చిన్నమ్మ కొత్త ఎత్తు వర్కువుట్ అవుతుందా? ఫోన్ కాల్ లో ఏం చెబుతున్నారు?

Update: 2021-07-04 03:30 GMT
కొన్ని రంగాల్లోకి రావటమే కానీ పోవటం అంటూ ఉండదు. ఒకవేళ.. మధ్యలో వెళ్లిపోతున్నట్లు చెప్పినా.. కొన్నాళ్లకే తమ మాటను మార్చేసుకొని తిరిగి వచ్చేయటం కనిపిస్తుంది. సినిమా రంగంతో పాటు రాజకీయ రంగాల్లోని వారిలో ఈ తీరు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. తాజాగా తమిళనాడు చినమ్మ కమ్ శశికళ ఇప్పుడు అలాంటి తీరునే ప్రదర్శిస్తున్నారు. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు కాస్త ముందుగా జైలు నుంచి విడుదలైన ఆమె.. రాజకీయంగా చక్రం తిప్పుతారని భావించారు.

అందుకు భిన్నంగా ఆమె.. తాను రాజకీయాల నుంచి పక్కకు తప్పుకుంటున్నట్లుగా ప్రకటించి.. ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే.. ఇదంతా బీజేపీ నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే.. అలా చేశారన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తన చుట్టూ ప్రతికూల వాతావరణం ఉన్న వేళలో.. కమలనాథుల కోపానికి గురయ్యే కంటే.. కొంత కాలం కామ్ గా ఉండటమే మంచిదన్నట్లుగా ఉన్న ఆమె.. రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లుగా చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల వేళ.. మౌన ముద్రను వేసిన ఆమె అలా ఉండిపోయారు.

ఎన్నికల్లో అన్నాడీఎంకే - బీజేపీ కూటమి అట్టర్ ప్లాప్ కావటమే కాదు..దారుణ ఓటమిని మూట కట్టుకుంటున్న వేళ.. ఆమెలో కొత్త ఆశలు చిగురించాయని చెప్పాలి. అన్నాడీఎంకే నేతలకు రహస్యంగా ఫోన్లు చేసి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్న ఆమె.. సరైన సమయంలో రీఎంట్రీ ఇవ్వాలన్నట్లుగా ప్లాన్ చేస్తున్నారు. చిన్నమ్మతో ఫోన్లు మాట్లాడిన వారిపై చర్యలు తీసుకునేందుకు కత్తులు నూరుతున్నారు మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి. ఇలా అన్నాడీఎంకేలో కలకలం రేపిన చిన్నమ్మ.. తాజాగా తన రీఎంట్రీకి సంబంధించిన సంకేతాల్ని ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.

తాజాగా ఆమె అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యేలు కామరాజ్, పార్దిబన్, శివగంగై జిల్లాకు చెందిన ఉమాదేవన్, దిండుగల్లుకు చెందిన అరుస్వామి, చెన్నై తాంబరానికి చెందిన నారాయణన్‌లతో ఫోన్లో మాట్లాడారు. దీనికి సంబంధించిన సంభాషణ వివరాలు బయటకు వచ్చాయి. సెల్ లో మాట్లాడుకున్న వారి మాటలు ఎలా సాగాయన్న దానిపై స్పష్టత రావటంతో పాటు.. ఆమె తన భవిష్యత్తు కార్యాచరణను సదరు నేతలతో పంచుకున్నట్లుగా తెలుస్తోంది. అన్నాడీఎంకే నేతలతో చిన్నమ్మ మాటలు ఎలా సాగాయన్న దానికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.

‘ఎంజీ రామచంద్రన్, జయలలిత మనల్ని విడిచివెళ్లినా వారి ఆత్మ మనందరినీ గమనిస్తూనే ఉంది. అన్నాడీఎంకే శ్రేణుల నుంచి గత నాలుగేళ్లగా నాకు ఉత్తరాలు అందుతున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైన తరువాత కూడా వస్తున్న ఉత్తరాలను చదివినపుడు ఎంతో ఆవేదన కలుగుతోంది. అన్నాడీఎంకేను అమ్మ జయలలిత ఎలా నడిపించారో అలానే నడిపించాలని ఆశిస్తున్నాను. ఈనెల 5వ తేదీతో లాక్‌డౌన్‌ ముగుస్తుందని అంటున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేయగానే చెన్నై మెరీనా బీచ్‌లోని జయ సమాధి వద్దకు వెళ్లి అక్కడి నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటన ప్రారంభిస్తాను’ అని వారితో చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది.

ఇదంతా చూస్తే.. ఎంజీఆర్.. జయలలిత పేర్లతో ఆమె తన రాజకీయాల్ని షురూ చేస్తారని ఇట్టే అర్థమవుతుంది. మరి.. ఆమె ఆశించినంతగా అన్నాడీఎంకే నేతలు.. కార్యకర్తల్లో కదలిక ఉంటుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

చిన్నమ్మ నోటి నుంచి వచ్చే అమ్మ మాటలు అన్నాడీఎంకే నేతల్లో ఎంతమేర భావోద్వేగాన్ని గురి చేస్తాయన్న దాని అనుగుణంగానే శశికళ భవిష్యత్తు రాజకీయాలు ఉంటాయని చెప్పక తప్పదు. ఏమైనా.. తమిళనాడులో లాక్ డౌన్ ఎత్తేసినంతనే కీలక రాజకీయ పరిణామాలకు తెర లేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News