రెండు కూడా దేని బలం ప్రకారం ఆ పార్టీ కొన్ని వార్డుల్లో పోటీ చేస్తున్నాయి. అయితే ఎక్కడ కూడా కలిసి పనిచేస్తున్నట్లు కనిపించటంలేదు. కలిసి పనిచేయడం అంటే మిత్రపక్షాల్లో ఒక పార్టీ అభ్యర్థి నామినేషన్ వేసేటప్పుడు రెండో పార్టీ నేతలు హాజరవ్వాలి. అలాగే ఒక పార్టీ అభ్యర్ధి ప్రచారంలో మరోపార్టీ నేతలు కూడా హాజరవ్వటం. ప్రచార వ్యూహాలను రెండు పార్టీల నేతలు కలిసి డిసైడ్ చేయటం. దీన్నే పొత్తు ధర్మమంటారు.

కానీ మిత్రపక్షాల మధ్య అలాంటి పొత్తు ధర్మమేది ఉన్నట్లు కనబడటంలేదు. ఎందుకంటే రాజంపేట, కుప్పం, నెల్లూరు మున్సిపాలిటీల్లో రెండు పార్టీల నేతలు ఎవరికి వారుగా నామినేషన్లు వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారు. ఒకపార్టీతో మరోపార్టీకి ఎలాంటి సంబంధం లేకుండానే ఎన్నికల ప్రక్రియ జరిగిపోతోంది. సరే మిత్రపక్షాల గోల ఈ విధంగా ఉంటే జనసేన నేతలు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు మున్సిపాలిటిలో హ్యాపీగా కలిసే ప్రచారం చేసుకుంటున్నారు.

అధికారికంగా పొత్తున్న బీజేపీతో కాకుండా ఎలాంటి సంబంధంలేని టీడీపీతో కలిసి పనిచేయడం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈమధ్యనే ముగిసిన పరిషత్ ఎన్నికల్లో కూడా ఎనిమిది మండలాల్లో టీడీపీ+జనసేనలు మండలాధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను పంచుకున్నాయి. ఈ విపరీతాలపై ఇటు చంద్రబాబునాయుడు కానీ అటు పవన్ కానీ ఎవరు నోరు మెదపడం లేదు. చంద్రబాబుకు ఇలాంటివి అలవాటే. కానీ పవన్ కూడా ఎందుకని నోరిప్పటం లేదో అర్థం కావటంలేదు.

ఇక్కడ అన్నింటికన్నా విచిత్రం ఏమిటంటే టీడీపీ తో కలిసి నడుస్తున్న పవన్ను బీజేపీ నేతలు ఏమీ ప్రశ్నించకపోవటం. ఇక్కడే పవన్ కు అసలు తానేం చేస్తున్నారో అర్ధమవుతోందా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఒకవేళ పవన్ కు తెలిసే ఇదంతా జరుగుతుంటే మాత్రం తప్పు చేస్తున్నట్లే అనుకోవాలి. కమలంపార్టీతో కాకుండా టీడీపీతోనే పొత్తు కావాలని పవన్ కోరుకుంటే అదే విషయాన్ని బహిరంగంగా ప్రకటించేయచ్చు. ఎవరితో అవసరమని అనుకుంటే వారితో పొత్తు పెట్టుకునే అవకాశం పవన్ కు ఉంటుంది. కాబట్టి ఇందులో మొహమాట పడాల్సిన అవసరమే లేదు.
Tags:    

Similar News