వైఎస్ జగన్ ఎవరు?

Update: 2022-12-08 06:29 GMT
జగన్ ఎవరు? .. ఏపీలో ఎవరినైనా ఈ ప్రశ్న అడిగితే ఏ జగన్ అని అడగొచ్చేమో.. కానీ, వైఎస్ జగన్ ఎవరు? అని అడిగారనుకోండి చిన్నపిల్లలు కూడా మీ అజ్ఞానాన్ని చూసి నవ్వుతారు. ఎందుకంటే ఏపీ సీఎంగా ఆయన అంత పాపులర్. అలాంటి వైఎస్ జగన్ ఇంతకీ ఎవరు? అని ప్రజలకు డౌట్ వచ్చేలా.. చివరకు జగన్ కూడా 'ఇంతకీ నేనెవరు?' అనుకునేలా అనుమానాలు పెంచేస్తున్నారు ఆ పార్టీ నాయకులు. అవును... బుధవారం జరిగిన ఆ పార్టీ 'జయహో బీసీ' కార్యక్రమంలో వైసీపీ నేత ప్రసంగాలు వింటే హూ ఈజ్ జగన్ అనుకోవాల్సి వస్తోంది.

'జయహో బీసీ' సభలో ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య వైసీపీ నేతలు సీఎం జగన్‌ను ఒకరిని మించి మరొకరు పోటీపడుతూ పొగిడిపొగిడి వదిలారు. గతంలో ఏ సీఎం కూడా చేయనంత మేలు ఆయన ప్రజలకు చేశారంటూ వారు కీర్తించారు. ఈ క్రమంలో జగన్‌ను ఒక్కొక్కరు ఒక్కోలా పోల్చారు.

బీసీ సంక్షేమ మంత్రి వేణుగోపాలకృష్ణ ఈ సభలో మాట్లాడుతూ.. పేదరికమనే రాక్షసిని పారదోలడానికి మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తారని, ఇప్పుడు జగన్మోహనావతారంలో బీసీలకు సంక్షేమం అందిస్తున్నారని అన్నారు. 85 వేల మంది బీసీలకు పదవులు ఇచ్చిన అభినవ ఫులే జగన్ అని మరో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.

ఇక పొగడ్తల రాణిగా పేరున్న మంత్రి విడదల రజిని అయితే జగన్‌ను వేగుచుక్క అని, వర ప్రదాత అని, బీసీ బంధువు అని పొగిడారు. మరో నేత గుమ్మనూరు జయరాం అయితే బ్రహ్మ, కుబేరుడు వంటివారు కూడా జగన్ ముందు బలాదూర్ అని తేల్చేశారు.

మరోవైపు జగన్ కూడా తమ పార్టీ నేతల పొగడ్తలను బాగా ఎంజాయ్ చేసినట్లు కనిపించారు. వారలా తనను పొగుడుతుంటే ముసిముసినవ్వులు నవ్వుతూ ఎంజాయ్ చేశారు. కాగా ఈ సభలో జగన్ తన ప్రభుత్వం బీసీలకు ఏమేం చేసిందో వివరించారు. దేశంలోనే తొలిసారిగా ఏపీలో శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది తానేనన్నారు.

'నా మనసంతా పేదలే.. నా ఆచరణ బీసీలే' అని చెప్పారాయన. ఏపీ కేబినెట్‌లో 25 మంది మంత్రుల్లో 11 మంది బీసీలే ఉన్నారన్నారు. 2014-19 వరకు చంద్రబాబు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదన్నారు. తాము 8మందిలో నలుగురిని బీసీలను రాజ్యసభకు పంపామన్నారు. మండలికి 32మంది ఎమ్మెల్సీలను పంపితే 18మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉన్నారన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News