మోడీ స‌ర్కార్ : ఆదాయంలో బీజేపీ..అప్పుల్లో భారత్ !

Update: 2021-08-10 07:38 GMT
దేశ ప్రధానిగా నరేంద్రమోడీ పదవీ భాద్యతలు చేపట్టిన తర్వాత ఇండియా ప్రపంచంలో గణనీయంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని బీజేపీ నేతలు దృఢమైన సంకల్పంతో చెప్తున్నారు. మోడీ వచ్చాకే దేశం పరిస్థితి మెరుగైంది అని చెప్తూ వస్తున్నారు. అయితే , తాజా లెక్కలని బట్టి మోడీ వచ్చాకా బాగుపడింది దేశమా లేక బీజేపీనా అనే ప్రశ్న అందరిలో కలగకమానదు. మనదేశం అప్పుల్లో కురుకుపోతుంటే ..బీజేపీ ఆదాయం ఆర్జించడం తో అగ్రపథానికి చేరుకుంటుంది. గ‌త ఏడేళ్ల మోడీ నాయక‌త్వంలో దేశం సాధించిన పురోగ‌తి ఇదేన‌ని ఆర్థిక నిపుణులు వెక్కిరిస్తున్నారు.

పార్ల‌మెంట్ వేదిక‌గా మ‌న దేశం అప్పు ఎంతో కేంద్ర ఆర్థిక‌శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ నిన్న వెల్ల‌డించారు. ఇదే సంద‌ర్భంలో త‌మ పార్టీ ఆదాయ వ్య‌యాల వివ‌రాల‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి బీజేపీ తాజాగా స‌మ‌ర్పించింది. ఈ రెండింటిని ఒక్కసారి ప‌రిశీలిస్తే .. మోడీ వచ్చాక ఎవరికీ మేలు జరిగింది అనే విషయం స్పష్టంగా అర్థ‌మ‌వుతుంది. కేంద్ర ప్రభుత్వ మొత్తం అప్పు ఎంత అని లోక్‌ స‌భ‌లో ఎంపీ స‌జ్జా అహ్మ‌ద్ ప్ర‌శ్నించారు. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ రాత‌పూర్వ‌కంగా సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ మొత్తం అప్పులు రూ. 119,53,758 కోట్లుగా ఉందని, ఇది జీడీపీలో 60.5 శాతంగా ఉందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ వెల్లడించారు.

అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 6.8 శాతంగా ఉన్న ద్రవ్యలోటును 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి జీడీపీలో 4.5 శాతానికంటే దిగువకు పరిమితం చేసే దిశగా కేంద్రం దృష్టి సారించింది. పన్నుల ఎగవేతను నివారించి పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడం, ప్రభుత్వ రంగ సంస్థలు, వాటి స్థలాల అమ్మకం, ఆస్తుల ద్వారా ఆదాయ సముపార్జన వంటి అదనపు చర్యల ద్వారా అప్పుల భారాన్ని తగ్గించుకునే దిశగా ప్రణాళిక ఉంటుంది అని తెలిపారు.కేంద్ర ప్రభుత్వ అప్పు అంచనాలు ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి లోబడి ఉన్నాయి. రాష్ట్రాలు తెస్తున్న రుణాలపై తగిన పరిమితులు, అలాగే కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటుకు తీసుకుంటున్న చర్యల కారణంగా ప్రస్తుత అప్పు వల్ల పెద్ద ఆందోళన ఏమీ లేదు..’ అని తెలిపారు

డిపార్ట్‌ మెంట్ ఆఫ్ ఎక‌నామిక్స్ ఎఫైర్స్‌, ఆర్బీఐ వెబ్‌ సైట్‌ ల‌లోని వివ‌రాల ప్ర‌కారం 2014, మార్చి 31వ తేదీ నుంచి గ‌త నెల జూలై 31వ‌ర‌కూ కేంద్ర ప్ర‌భుత్వం చేసిన మొత్తం అప్పు 74.74 ల‌క్ష‌ల కోట్లు. స్వాతంత్ర్యం వ‌చ్చిన మొద‌లు 2014, మార్చి 31వ తేదీ వ‌ర‌కూ భార‌త‌దేశ అప్పు రూ.46 ల‌క్ష‌ల 25 వేల 37 కోట్లు. ఇక ఎన్నిక‌ల సంఘానికి బీజేపీ స‌మ‌ర్పించిన లెక్క‌ల వివ‌రాల‌ను చూస్తే ..  2019-20 సంవ‌త్స‌రానికి గానూ కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ రూ.5,611.14 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అలాగే రూ.2,100.73 కోట్లు ఖ‌ర్చు చేసింది. బీజేపీకి అత్య‌ధికంగా బాండ్ల రూపంలో రూ.2555 కోట్లు వ‌చ్చింది. ఆజీవ‌న్ స‌హ‌యోగ్ నిధి నుంచి రూ.23.05 కోట్లు వ‌చ్చింది. పార్టీ ప్ర‌చారం, ప్ర‌క‌ట‌న‌లకు రూ.303.30 కోట్లు, అభ్య‌ర్థుల‌కు ధ‌న స‌హాయంగా రూ.199.11 కోట్లు ఖ‌ర్చు చేసింది. మోడీ ప్రభుత్వ హయాంలో ఆదాయం ఆర్జనలో బీజేపీ దేదీవ్యమానంగా వెలిగిపోతుంటే ..భారతదేశం మాత్రం అప్పుల ఊబిలో మరింతగా కురుకుపోతుంది.
Tags:    

Similar News