యోగీని కుర్చీ దించ‌డం ఎందుకు ఆగిపోయిందంటే...

Update: 2021-06-15 05:30 GMT
ఉత్తరప్రదేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ గ‌త కొద్దికాలంగా త‌న‌దైన శైలిలో వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవల యూపీ నాయకత్వాన్ని మారుస్తారంటూ వచ్చిన వార్తలు దీనికి ప్ర‌ధాన కార‌ణం కాగా, యోగి ఢిల్లీ పర్యటన మ‌రింత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, యోగి ఎపిసోడ్‌తో కాషాయపార్టీలో కలకలం మొదలైంది. కరోనా నివారణలో విఫలం అయ్యార‌ని పేర్కొంటూ యోగిని దించేస్తే బీజేపీ ఓట్లు చీలుతాయేమోన్న ఆందోళనలో అధిష్టానం తలలు పట్టుకుంటున్న‌ట్లు స‌మాచారం.

 కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో యోగి స‌ర్కారు వైఫల్యం చెందిందంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశాయి. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో ఓటమిపాలైంది. సాధారణంగా అధికార పార్టీయే అధిక స్థానాలను గెలుచుకుంటుంది. అందుకు విరుద్ధంగా బీజేపీ మూడోవంతు స్థానాలకే పరిమితమైంది. దీంతో యోగి తీరుపై మంత్రులు, ఎంపీలు బహిరంగంగానే విమర్శలకు దిగారు. దీంతో బీజేపీ యూపీపై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టింది. ఇటీవల ప్రధాని సన్నిహితుడిగా పేరుపొందిన మాజీ ఐఏఎస్‌ అధికారి ఎకె శర్మను హడావుడిగా ఎమ్మెల్యేను చేయడం, యూపీ మంత్రివర్గంలో ఆయనకు కీలక స్థానం కల్పించడం యోగికి చెక్‌ పెట్టేందుకే అన్న చ‌ర్చ సైతం జరిగింది. ఇదే స‌మ‌యంలో యోగి ఢిల్లీ ప‌ర్య‌ట‌న మ‌రింత చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే, యోగిని ఇప్ప‌ట్లో ప‌ద‌వి నుంచి దించే చాన్స్ లేదంటున్నారు.

యోగికీ హిందూ నేతగానూ గుర్తింపు ఉంది. సీఎం పదవి నుంచి తప్పిస్తే.. కల్యాణ్‌సింగ్‌, యడియూరప్ప, ఉమాభారతి, కేశూభాయ్‌ పటేల్‌లాగా ఎదురుతిరగవచ్చని అధిష్టానం భావిస్తోంది. దీంతో హిందూ ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తోంది. క‌రోనా క‌ల‌క‌లం నేప‌థ‌క్యంలో మోడీ ప్రతిష్ట దిగజారుతుంద‌న్న టాక్ మ‌రోవైపు ఉంది. ఈ తరుణంలో ఆయన ప్రచారంతో యూపీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు వస్తాయన్న నమ్మకం లేదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ నేత జితిన్‌ ప్రసాదను పార్టీలోకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. అప్నాదళ్‌ నేత అనూప్రియా పటేల్‌, నిషాద్‌ పార్టీకి చెందిన సంజరు నిషాద్‌తోనూ అమిత్‌షా చర్చలు జరిపినట్టు సమాచారం. మొత్తంగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యూపీ విష‌యంలో బీజేపీ ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తోంది.
Tags:    

Similar News