టీ బీజేపీ భావోద్వేగ అస్త్రాన్ని ఎదుర్కొనే సత్తా కేసీఆర్ కు ఉందా?

Update: 2022-06-03 05:05 GMT
మిగిలిన పార్టీలు ఉన్నా.. రాజకీయ ప్రత్యర్థుల విషయంలో రోటీన్ కు భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటుంది బీజేపీ నేతల తీరు. చివరకు అధినాయకత్వం సైతం 'ఆల్ సెట్' అన్న తర్వాత నుంచి తమ ఆపరేషన్ ను షురూ చేస్తారు. పోలిక కాస్తంత చిరగ్గా ఉండొచ్చు కానీ.. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలంటే.. ఆ పార్టీ ఏదైనా రాష్ట్రం మీద టార్గెట్ చేసి.. అక్కడ అధికారంలోకి రావాలంటే మిడతల దండు మాదిరి పడిపోతారు. అయితే.. మిడతల దండు వ్యూహాత్మకంగా దాడి చేయదు.. బీజేపీ మిడతల దండు మాత్రం పక్కా ప్లానింగ్ తో విరుచుకుపడుతుంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఎనిమిదేళ్లు అయిన వేళ.. ఇప్పుడు చూస్తే.. మరో ఏడాదిలో జరిగే అవకాశం ఉన్న అసెంబ్లీ ఎన్నికల్లో తాము విజయాన్ని సాధించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లుగా చెబుతున్నారు. ఏపీలో ఉన్న జగన్ ప్రభుత్వం పూర్తిగా మోడీ మాష్టారికి శిష్యరికం చేస్తున్న సంగతి తెలిసిందే. లోగుట్టుగా సాగుతున్న ఈ స్నేహం కారణంగా తమ చేతికి అధికారం లేకపోవచ్చు కానీ.. నడిచేదంతా తాము అనుకున్నట్లుగానే అన్న మాట వినిపిస్తోంది.

తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు. సీఎం కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వరన్న సంగతి తెలిసిందే. అందుకే.. ఎలాగైనా సరే తెలంగాణ పీఠాన్ని దక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీ ఇప్పుడు తెలంగాణను టార్గెట్ చేసింది.

అందుకోసం తమదైన భావోద్వేగ అస్త్రాల్ని ఇప్పటికే బయటకు తీసి సంధిస్తున్న కమలనాథుల తీరుతో తెలంగాణలో కొత్త తరహా రాజకీయం కనిపిస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్ని చూస్తే.. కేసీఆర్ సెంటిమెంట్ తో చెలరేగిపోవటం.. మిగిలిన పార్టీలు దానికి ప్రతిగా ధీటైన భావోద్వగ అస్త్రాన్ని సంధించింది లేదు.

తొలిదశలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రావటానికి ఆంధ్రోళ్ల పెత్తనం పేరుతో భావోద్వేగాన్ని రగిలిస్తే.. ఈ రోజున బీజేపీ తీరు చూస్తే.. కేసీఆర్ అడుగుల్లోనే నడవాలని నిర్ణయించినట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రజలకు పరిచయం లేని సరికొత్త  భావోద్వేగాల్ని తెర మీదకు తెస్తూ.. వారిని ఆకర్షిస్తోంది. దీనికి ప్రతిగా టీఆర్ఎస్ సైతం కేంద్రం పెత్తనంతో రాష్ట్రాలు ఊడిగం చేయాల్సి వస్తోందని.. వారు తమ అధికారాన్ని ప్రదర్శిస్తూ రాష్ట్రాన్ని తమ చెప్పుచేతల్లో ఉంచుకునే ప్రయత్నం చేస్తోందన్న వాదనను బలంగా వినిపిస్తున్నారు.

తెలంగాణ ఏర్పాటు వేళలోనూ.. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ప్రతి ఎన్నికల్లోనూ సెంటిమెంట్ అస్త్రాన్ని సంధించే కేసీఆర్ ధాటికి ఆయన ప్రత్యర్థులు ఇబ్బంది పడేవారు. అందుకు భిన్నంగా తొలిసారి బీజేపీ నేతలు ధీటైన సమాధానాన్ని ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. మరి.. ఈ పోరులో సెంటిమెంట్ ను తనకు తగ్గట్లుగా తెర మీదకు తీసుకొచ్చే గులాబీ బాస్ ది పైచేయి అవుతుందా? క్రమపద్ధతిలో అడుగులు వేస్తూ.. మిడతల దండు మాదిరి కమ్మేసి.. భావోద్వేగ రాకీయాన్ని తీసుకొచ్చే కమలనాథులది పైచేయి అవుతుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News