హలాల్ మాంసంవడ్డిస్తారా? ... ఇండిగోపై నెటిజన్ల నిరసన

Update: 2019-07-13 12:18 GMT
ఇండిగో టైం అస్సలు బాగున్నట్లు లేదు. ఇటీవల ఏదో ఒక వివాదం సంస్థను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇటీవల తరచూ నెగెటివ్ గా వార్తల్లోకి వస్తున్న ఇండిగో తాజాగా ప్రయాణికులు వడ్డించే మాంసాహారంపై వచ్చిన కంప్లయింట్ విషయంలో ఎలా స్పందించాలో తెలియక సతమతం అవుతోంది. సున్నితమైన మత సంబంధిత వ్యవహారం కావడంతో ఇండిగోకు ఇదో పెద్ద చిక్కుముడిలా ఉంది.

వివిధ మతాలకు భిన్నరకాల సంప్రదాయాలుంటాయి. కానీ అందరికీ వేరువేరుగా వడ్డించడం కష్టం కాబట్టి వ్యాపార సంస్థలు ఏదో ఒకదాన్ని ఫాలో అవుతాయి. సాధారణంగా మాంసాహారం విషయంలో ముస్లింలు హలాల్ చేయకపోతే అసలు ఆ మాంసం ముట్టరు. అందుకే బయట హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యాపార సంస్థలు హలాల్ మాంసాన్ని వినియోగిస్తాయి. దీనిని మెనులో ప్రత్యేకంగా మెన్షన్ చేస్తాయి. ఇపుడు అదే ఇండిగోకు తలనెప్పులు తెచ్చిపెట్టింది.

ఇండిగో ఎయిర్‌లైన్స్ లో ప్రయాణికులకు సరఫరా చేసిన మాంసాహార పార్సిల్ పై ''ఇది హలాల్ చేసిన మాంసం'' అని రాసి ఉండటంపై ఓ ఇతర మతస్థుడు (దేవ్ దత్త మాజి) అభ్యంతరం చెబుతూ ఇండిగోకు కంప్లయింట్ చేశారు. వెంటనే హలాల్ మాంసం వడ్డించడం ఆపండి. ఇది క్రూరం. హిందు, సిక్కు మత సిద్ధాంతాలకు వ్యతిరేకం అని అతను హెచ్చరిస్తూ ట్వీట్ పెట్టారు. చిత్రం ఏంటంటే.. అతని నిరసన ఓ క్యాంపెయిన్ లా మారింది. చాలా మంది అతనితో ఏకీభవిస్తూ మద్దతు పలుకుతున్నారు.

అతనికి మద్దతు పలికిన వారు ''ఇది తరచుగా జరుగుతోంది. హలాల్ చేసిన మాంసం వడ్డించడం ద్వారా హిందువులు సిక్కుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఇండిగో యాజమాన్యం చేసిన తప్పును వెంటనే సరిదిద్దుకోవాలి హలాల్ మాంసం అమ్మకాలు ఆపేయాలి'' అంటూ నినదిస్తున్నారు. మీరు ఆపక పోతే హిందువులు ఇండిగోను బ్యాన్ చేస్తారు అంటూ ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు.

ఇక్కడ ఓ ఆసక్తికరమైన విషయం గమనించాలి. ప్రస్తుతం విమానయాన శాఖ మంత్రి సిక్కు మతస్థుడు అయిన హర్దీప్ సింగ్ పూరీ. దీంతో ఆయనకు ఓ నెటిజన్ తన ట్వీట్‌ను ట్యాగ్ చేశారు. అంతేకాదు, ఇండిగో హలాల్ మాంసం వడ్డించడాన్ని మీరు సమర్థిస్తారా అంటూ ప్రశ్నించి మంత్రిని కూడా వివాదంలోకి లాగాడు. హిందువుల మనోభావాలకు కార్పొరేట్ సంస్థలు విలువ ఇవ్వవా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. 

హలాల్ పై హిందువుల వాదన ఏంటి?
ఖురాన్ గ్రంథం ప్రకారం ఆరోగ్యకరమైన జంతువును గొంతుకోసి వధించి మాత్రమే తినాలి. అలా చేయని మాంసాహారం తినకూడదు. ఇలా గొంతుకోసినపుడు ఆ జీవిలో ఉన్న రక్తం మొత్తం తీసేస్తారు. ఆ సమయంలో ప్రత్యేక మంత్రం చదువుతారు. దాని అర్థం ఆ పాపం మాది కాదు అని.  అయితే ఇలా చేయడాన్ని కొందరు హిందువులు వ్యతిరేకిస్తారు. హలాల్ విధానం వల్ల ఆ జీవి నరకయాతన అనుభవిస్తూ చనిపోతుందని, అలాంటి మాంసం భుజించిన వారిలో సున్నితత్వం నశిస్తుందని కొందరు వాదిస్తారు.

అయితే, ప్రపంచమే ఓ కుగ్రామం అయినపుడు అన్నిమతాల వ్యక్తులు ప్రయాణికుల్లో ఉన్నపుడు అందరి విధానాలు అవలంభించడం సాధ్యం కాదన్నది కార్పొరేట్ల ఆవేదన. మాంసాహారంతో పాటు ఇతర ఆప్షన్లు ఉన్నపుడు వివాదం ఎందుకు... అదొక్కటే ఆప్షన్ అయితే దానిని పరిగణలోకి తీసుకోవాలి వారు కోరుతున్నారు. మరి ఈ క్యాంపెయిన్ ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.

   
   
   

Tags:    

Similar News