రాయలసీమలోనే ఎందుకు పర్యటిస్తున్నారబ్బా ?

Update: 2021-01-28 16:30 GMT
రాయలసీమ అంటేనే జనాల్లో ఒక విధమైన నెగిటివ్ అభిప్రాయం ఉంది. థ్యాంక్స్ టు తెలుగు సినిమాలు. ఒకపుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు రాయలసీమ కేర్ ఆఫ్ అడ్రస్సే అయినా ఇపుడు చాలావరకు తగ్గిపోయింది. ఇపుడు రాయలసీమ అంటే మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఫుల్ స్వీప్ చేసిన పార్టీగా చరిత్రలో నిలిచిపోయింది. అలాంటి జిల్లాల్లో స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పర్యటన పెట్టుకున్నారు.

అసలే ప్రభుత్వానికి, నిమ్మగడ్డకు మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమంటున్న విషయం అందరికీ తెలిసిందే. దానికి తోడు నిమ్మగడ్డతో ప్రభుత్వానికి అనేక పంచాయితీలు నడుస్తున్నాయి. అనేక వివాదాల్లో పంచాయితి ఎన్నికల్లో ఏకగ్రీవాలు ఒకటి. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసినట్లుగానే ప్రస్తుత ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేసేయాలని వైసీపీ నేతలు పట్టుదలతో ఉన్నారు.

ఇలాంటి సమయంలోనే శుక్రవారం అనంతపురం, కర్నూలు జిల్లాల్లోను, శనివారం కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. మరి చిత్తూరు జిల్లాను ఎందుకు వదిలేశారో ఎవరికీ అర్ధం కావటంలేదు. పై జిల్లాల్లో ఎన్నికల నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లపై సమీక్షిస్తారట. పనిలో పనిగా ఎలాగూ వెళుతున్నారు కాబట్టి అధికారులతో నేరుగానే సమీక్షలు చేస్తారట.

మొన్నటి మార్చిలో అర్ధాంతరంగా వాయిదాపడిన స్ధానిక సంస్ధల ఎన్నికలు అంటే జడ్పీటీసీ, ఎంపిటీసీల్లో ఏకగ్రీవమైన వాటిల్లో అత్యధికం వైసీపీ ఖాతాలో పడ్డాయి. అవికూడా రాయలసీమలోనే ఎక్కువ. దాంతో ప్రతిపక్షాలు అధికారపార్టీపై ఫిర్యాదులు చేశాయి. బహుశా దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇపుడు నిమ్మగడ్డ రాయలసీమలోని మూడు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. చూడాలి పర్యటనలో ఇంకెన్ని మంటలు మండిస్తారో


Tags:    

Similar News