వివేకా హత్య కేసులో తాజాగా అరెస్టు అయిన శివశంకర్ రెడ్డి ఎవరు?

Update: 2021-11-18 04:56 GMT
దొండ్లవాడు శంకర్ రెడ్డి అలియాస్ శివశంకర్ రెడ్డిగా అందరికి సుపరిచితుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్న అతను సుపరితుడు. దివంగత మహానేత వైఎస్ సోదరుడు వైఎస్ వివేకా హత్య ఉదంతంలో నిందితుడన్న అనుమానంతో సీబీఐ అదుపులోకి తీసుకుంది. బుధవారం హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న అతన్ని హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

ఇటీవల ఆరోగ్యం సరిగా లేకపోవటంతో హైదరాబాద్ లో చూపించుకోవటానికి ఆసుపత్రికి వచ్చారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్న సీబీఐ టీం.. శివశంకర్ రెడ్డిని అదుపులోకి తీసుకోవటానికి హైదరాబాద్ కు చేరుకున్నారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం.. అతన్ని ఆసుపత్రిలో అదుపులోకి తీసుకున్నారు. అయితే.. అధికారికంగా మాత్రం వెల్లడించలేదు.

వివేకా హత్య కేసులో దస్తగిరి ఇచ్చిన సమాచారంతో ప్రిలిమినరీ చార్జిషీట్ లో ప్రధాన నిందితులుగా ఉన్న నలుగురిలో ఒకరు డ్రైవర్ షేక్ దస్తగిరి. ప్రొద్దూటూరు కోర్టులో న్యాయమూర్తి ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో పలు విషయాల్ని వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.

దస్తగిరి వాంగ్మూలంలో వివేక హత్యకు సంబంధించిన ప్లానింగ్ లో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పేరును చెప్పారు. ఇతనితో పాటు కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేరును.. అతని తండ్రి పేరుతో సహా మరికొందరి పేర్లను చెప్పటం సంచలనమైంది.

లింగాల మండలం దొండ్లవాగు గ్రామానికి చెందిన దేవిరెడ్డి మల్లారెడ్డి కొడుకు శివశంకర్ రెడ్డి. చిన్నతనంలోనే పులివెందులకు వచ్చిన అతను వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యాడు.

పట్టణంలోని సుజాత థియేటర్ వెనుక ఉన్న పాల్ రెడ్డి కాలనీలో అతని నివాసం. దివంగత మహానేత వైఎస్ ఉన్నప్పుడు కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. అనంతరం వైసీపీలో చేరి.. రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

కడప ఎంపీ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా చెప్పే అతడు.. పులివెందుల నియోజకవర్గంలో ముఖ్యమైన నేతల్లో ఒకరుగా అతనికి పేరుంది. ‘వైఎస్‌ వివేకానందరెడ్డిని చంపేయ్‌. నువ్వు ఒక్కడివే కాదు మేమూ నీతో పాటు వస్తాం. దీని వెనుక వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, డి.శంకర్‌రెడ్డి వంటి పెద్దవాళ్లు ఉన్నారు.

ఈ హత్య చేస్తే శంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇస్తారు. అందులో రూ.5 కోట్లు నీకు ఇస్తాను’ అంటూ వివేకాకు సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని షేక్ దస్తగిరి చెప్పటమే శివశంకర్ రెడ్డి చుట్టు ఉచ్చు బిగుసుకుంది.
Tags:    

Similar News