గుజరాతీయులు ఏడోసారి కమలం పక్షాన ఎందుకు నిలిచినట్లు?

Update: 2022-12-09 09:30 GMT
ఒక రాజకీయ పార్టీ ఒకసారి అధికారంలోకి వచ్చాక రెండోసారి గెలిచే విషయంలోనే సమస్యలు ఎదురవుతాయి. అలాంటిది రెండు మూడుసార్లు అధికారంలోకి రావటం అంత తేలికైన విషయం కాదు. దాని వెనుక బోలెడంత కసరత్తు జరుగుతూ ఉంటుంది. అలాంటిది ఏడోసారి కూడా అద్భుత విజయాన్ని సొంతం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం అంటే మాటలు కాదు. అలాంటి మేజిక్ ను ప్రదర్శించింది గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ. సాధారణంగా ఒక రాష్ట్రంలో బలమైన నేతలు రాష్ట్రాన్ని వదిలేసి కేంద్రానికి వెళ్లిపోతే.. పార్టీ బలహీనంగా మారటం మామూలే.

అందుకు భిన్నంగా గుజరాత్ రాష్ట్రాన్ని వదిలిని మోడీ.. అమిత్ షాలు తమ చూపునంతా కేంద్రం మీదనే పెట్టిన వేళ.. గుజరాత్ లో పార్టీ బలహీన పడుతుందని భావించారు. 2017 ఎన్నికల్లో తగ్గిన సీట్లు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. కానీ.. ఆ అంచనాలు తప్పన్న విషయాన్ని తాజా ఎన్నికల్లో సాధించిన సీట్లు స్పష్టం చేస్తుంటాయి.

ఏడోసారి విజయాన్ని సాధించటమే లక్ష్యంగా బరిలోకి దిగిన బీజేపీ.. అంచనాలకు మించి మరీ తన సత్తా చాటింది. ఎగ్జిట్ పోల్స్ కంటే మిన్నగా సీట్లను సాధించటం విశేషం. అయితే.. ఆమ్ ఆద్మీ పార్టీ బరిలోకి దిగటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి ఘన విజయం అధికార పార్టీ సొంతమైంది. ఇంతకీ ఏడోసారి ఇంతటి గెలుపు ఎలా సాధ్యమైంది? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి సమాదానం మోడీషాల ఎత్తుగడలే అని చెప్పాలి.

తాము ఢిల్లీకి వెళ్లినా.. కేంద్ర కార్యకలాపాల్లో మునిగితేలినా గుజరాత్ విషయంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధను చూపటం.. రాష్ట్రంలో డెవలప్ మెంట్ యాక్టివిటీస్ కు లోటు లేకుండా చేయటం ఒక ఎత్తు అయితే.. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల వరద కొనసాగేలా చేయటంలో సాధించిన విజయం తాజా గెలుపులో కీలక భూమిక పోషించిందని చెప్పాలి. దీనికి తోడు ప్రభుత్వ ఇమేజ్ ను ఖరాబు చేసే నేతల విషయంలో అధినాయకత్వం కఠినంగా వ్యవహరించటం కూడా లాభం చేకూరేలా చేసింది.

పట్టణ ఓటర్లకు గ్రామీణ ఓటర్లు దన్నుగా నిలవటం.. 2017లొ పార్టీకి దూరమైన పటేల్ వర్గీయులు తిరిగి పార్టీకి ఓటు వేయటంతో అద్బుత విజయం సాధ్యమైంది. దీనికి తోడు.. తేడా వస్తే ఎంతటి వారిపైన అయినా సరే వేటు వేయటమే అన్న విషయాన్ని మోడీషాలు స్పష్టం చేయటం తెలిసిందే. పని తీరుపై తేడా రావటంతో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న విజయ్ రూపాణీ తో సహా మొత్తం కేబినెట్ మీద వేటు వేయటం తెలిసిందే. అంతేకాదు ఈసారి ఎన్నికల్లో 42 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చే విషయంలో కఠినంగా వ్యవహరించటం కూడా లాభించింది.

తప్పు చేసిన వారికి తగిన శిక్ష వేసే విషయంలో మోడీ వెనక్కి తగ్గరన్న సంకేతం పార్టీకి మంచి ఫలితాన్ని ఇచ్చేలా చేసిందని చెప్పొచ్చు. దీనికి తోడు ప్రతిపక్షంలో బలమైన నేత లేకపోవటం కూడా బీజేపీకి లాభం చేకూరేలా చేసింది. ఇలా సానుకూలతలన్ని కలిసి ఏడోసారి గుజరాత్ లో కమల వికాసం అయ్యేలా చేశాయని చెప్పాలి. 




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News