జగన్ కేబినెట్ ప్రాథమిక రూపం ఇదే?

Update: 2019-06-06 08:15 GMT
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి  కేబినెట్  ఏర్పాటు ఎలా ఉంటుందనేది సర్వత్రా ఆసక్తిదాయకమైన అంశంగా మారింది. సీఎంగా జగన్ తన కేబినెట్లో ఎవరెవరికి చోటు ఇస్తారనే అంశంపై అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్లోనూ, ప్రజల్లోనూ ఆసక్తి నెలకొని ఉంది.

తొమ్మిదేళ్ల రాజకీయ పోరాటం అనంతరం జగన్ మోహన్  రెడ్డికి అధికారం దక్కింది. ఈ క్రమంలో జగన్ వెంట కొందరు చాలా గట్టిగా నిలబడ్డారు. వైఎస్ మీద ప్రేమతో జగన్ వెంట నిలిచిన, వారు జగన్  మీద నమ్మకంతో కాంగ్రెస్ ను వీడి మరీ వైఎస్సార్సీపీలోకి చేరిన వారు ఉన్నారు. వారిలో కొందరు మంత్రి పదవులను, రాజకీయ ప్రాధాన్యతను కోల్పోయి మరీ జగన్ వెంట నిలిచిన వారు ఉన్నారు.

అలాంటి వారికి జగన్ తన కేబినెట్లో చోటు ఇవ్వడం ఖాయమనే ప్రచారం జరుగుతూ  ఉంది. వైఎస్ మరణించే నాటికి మంత్రులుగా ఉండి, జగన్ పార్టీ పెట్టగానే ఆ పదవులను సైతం వదులుకుని వచ్చిన వారు ఇద్దరున్నారు. వారికి జగన్ ఇప్పుడు తన కేబినెట్లో చోటు కల్పించడం ఖాయమని పరిశీలకులు అభిప్రాయపడుతూ ఉన్నారు.

వారిలో ఒకరు బాలినేని శ్రీనివాస రెడ్డి కాగా మరొకరు పిల్లి సుభాష్ చంద్రబోస్. వారిద్దరికీ వైఎస్ రాజశేఖ రెడ్డి  తన కేబినెట్లో చోటు ఇచ్చారు. ఆయన మరణానంతరం వారు జగన్ వెంట నిలిచారు. దీంతో మంత్రి పదవులను పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు జగన్ వారికి ఆ లోటును భర్తీ చేసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి,

మరోవైపు జగన్ కొందరికి మంత్రి పదవుల హామీలు ఇచ్చారు. వారిలో మర్రి రాజశేఖర్- ఆళ్ల రామకృష్ణా రెడ్డి  ఉన్నారు. ఎన్నికలకు ముందే వీళ్లకు జగన్ మంత్రి పదవులను  హామీగా ఇచ్చారు. కాబట్టి వీరికి ఇప్పుడు జగన్ అవకాశం ఇవ్వడం ఖాయమని సమాచారం.

ఇక ఎంపీ టికెట్ ను త్యాగం చేసిన మేకపాటి రాజమోహన్ రెడ్డికి కూడా జగన్ ఒక ప్రామిస్ చేశారని ప్రచారంజరుగుతోంది. ఆయన తనయుడికి మంత్రి పదవిని ఇవ్వడం విషయంలో జగన్ భరోసాను ఇచ్చారట. ఆ లెక్కన మేకపాటి గౌతమ్  రెడ్డికీ అవకాశం ఖాయమని  విశ్లేషకులు అంటున్నారు.

జగన్ కేబినెట్ రూపల్పన  విషయంలో ఎలాంటి అంతర్గత సమాచారం లేకపోయినా.. ప్రాథమికంగా వీళ్లకు ఛాన్స్ దక్కడం  మాత్రం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ అంశం  మొత్తం మీద రేపు  పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News