అమ్మో.. వైద్యఆరోగ్యశాఖనా?

Update: 2021-05-02 03:30 GMT
తెలంగాణ ప్రభుత్వంలో ‘వైద్యఆరోగ్యశాఖ’ తీసుకుంటే వాళ్ల పదవి గోవిందా? అని నీలాపనిందలతో అవమానంగా వైదొలగాల్సి వస్తుందన్న సెంటిమెంట్ మరోసారి బయటపడింది. వారి మంత్రి పదవి పోయి డమ్మీలుగా ఆ నేతలు మారిపోతారన్న ప్రచారం సాగుతోంది.

తాజాగా తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి అయిన ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు రావడం.. అవమాన కర రీతిలో ఈటలను సీఎం కేసీఆర్ తొలగించడం తెలంగాణ రాజకీయవర్గాల్లో సంచలనమైంది. నిజానికి   ఈటల తొలి తెలంగాణ ఉద్యమకారుడు.. చాలా మంచి నాయకుడు.. ప్రజలకు అందుబాటులో ఉండే డైనమిక్ తెలంగాణ లీడర్ గా పేరు పొందాడు. కానీ ఆయన కూడా ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేయలేదని అంటున్నారు.

తెలంగాణ తొలి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా వైద్య ఆరోగ్యశాఖను నిర్వహించిన తాటికొండ రాజయ్య కూడా ఇలానే కొద్ది నెలల్లోనే పలు ఆరోపణలతో మంత్రి పదవి కోల్పోయారు. కేసీఆర్ ఏకంగా ఆయనను మంత్రి వర్గంలోంచి బర్తరఫ్ చేసేశారు.

ఆ తర్వాత లక్ష్మారెడ్డికి వైద్య ఆరోగ్యశాఖను కేసీఆర్ అప్పగించారు. అయితే రెండోసారి రాష్ట్రంలో టీఆర్ఎస్ గెలిచాక అసలు లక్ష్మారెడ్డికి కేబినెట్ లో చోటు దక్కలేదు. మంత్రి పదవి వరించకుండా సాధారణ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు.

ఇప్పుడు మొదటి ప్రభుత్వంలో కేసీఆర్ తర్వాత కీలకమైన ఆర్థిక, పౌరసరఫరాల శాఖలు చూసిన ఈటల రాజేందర్ రెండో ప్రభుత్వంలో వైద్య ఆరోగ్యశాఖను దక్కించుకొని ఇప్పుడు అవమానకర రీతిలో వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికంతటికి కారణంగా ‘వైద్యఆరోగ్యశాఖనే’ అని.. అది తీసుకున్నవారికి ఇలాంటి అవమానాలు.. పదవీ వియోగం తప్పదన్న సెంటిమెంట్ మరోసారి ఈటల ఎపిసోడ్ తో బలపడిందని రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
Tags:    

Similar News