టీపీసీసీ చీఫ్ రేస్.. తెరపైకి కొత్త పేర్లు.?

Update: 2019-11-13 07:45 GMT
తన కంచుకోట.. సొంత నియోజకవర్గమైన హుజూర్ నగర్ లో దారుణ ఓటమి తర్వాత పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిసైడ్ అయ్యాడు. ఈ మేరకు అధినేత్రి సోనియా వద్దకు వెళ్లి కలిశారు. దీంతో మొన్నీ మధ్యే కాంగ్రెస్ అధిష్టానం దూత, సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ హైదరాబాద్ రావడం.. పీసీసీ రేసు గురించి ప్రస్తావించడం జరిగిపోయింది. అయితే అక్కడ గొడవ జరగడంతో కొత్త పీసీసీ చీఫ్ ప్రస్తుతానికి పక్కన పడింది.

తాజాగా తెలంగాణ పీసీసీ చీఫ్ పీఠం కోసం అధిష్టానం ముగ్గురి పేర్లను పరిగణలోకి తీసుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. రేవంత్ రెడ్డి, జానారెడ్డి, శ్రీధర్ బాబులలో ఎవరో ఒకరు అవుతారని భావించారు. రేవంత్ రెడ్డి వైపు అధిష్టానం దృష్టిసారించినట్లు వార్తలు వచ్చాయి. అయితే పార్టీలోని సీనియర్లు అంతా రేవంత్ కు వ్యతిరేకంగా ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేయడంతో అధిష్టానం తాత్కాలికంగా ప్రక్రియను వాయిదా వేసింది.

కోమటిరెడ్డి ఇప్పటికే ఢిల్లీలో లాబీయింగ్ మొదలుపెట్టారట.. రేవంత్ ను ఈయన అడ్డుకుంటున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇక రెడ్డీలకు కాదనుకుంటే మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పేరు తెరపైకి వచ్చింది. ఈయనకు కాదంటే సీనియర్లు జానారెడ్డి, జీవన్ రెడ్డిల పేర్లు ప్రస్తావనకు వచ్చాయట.. ఇక కాంగ్రెస్ సీనియర్ వీహెచ్ తాతా కూడా తనకే కావాలంటూ పలు ఉదాహరణలు చెబుతున్నాడట..

వీరందరినీ తోసిరాజని తాజాగా మరో వివాదాస్పద నేత పీసీసీ పదవి కోసం ఢిల్లీ బాట పడుతున్నారు. ఆయనే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఈనెల 17న ఢిల్లీకి వెళుతున్నారు. తనకు సీఎం పీఠం వద్దని.. పార్టీని అధికారంలోకి తెస్తానని కొత్త వాదన తెరపైకి తెస్తున్నారు. కాంగ్రెస్ పెద్దలందరినీ కలిసేందుకు ఢిల్లీ బాట పడుతున్నారు. ఇలా ఒక్క పీసీసీ పదవి కోసం కాంగ్రెస్ లో చాంతాడంత క్యూ కనిపిస్తోంది.
Tags:    

Similar News