ఏపీలో జీవో 2430 మళ్లీ ఎందుకంత హాట్ టాపిక్ అవుతోంది?

Update: 2020-11-29 12:30 GMT
ప్రభుత్వాలు ఏవైనా.. ప్రభుత్వాధినేతలు ఎవరున్నా..కొన్ని అంశాల్ని వీలైనంతవరకు టచ్ చేయకుండా ఉంటే మంచిది. ఆ కోవలోకే వస్తుంది మీడియాకు కళ్లాలు వేసే ప్రభుత్వ నిర్ణయాలు. కొన్ని నెలల క్రితం జీవో నెంబరు 2430 పేరుతో ఏపీ సర్కారు ఒక ఆదేశాన్ని జారీ చేసింది. అందులో.. మీడియా మీద తీసుకునే చర్యల్ని ప్రస్తావించారు. ప్రభుత్వ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ప్రచారం చేసినా.. అవాస్తవాల్ని అదే పనిగా ప్రస్తావిస్తుంటే.. వారిపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

నిజానికి తప్పుడు కథనాలు రాసిన మీడియా సంస్థ మీద చర్యలు తీసుకోవటానికి.. సదరు కథనాల్ని ప్రసారం చేసే వారిపై న్యాయపోరాటానికి ఇప్పటికే అవసరమైనన్ని వేదికలు ఉన్నాయి. అలాంటప్పుడు ప్రత్యేకంగా జీవో తీసుకురావటం వల్ల ఒనగూరే ప్రయోజనం పెద్దగా ఉండదు. కానీ.. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని.. పత్రికా స్వేచ్ఛ పేరుతో చర్చ జరిగేందుకు అవకాశం ఇస్తుంటాయి.

ప్రభుత్వం ఏదైనా సరే.. మీడియాను స్వేచ్ఛగా వదిలేస్తేనే మేలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియాకు.. సోషల్ మీడియా తోడైన నేపథ్యంలో.. ఏ విషయాన్ని ఆపటం సాధ్యం కాదు. ఒకవేళ ఆపే ప్రయత్నంచేస్తే.. స్వేచ్ఛకు ముకుతాళ్లు వేసినట్లుగా భావిస్తారే తప్పించి.. దాన్ని సానుకూలంగా తీసుకునే అవకాశం ఉండదు. అందుకే.. మీడియాకు కొత్తగా పరిమితులు తెస్తున్నామన్నట్లుగా ఆదేశాలు జారీ చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.

ఇదిలా ఉంటే.. ఏపీ ప్రభుత్వం తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో మీడియా పాయింట్ ను అనుమతించమని పేర్కొనటం వివాదంగా మారింది. ఈ నెల 30 (సోమవారం) నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతన్నాయి. కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ ను ఏర్పాటు చేసే అంశంపై ఏపీ సర్కారు భిన్నమైన నిర్ణయాన్ని తీసుకుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియాను అనుమతించటం లేదు.

దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. లోక్ సభ సమావేశాలకు సైతం మీడియాను అనుమతించినప్పుడు.. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు అనుమతించరని ప్రశ్నిస్తున్నారు. లాజిక్ గా చూస్తే నిజమే అన్న భావన కలుగక మానదు. ప్రాక్టికల్ గా చూస్తే.. ఇటీవల పెరిగిన మీడియా సంస్థల పుణ్యమా అని.. భౌతిక దూరం అన్నది లేకుండా వ్యవహరించే వీలుంది. అందుకే.. ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

అయితే.. ప్రజాస్వామ్యంలో కీలకమైన మీడియాను అసెంబ్లీ సమావేశాలకు అనుమతించకుండా ఉండటం సరికాదన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం వ్యవహరించే వైఖరిని వేలెత్తి చూపించేలా ఉంటుందన్నది మర్చిపోకూడదు. అవసరమైతే.. కఠిన నిబంధనల్ని అమలు చేయటం.. కోవిడ్ వ్యాప్తికి మీడియా ప్రతినిధులు ఎట్టి పరిస్థితుల్లో కారణం కాదన్న ట్లుగా వ్యవహరిస్తే మంచిదని చెప్పక తప్పదు. తాజాగా తీసుకున్ననిర్ణయంతో అప్పటి జీవో మరోసారి తెర మీదకు వచ్చి చర్చకు కారణమవుతోంది.
Tags:    

Similar News