కోజికోడ్ ఎయిర్ పోర్టును టేబుల్ టాప్ అని ఎందుకంటారు?

Update: 2020-08-08 04:00 GMT
యావత్ దేశం ఒక్కసారి ఉలిక్కిపడటమే కాదు.. ఇటీవల కాలంలో ఇంత దారుణమైన విమాన ప్రమాదం చోటు చేసుకున్నది లేదు. ఇంతటి విషాదంలోనూ ఓదార్పు.. విమానంలోని చాలామంది క్షేమంగా బయటపడటం. రన్ వే నుంచి యాభై అడుగుల లోతులోకి విమానం జారి పడినప్పటికీ  మంటలు రేగకపోవటంతో మహా విషాదం కాస్తలో తప్పినట్లైంది. ఈ ప్రమాద సమయాన.. కోజికోడ్ ఎయిర్ పోర్టును టేబుల్ టాప్ ఎయిర్ పోర్టుగా అభివర్ణించారు. ఇంతకీ టేబుల్ టాప్ ఎయిర్ పోర్టు అంటే ఏమిటన్న సందేహం పలువురికి కలిగింది.

రన్ వేను ఒక టేబుల్ గా ఉండటం.. దానికి ఇరువైపులా చిన్నపాటి లోయలా ఉండే ఎయిర్ పోర్టుల్ని టేబుల్ టాప్ రన్ వేగా వ్యవహరిస్తారు. దేశంలో కోజికోడ్ తో పాటు.. కశ్శీర్ లో లేహ్ లోనూ.. కర్ణాటకలోని మంగళూరులోనూ ఇదే తరహాలో ఎయిర్ పోర్టులు ఉన్నాయి. కొండల మధ్యలోని పీఠభూముల్లో ఈ విమానాశ్రయాల్ని నిర్మించారు. టేబుల్ టాప్ ఎయిర్ పోర్టుల్లో రన్ వేకు ఒకవైపు కానీ.. రెండు వైపుల కానీ లోయలు ఉంటాయి. ఏ మాత్రం అదుపు తప్పినా అంతే అన్నట్లుగా పరిస్థితి. అందుకే.. ఈ తరహా ఎయిర్ పోర్టుల్లో మిగిలిన వాటితో పోలిస్తే.. మరింత అప్రమత్తంగా ల్యాండ్ చేయాల్సి ఉంటుంది.

ఇలాంటి విమానాశ్రయాల్లో సుదీర్ఘమైన అనుభవం ఉన్న పైలెట్లు కూడా చాలా జాగ్రత్తగా ల్యాండ్ చేయాల్సి ఉంటుంది. ఒకవిధంగా చెప్పాలంటే.. మిగిలిన ఎయిర్ పోర్టులతో పోలిస్తే.. కోజికోడ్ లాంటి టేబుల్ టాప్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేయటం సవాలుతో కూడుకున్న పని. దాదాపు పదేళ్ల క్రితం కర్ణాటకలోని మంగళూరు ఎయిర్ పోర్టులోనూ ఇదే తరహాలో ప్రమాదం చోటు చేసుకోవటం.. ఆ సందర్భంగా 158 మంది ప్రయాణికులు.. సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ప్రమాదం జరిగింది కూడా అదే తరహాలో టేబుల్ టాప్ ఎయిర్ పోర్టులోనే కావటం గమనార్హం.
Tags:    

Similar News