అత్యంత చౌకన టీకాను తయారు చేస్తున్న హైదరాబాదీ కంపెనీ?

Update: 2021-06-06 03:34 GMT
బయోలాజికల్ ఇ. లిమిటెడ్.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్  నుంచి ఉస్మానియా వర్సిటీకి వెళ్లే వారందరికి ప్రధాన రహదారి పక్కనే ఈ కంపెనీ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికే కొవిడ్ వ్యాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ గురించి హైదరాబాదీయులకు తెలియకపోవచ్చు కానీ.. బిఈ (బయోలాజికల్ ఇ) సంస్థ పేరు తెలియని హైదరాబాదీనే ఉండకపోవచ్చు. అంతలా సుపరిచితమైన ఈ ఫార్మా సంస్థ ఈమధ్యన కొవిడ్ వ్యాక్సిన్ తయారీ అంశంపై తరచూ వార్తల్లోకి వస్తోంది. తాజాగా ఇదే అంశానికి సంబంధించి ఒక ప్రముఖ ఆంగ్లమీడియా సంస్థ రాసిన కథనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దేశంలోకెల్లా అత్యంత చౌకైన కొవిడ్ వ్యాక్సిన్ తయారు చేసే సంస్థగా బిఈ అవతరించనున్నట్లు చెబుతున్నారు.

ఈ సంస్థ తయారు చేసిన కార్బివాక్స్ టీకా దేశంలోనే చౌకైనదిగా చెబుతున్నారు. ప్రస్తుతం మూడో దశలో ఉన్న ఈ టీకా రెండు డోసుల ధర కేవలం రూ.500 మాత్రమే. అంటే.. ఒక్కో డోసు అక్షరాల రూ.250కే లభిస్తుందని చెబుతున్నారు. ఒకవేళ సదరు ఆంగ్ల మీడియా సంస్థ వెల్లడించిన కథనం నిజమైన పక్షంలో.. కొవిడ్ వ్యాక్సిన్ విషయంలో ఇదో గేమ్ ఛేంజర్ గా మారటం ఖాయం. అయితే.. ఇప్పుడుబయటకు వచ్చిన ధర.. ప్రభుత్వానికి అమ్మే ధరా? ప్రైవేటుకు అమ్మే ధరా అన్న విషయం మీద క్లారిటీ రాలేదు.

ఇప్పటివరకు దేశంలో అందుబాటులో ఉన్న కొవిషీల్డ్ రెండు డోసులు రూ.600 ప్రభుత్వానికి.. ప్రైవేటుకైతే రూ.1200.. కొవాగ్జిన్ అయితే.. ప్రభుత్వానికి రెండు డోసులు రూ.800.. ప్రైవేటుకు రూ.2400గా అమ్ముతున్నారు. ఇక.. రష్యా టీకా స్పుత్నిక్ వి ఒక్కో డోసు రూ.995గా ఇప్పటికే ఆ టీకాను మార్కెట్లోకి తేనున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీ వెల్లడించింది.

బిఈ రూపొందిస్తున్న కార్బివాక్స్ టీకా అమెరికాకు చెందిన బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ తో కలిసి తయారు చేస్తోంది. ఈ టీకా కోసం ఇప్పటికే కేంద్రం 30 కోట్ల వ్యాక్సిన్ డోసులకు ముందస్తు ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ఆ కంపెనీకి రూ.1500 కోట్లను అడ్వాన్సు రూపంలో ఇచ్చింది కూడా. మరికొద్ది నెలల్లోనే ఈ టీకా అందుబాటులోకి రానున్నట్లు చెబుతున్నారు. ఇది కానీ మార్కెట్లోకి వస్తే దేశీయంగా తయారైన రెండు వ్యాక్సిన్లకు కేరాఫ్ హైదరాబాద్ కావటం ఒక విశేషంగా చెప్పక తప్పదు.

Tags:    

Similar News