హిల్లరీపై సంచలన వ్యాఖ్యలు చేసిన ట్రంప్

Update: 2016-02-24 16:28 GMT
వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున తుది పోరులో దిగాలని తపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయనకు ప్రత్యర్థిగా బరిలోకి నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్న డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తాను కానీ అమెరికా అధ్యక్షుడ్ని అయితే.. హిల్లరీ క్లింటన్ ను ప్రాసిక్యూట్ చేస్తానని వ్యాఖ్యానించారు.

ఆమె హోం శాఖ కార్యదర్శిగా పని చేసిన సమయంలో ప్రైవేటు ఈ మొయిల్ సర్వీసును ఉపయోగించినందుకు చర్య తీసుకుంటానని వెల్లడించారు. ప్రస్తుతం తాను ఎంతో అమాయకురాలిగా హిల్లరీ చెప్పొచ్చని.. కానీ.. ఆమె గురించి ప్రజలకు అంతా తెలుసని మండిపడ్డారు. హిల్లరీ తప్పు చేసినట్లుగా కనిపిస్తోందన్న ట్రంప్.. ఇప్పటికే ఆమె తప్పు చేసినట్లుగా బయటపడిన ఈ మొయిళ్లు స్పష్టం చేశాయన్నారు.

ఆమెను ప్రాసిక్యూట్ చేయకుంటే ఇన్నాళ్లు ఆమె మీద పోరాటం చేసిన వారి పోరాటాలకు అర్థం ఉండదన్న  ట్రంప్ వ్యాఖ్యలు హిల్లరీ బ్యాచ్ కి గుబులు పుట్టిస్తుంటే..  మరోవైపు హిల్లరీకి ఏం కాదన్న భావనను ఆమె వర్గాలు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా తన రాజకీయ ప్రత్యర్థిపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అమెరికాలోనే కాదు.. పలు దేశాల్లో హాట్ టాపిక్ గా మారాయనటంలో సందేహం లేదు.
Tags:    

Similar News