అన్ని దేశాలు బురఖా నిషేధించాయా..! కారణాలు ఏంటో?

Update: 2021-03-12 01:30 GMT
బుర‌ఖా అనేది ఓ మ‌తానికి సంబంధించిన సంప్ర‌దాయం. కానీ.. దాన్ని అడ్డం పెట్టుకొని చాలా మంది దుండ‌గులు నేరాల‌కు పాల్ప‌డుతున్నార‌నే వాద‌న చాలా కాలంగా ఉంది. చేయాల్సిన త‌ప్పుల‌న్నీ చేస్తూ బుర‌ఖాల మాటున దాచుకుంటున్నార‌నేది కొంద‌రి వాద‌న‌. అందుకే.. నేరాల నియంత్ర‌ణ‌కు బుర‌ఖాను నిషేధించాల‌ని డిమాండ్ చేస్తుంటారు. ఇది ఈ నాటిది కాదు.. ఎంతో కాలంగా ఉన్న‌దే. అయితే.. ఎవ‌రో చేసిన‌, చేస్తున్న త‌ప్పుల‌కు త‌మ త‌మ‌సంప్ర‌దాయాల‌పై ఆంక్ష‌లు విధించడం స‌రికాదు అంటూ వ‌స్తున్నారు ఆ మ‌త‌స్థులు. చాలా ఏళ్లుగా సాగుతున్న ఈ వాదోప‌వాదాల త‌ర్వాత.. నేర నివార‌ణే ముఖ్య‌మంటూ ప‌లు దేశాలు బుర‌ఖా నిషేధించాయి. అవేంటీ..? ఆ దేశాలు చెబుతున్న కార‌ణాలు ఏంట‌నేది చూద్దాం.

స్విట్జ‌ర్లాండ్ః బుర‌ఖాను నిషేధిస్తూ తాజాగా నిర్ణ‌యం తీసుకున్న దేశం స్విస్‌. ఈ దేశంలోనూ చాలా ఏళ్ల వాదాల అనంత‌రం ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక్క‌డ బుర‌ఖాను మాత్ర‌మే కాదు.. ముఖాన్ని క‌ప్పి ఉంచే ఏ వ‌స్త్ర‌ధార‌ణ అయినా అనుస‌రించొద్ద‌ని, అలా ధ‌రించి బ‌హిరంగ ప్ర‌దేశాల్లోకి రావొద్ద‌ని ఆ దేశం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు దేశంలో రెఫ‌రెండం కూడా నిర్వ‌హించారు. అయితే.. ఆ దేశంలో బుర‌ఖాను ధ‌రించే మ‌తం వారు మైనారిటీగా ఉండ‌డంతో నిర్ణ‌యం వారికి వ్య‌తిరేకంగానే వ‌చ్చింది. ఈ రెఫ‌రెండం ప్ర‌కారం.. ఆ దేశంలో ఇక మీద ఎవ్వ‌రూ ముఖాల‌ను క‌ప్పి ఉంచే బుర‌ఖాతోపాటు మ‌రేవిధ‌మైన వ‌స్త్ర‌ధార‌ణ కూడా అనుస‌రించ కూడ‌దు.

ఫ్రాన్స్ః ఈ దేశంలోనూ బుర‌ఖా ధ‌రించ‌డం నిషేధం. ఈ మేర‌కు 2010లో చ‌ట్టం చేశారు. ఈ చ‌ట్టం అమ‌ల్లోకి రావ‌డానికి ముందు చాలా ఆందోళ‌న‌లు జ‌రిగాయి. నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. వాదోప‌వాదాలు సాగాయి. ఇది త‌మ మ‌తాన్ని టార్గెట్ చేయ‌డ‌మేన‌ని కొంద‌రు వాదించారు. మ‌రికొంద‌రు.. ఇది ర‌క్ష‌ణ విష‌యం మాత్ర‌మే కాద‌ని, అంత‌కు మించి ఉంద‌న్నారు. మ‌త సంప్ర‌దాయాల పేరుతో మ‌హిళ స్వేచ్ఛ‌ను హ‌రించ‌డం అని వ్యాఖ్యానించారు. ఫైన‌ల్ గా ఫేస్ క‌వ‌ర్ చేసే డ్రెస్ ఏదైనా నిషేధ‌మ‌ని నిర్ణ‌యించారు.

ఇంకా... నెద‌ర్లాండ్స్ ఆస్ట్రియా, డెన్మార్క్‌, బ‌ల్గేరియా వంటి దేశాలు కూడా బుర‌ఖాను నిషేధించాయి. నెద‌ర్లాండ్స్‌లో బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ముఖం క‌ప్పుకుంటే దాదాపు 150 యూరోల ఫైన్ విధిస్తారు. ఆస్ట్రియాలో 2017 నుంచి ఈ చ‌ట్టం అమ‌ల్లోకి వ‌చ్చింది. ఇక్క‌డ కూడా నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మిస్తే 150 యూరోల జ‌రిమానా విధిస్తారు. డెన్మార్ లో 2018 నుంచి ఉనికిలోకి వ‌చ్చిన ఈ చ‌ట్టాన్ని ఉల్లంఘిస్తే.. 135 యూరోల ఫైన్ క‌ట్టాల్సిందే. బ‌ల్గేరియాలో 2016 నుంచి ఈ విధానం చ‌ట్టంగా మారింది. ఇక్క‌డ నిబంధ‌న‌ల‌ను ఖాత‌రు చేయ‌కుంటే పెద్ద జ‌రిమానా విధిస్తారు. దాదాపు 750 యూరోల ఫైన్ క‌ట్టిస్తారు. అయితే.. ప్రార్థ‌న‌లు చేసుకునే ప్రాంతాల్లో, ప‌ని ప్ర‌దేశాల్లో మాత్రం మిన‌హాయింపు ఇచ్చారు.
Tags:    

Similar News