కాలేజీ కుర్రాడు కాదు.. కరుడుగట్టిన ఉగ్రవాది

Update: 2015-08-05 18:18 GMT
నూనూగు మీసాలు.. పసిప్రాయం పోని ముఖం.. ఒక్కసారి చూస్తే పక్కింటి కుర్రాడి కనిపించే వీడు.. కరుడుగట్టిన ఉగ్రవాది. ఉగ్రవాదాన్ని నరనరాన జీర్ణించుకొని.. దేశంలో కలకలం సృష్టించి.. అమాయకుల ప్రాణాలు తీసుకునేందుకు వచ్చిన మానవ మృగం.

జమ్ముకాశ్మీర్ లోని ఉధంపూర్ లో ముగ్గురు సైనికుల మరణానికి కారణం కావటంతో పాటు.. పలువురికి గాయాలు కావటంతో పాటు.. దేశంలో కల్లోలం సృష్టించేందుకు వచ్చిన మూకలో వీడొకడు. బీఎప్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేసి.. వారి కాల్పులతో పారిపోయిన ఉగ్రవాదుల్లో ఒకడు ప్రాణాలతో చిక్కాడు.

కసబ్ తర్వాత.. దేశంలోకి అడుగు పెట్టిన ఉగ్రవాదుల్లో ప్రాణాలతో పట్టుకున్నది ఇతడ్నే. జవాన్లపై దాడి తర్వాత పారిపోతూ.. సమీపంలోని ఒక గ్రామం నుంచి ఐదుగురిని బందీలుగా చేసుకున్నాడు. వారిని నాలుగు కిలోమీటర్ల పాటు కొండపై అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి.. తనను సురక్షితంగా తప్పించుకునే దారి చూపించాలని లేదంటే.. చంపేస్తానని బెదిరించాడు.

ఇతగాడి దగ్గర బంధీలుగా ఉన్న ఐదుగురిలో ఇమ్రాన్ తో పాటు.. రాకేశ్ కుమార్ సింగ్.. విక్రమ్ జీత్ సింగ్ తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. రాకేశ్.. విక్రమ్ లు ఇద్దరు వరుసకు బావ.. బావమరుదులు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదిని సరిహద్దులు దాటించకూడదని.. అతగాడ్ని పట్టుకోవాలని భావించారు. వీరికి ఇమ్రాన్ తోడయ్యాడు.

మొదట.. ఇమ్రాన్ ఒక్కసారి ఉగ్రవాది మీదకు లఘించటం.. బావ బావమరుదులు ఇద్దరూ ఒడుపుగా పట్టుకొని పట్టు బిగించి.. అతడ్ని విడిచి పెట్టకుండా గట్టిగా పట్టుకున్నాడు. వీరితో దాదాపు అరగంటసేపు పెనుగులాడిన ఉగ్రవాది.. చివరకు తన వల్ల కాదని ఆగిపోయినట్లు చెబుతున్నాడు. తనను బంధిస్తున్న వారికి దొరక్కుండా ఉండేందుకు ఉగ్రవాది తన దగ్గరున్న ఏకే 47 రైఫిల్ తో కాల్పులు జరుపుతున్నా.. ఈ బావ.. బావమరుదులు ఇద్దరూ వెనక్కి తగ్గలేదని చెబుతున్నారు.

మొదట బెదిరించిన ఉగ్రవాది.. తర్వాత బతిమిలాడినట్లు చెబుతున్నారు. తనను వదిలేస్తే.. పాకిస్థాన్ పారిపోతానని.. తనకు పాకిస్థాన్ దారి చూపించాలని వేడుకున్నట్లు చెబుతున్నారు. అయితే.. అతడ్ని పట్టుకున్న ఈ ముగ్గురూ.. వాడు పారిపోయేందుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా.. అలానే బంధించారు. అదే సమయంలో సైనికుల శబ్దాలు రావటం.. వారికి సమాచారం ఇవ్వటంతో ఈ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు.

ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్న సైనికులు.. అతగాడి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. అయితే.. కొద్దిసేపట్లోనే నాలుగు పేర్లు మార్చేసి.. కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశాడు. మొదట తన పేరు ఖాసింఖాన్ అని.. వాసిం ఖాన్.. తర్వాత నావేద్.. ఖురేష్ అని పేర్లు మార్చి చెప్పాడు. ఉగ్రవాద శిక్షణలో మార్చి.. మార్చి పేర్లు చెప్పాలని నూరిపోయటం తెలిసిందే. శిక్షణ సమయంలో పట్టుబడితే.. ప్రాణాలు తీసుకోవటానికైనా వెనుకాడకూడదన్న నిబంధన ఉన్నా.. ఉధంపూర్ యువకుల ధైర్యసాహసాలతో ఉగ్రవాది చేతికి చిక్కాడు.

పట్టుబడిన ఉగ్రవాదిని అక్కడకు చేరుకున్న మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వర్షం కురిపిస్తే.. అతడు నవ్వుతూనే ఉన్నాడు తప్పించి.. ముఖంలో ఎలాంటి భయం లేకపోవటం గమనార్హం. దొరికిపోయానన్న ఆందోళన కూడా అతనిలోకనిపించకుండా ఉండటం గమనార్హం.

ఇక.. ఈ ఉగ్రవాది పేరు ఉస్మాన్ ఖాన్.. అలియాస్ నావెద్ గా భావిస్తున్నారు. ఇతడు పాకిస్థాన్ లోని ఫైసలాబాద్ లోని గాం ముహమ్మదాబాద్ కు చెందినవాడిగా భావిస్తున్నారు. ఇతనికి ఇద్దరు సోదరులు.. ఒక సోదరి ఉన్నట్లు చెబుతున్నారు. ఉగ్రవాది సోదరుల్లో ఒకరు లెక్చరర్ గా పని చేస్తున్నట్లు చెబుతున్నారు. లష్కర్ ఎ తొయిబా ద్వారా ఆత్మాహుతి దాడి శిక్షణ కూడా పొందినట్లుగా భావిస్తున్నారు. చాలా తక్కువ ఆయుధాలు ఇచ్చి దేశ సరిహద్దులు దాటించారని.. స్లీపర్ సెల్ ద్వారా ఆయుధాలు అందుతాయని చెప్పి పంపినట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News