అధ్యక్షుడిగా బైడెన్ తోలి స్పీచ్ వెనుక భారత సంతతి వ్యక్తి ... ఎవరంటే ?

Update: 2021-01-20 10:06 GMT
అమెరికా 46 వ అధ్యక్షడిగా జో బైడెన్ మరికొద్ది గంటల్లోనే ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీనితో ఆ క్షణం కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. ఇదిలా ఉంటే బిడెన్ తన టీం లో 20 మంది భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులకు చోటు దక్కడంతో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంపై భారతీయుల్లో మరింత ఆసక్తి నెలకొని ఉంది.

 ఇక ఈ రోజు  బైడెన్ ప్రమాణస్వీకారోత్సవంలోనూ భారత సంతతి వ్యక్తే పరోక్షంగా కీలక పాత్ర పోషించనున్నారు. తెలంగాణ మూలాలు ఉన్న చొల్లేటి వినయ్ రెడ్డి కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ కు స్పీచ్ రైటింగ్ డైరెక్టర్‌ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అగ్ర రాజ్యం అమెరికా కొత్తగా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న బైడెన్ జాతిని ఉద్దేశించి ఏం ప్రసంగిస్తారు దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అమెరికా సమాజాన్ని ప్రభావితం చేసే... ఆ దేశ భవిష్యత్‌ ను నిర్దేశించే ఈ స్పీచ్‌‌ ను భారత సంతతి వ్యక్తి వినయ్ రెడ్డి డ్రాఫ్ట్ చేయడంపై భారతీయుల్లో హర్షం వ్యక్తమవుతోంది. అమెరికాలో ప్రమాణస్వీకారం సందర్భంగా ఇచ్చే స్పీచ్ ట్రెండ్ ఏప్రిల్ 30,1789లో మొదలైంది. అప్పటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

 ఇక ఆ సమయం నుండి నేటివరకు అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టేవారు జాతిని ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీగా మారింది. ఆఫీస్ ఆఫ్ స్పీచ్ రైటింగ్ అనేది వైట్ హౌస్ లోని ఒక అధ్యక్ష విభాగం. అధ్యక్షుడి ప్రసంగాలకు సంబంధించిన పరిశోధన, రైటింగ్ బాధ్యతలను ఇది నిర్వర్తిస్తుందిప్రస్తుతం బైడెన్ ఇనాగురల్ స్పీచ్ ‌ను మైక్ డోనిలొన్ పర్యవేక్షిస్తున్నారు. గతంలో ఆయన బైడెన్‌ కు అయన సుదీర్ఘకాలం అడ్వైజర్‌గా సేవలందించారు.

ఈ స్పీచ్ ను డ్రాఫ్ట్ చేసిన చొల్లేటి వినయ్ రెడ్డి మూలాలు తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పోతిరెడ్డి గ్రామంలో ఉన్నాయి. ఈ గ్రామానికి చెందిన నారాయణరెడ్డి, విజయారెడ్డి దంపతుల కుమారుడే వినయ్ రెడ్డి. వృత్తి రీత్యా వైద్యుడైన నారాయణరెడ్డి 1970లో కుటుంబంతో సహా అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆయన ముగ్గురు కుమారుల్లో వినయ్ రెడ్డి ఒకరు.

అమెరికాలోని ఒహియా రాష్ట్రంలో ఉన్న డేటన్‌లో పుట్టి పెరిగిన వినయ్ రెడ్డి స్కూలింగ్,గ్రాడ్యుయేషన్ అక్కడే పూర్తి చేశారు. మియామీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్, హ్యారిస్ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో సీనియర్ అడ్వైజర్‌ గా,స్పీచ్ రైటర్‌ గా పనిచేశారు. ప్రస్తుతం వినయ్ రెడ్డికి బైడెన్ టీమ్‌లో కీలక బాధ్యతలు దక్కడంతో తెలంగాణలోని వారి బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News