భద్రాచల రాముడి వేడుకలకు అడుక్కోవాలా? ఇదెక్కడి అన్యాయం కేసీఆర్?

Update: 2023-02-27 19:00 GMT
సంబంధం లేకుండా వ్యవహరించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంటారు. తనను ఎవరూ అంచనా వేయలేని రీతిలో వ్యవహరించాలని అనుకుంటారో.. లేదంటే మనసులోని ఎజెండాను మాటల్లో చెప్పటం ఇష్టం లేని వేళ.. చేతల్లో చూపించే తీరు కేసీఆర్ కు కాస్త ఎక్కువే.

ఆయన తీరు పలుమార్లు చర్చనీయాంశంగా మారుతూ ఉంటుంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి బయటకు వచ్చింది. ఆయన వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ కు మించిన గొప్ప హిందువు లేరని మంత్రి కేటీఆర్ చెబుతుంటారు. మరి.. అదే నిజమైతే.. భద్రాచలం శ్రీరామచంద్రమూర్తికి ప్రతి ఏటా నవమి వేళ నిర్వహించే కల్యాణం ఖర్చు కోసం అవసరమయ్యే రూ.కోటిని కేసీఆర్ సర్కారు ఎందుకు విడుదల చేయలేదు? అన్నది ప్రశ్నగా మారింది.

ఎప్పుడూ లేని రీతిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భద్రాచలం రామచంద్రుడికి నిర్వహించే శ్రీరామనవమి విషయంలో కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న విమర్శ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. రామనవమి వేళ.. భద్రాచలంలో నిర్వహించే వేడుకలకు ముఖ్యమంత్రి ముత్యాల తలంభ్రాలను తీసుకెళ్లటం అనవాయితీగా ఉండేది. ఎన్ని పనులు ఉన్నా.. సతీసమేతంగా హాజరై మరీ ముత్యాల తలంబ్రాలను స్వామివారికి సమర్పించేవారు.

అదేమిటో కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎనిమిదేళ్ల కాలంలో శ్రీరామనవమికి ముత్యాల తలంబ్రాలను సీఎంగా ఉన్న కేసీఆర్ నెత్తిన పెట్టుకొని తీసుకెళ్లిన సందర్భాలను వేళ్ల మీద లెక్కించొచ్చు. తనకు మించిన హిందువు మరెవరూ ఉండరని చెప్పే ఆయన.. నవమి రోజున భద్రాచలం ఎందుకు వెళ్లరు? అలా అని ఆయన ఏదైనా బిజీగా ఉన్నారా? అంటే అది కూడా ఉండదు. అంతేనా భద్రాచలం రూపురేఖలు మార్చేందుకు రూ.100 కోట్లు ఇస్తానని చెప్పిన ఆయన. .ఇప్పటివరకు ఆ నిధులను విడుదల చేసింది లేదు.

భద్రాచలం రామాలయాన్ని మరింతగా డెవలప్ చేసేందుకు 2016లో రూ.100 కోట్లు ప్రకటించిన కేసీఆర్.. 2017లో అందుకు తగ్గట్లు నిధులుకేటాయించారు. కానీ.. వాటిని మాత్రం విడుదల చేయలేదు. అంతేనా.. భద్రాచలానికి ముత్యాల తలంబ్రాలకు డబ్బును ప్రభుత్వం జమ చేయాల్సి ఉంది. కానీ.. అది కూడా జరగటం లేదు. దీంతో.. ప్రస్తుతం రామనవమికి నిర్వహించాల్సిన కల్యాణ వేడుకకు నిధుల కటకటను ఎదుర్కొంటోంది దేవస్థానం.

దేవాలయంలో నిర్వహించాల్సిన పనులు.. నిధుల వివరాలతో ఒక కరపత్రాన్ని వేసి.. భక్తుల నుంచి రూ.కోటి మేర నిధులు ఇవ్వాలని  కోరుతున్న దైన్యాన్ని చూస్తే.. రామయ్య కోసం ఈ అడుక్కోవాల్సిన అవసరం ఉందా? అన్నది ప్రశ్న. దగ్గర దగ్గర రూ.మూడు లక్షల కోట్ల వార్షిక బడ్జెట్లో కోటి రూపాయిలు ఎంత చిన్న మొత్తం? ఆ మాటకు వస్తే.. వేరే రాష్ట్రాల్లో మరణించిన రైతుల కోసం భారీ ఎత్తున పరిహారం అందించేందుకు ప్రత్యేక ఫ్లైట్లను వేసుకొని మరీ వెళ్లేందుకు అయ్యే ఖర్చుతో రాములోరి కల్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించే వీలుంది. మరి.. సీఎం కేసీఆర్ కు ఇవేమీ ఎందుకు పట్టటం లేదు? భద్రాచలం రాములోరి మీద ఆయన ఎందుకంత శీతకన్ను వేసినట్లు? దీనికి సీఎం కేసీఆర్ సమాధానం చెప్పే కన్నా.. తనకు అలవాటైన మౌనాన్నే ప్రదర్శించే అవకాశమే ఎక్కువ.      




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News