ఫేస్‌ బుక్ కు షాకిచ్చిన వాట్సాప్ సీఈవో

Update: 2018-05-01 05:56 GMT
ప్ర‌పంచ వ్యాప్తంగా ఉలిక్కిప‌డేలా చేసి.. సంచ‌ల‌నం సృష్టించిన ఫేస్ బుక్ ప్రైవ‌సీ స్కాం ప్ర‌కంప‌న‌లు ఒక ప‌ట్టాన ఆగ‌టం లేదు. ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా ఫేస్ బుక్ కు షాకులు త‌గులుతున్నాయి. డేటా దుర్వినియోగం.. డేటాను అమ్ముకోవ‌టంపై భారీగా చ‌ర్చ జ‌రుగుతున్న వేళ‌.. ఫేస్ బుక్ సంస్థ‌కు చెందిన వాట్సాప్ సీఈవో జాన్ కౌమ్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించటం షాకింగ్ గా మారింది.

ఆ మ‌ధ్య‌న భారీ ధ‌ర‌కు వాట్సాప్ ను ఫేస్ బుక్ కొనుగోలు చేయటం తెలిసిందే. త‌న రాజీనామాకు కార‌ణాన్ని వాట్సాప్ సీఈవో చెప్ప‌కున్నా.. ఇటీవ‌ల చోటు చేసుకున్న ప‌రిణామాలే కార‌ణంగా భావిస్తున్నారు. కొన్ని నెల‌ల క్రిత‌మే వాట్సాప్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు బ్రెయిన్ కూడా రిజైన్ చేయ‌టం తెలిసిందే.

త‌మ పేరెంట్ కంపెనీ ఫేస్ బుక్ తో త‌న జ‌ర్నీ పూర్తి అయిన‌ట్లుగా కౌమ్ త‌న ఫేస్ బుక్ పేజీలో తాజాగా వెల్ల‌డించారు. కొంత‌మంది వ్య‌క్తుల‌తో తాను ప్రారంభించిన ప్ర‌యాణం అద్భుత‌మ‌ని పేర్కొన్న కౌమ్‌.. తాను బ‌య‌ట‌కు వ‌చ్చేసే స‌మ‌యం ఆస‌న్న‌మైందంటూ వ్యాఖ్యానించారు. కౌమ్ రాజీనామాపై ఫేస్ బుక్ స్పందించ‌లేదు. కాకుంటే ఫేస్ బుక్ లో ఆయ‌న పెట్టిన పోస్టుకు జుక‌ర్ బ‌ర్గ్ రియాక్ట్ అయ్యారు. మీతో క‌లిసి ప‌ని చేయ‌టం మిస్ అవుతున్నామంటూ పోస్ట్ పెట్టారు.

కౌమ్ రిజైన్ కార‌ణంగా వాట్సాప్ లో ప్ర‌కంప‌న‌లు రేగుతున్నాయి. ఈ వాద‌న నిజ‌మ‌న్న‌ట్లుగా వాట్సాప్కు చెందిన ఐదువేల మంది యాప్ సాఫ్ట్ వేర్ డెవ‌ల‌ప‌ర్స్‌.. కొంత‌మంది వాట్సాప్ యూజ‌ర్ల‌తో జుక‌ర్ స‌మావేశ‌మ‌య్యారు. వాట్సాప్ సీఈవో ప‌ద‌వికి రాజీనామా చేసిన కౌమ్‌.. ఫేస్ బుక్ బోర్డు ఆఫ్ డైరెక్ట‌ర్ల నుంచి కూడా వైదొలుగుతున్న‌ట్లుగా వార్తా సంస్థ‌లు రిపోర్ట్ చేస్తున్నాయి.

కౌమ్ రాజీనామా వెనుక కార‌ణం ఏమిట‌న్న దానిపై జోరుగా చ‌ర్చ‌లు జ‌రుతున్నాయి. కొన్ని మీడియా రిపోర్ట‌ల ప్ర‌కారం.. వాట్సాప్ భ‌విష్య‌త్ వ్యూహం విష‌యంలో ఈ కంపెనీ పేరెంట్ అయిన ఫేస్ బుక్ తో నెల‌కొన్న విభేదాల కార‌ణంగానే కౌమ్ రాజీనామా చేసిన‌ట్లుగా కొన్ని వార్తా క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. వాట్సాప్ యూజ‌ర్ల వ్య‌క్తిగ‌త డేటాను ఫేస్ బుక్ వాడుతుంద‌ని.. వాట్సాప్ ఎన్ క్రిప్ష‌న్ ను ఇది బ‌ల‌హీన‌ప‌రుస్తుంద‌న్న ఆందోళ‌న‌తో కౌమ్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఈ కార‌ణంతోనే ఆయ‌న త‌న ప‌ద‌వికి గుడ్ బై చెప్పి ఉండొచ్చ‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News