విదేశీ ఆట‌గాళ్ల‌కు స్పెష‌ల్ ఫ్లైట్ వేస్తారా?

Update: 2021-05-05 02:30 GMT
కోల్ క‌తా, చెన్నై జ‌ట్టు స‌భ్యులు కొవిడ్ బారిన ప‌డ‌డంతో ఐపీఎల్ ను అర్ధంత‌రంగా ర‌ద్దు చేస్తూ బీసీసీఐ నిర్ణ‌యం తీసుకుంది. హ‌మ్మ‌య్య అని ఊపిరి పీల్చుకుంటూ ఇంటికి వెళ్తారు ఇండియ‌న్ ప్లేయ‌ర్స్. ముఖం మాడ్చుకుని అయినా వెళ్లిపోతాయి ప్రాంచైజీలు. మ‌రి, విదేశీ ఆట‌గాళ్ల సంగ‌తి ఏంట‌న్న‌దే స‌మ‌స్య‌. ప్ర‌ధానంగా ఆస్ట్రేలియా క్రికెట‌ర్ల ప‌రిస్థితి ఏంట‌న్న‌ది అంతుబ‌ట్ట‌కుండా ఉంది.

ఐపీఎల్ లో ప్లేయ‌ర్స్, కోచ్, వ్యాఖ్యాత‌లు, సిబ్బంది మొత్తం క‌లిపి దాదాపు గా 30 మంది వ‌ర‌కు ఉన్నారు. క‌రోనా విజృంభ‌ణ తీవ్ర‌స్థాయికి చేర‌డంతో ఇందులో న‌లుగురు ఐదుగురు ఆట‌గాళ్లు ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కేశారు. వారు క్షేమంగా ఇల్లు చేరారు. మ‌రి, ఇక్క‌డే ఉండిపోయిన వారి ప‌రిస్థితి ఏంట‌న్న‌ది ఇప్పుడు అయోమ‌యంగా త‌యారైంది.

ఇండియాలో కొవిడ్ కేసులు ఉధృతంగా పెర‌గ‌డంతో భార‌త్ నుంచి వ‌చ్చే విమానాల‌ను ఆస్ట్రేలియా నిలిపేసింది. అంతేకాదు.. భార‌త్ నుంచి ఆస్ట్రేలియాలో అడుగు పెడితే ఏకంగా జైలుకే పంపిస్తామ‌ని హెచ్చ‌రించింది. భారీగా జ‌రిమానా కూడా విధిస్తామ‌ని తెలిపింది. ఈ నిబంధ‌న మే 15 వ‌ర‌కు అమ‌ల్లో ఉంటుంది.

ఆ త‌ర్వాత నిబంధ‌న స‌డ‌లిస్తుందా? ఇంకా పొడిగిస్తుందా? అన్న‌ది కూడా ఎవ్వ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి. దీంతో.. వాళ్లు స్వ‌దేశానికి వెళ్ల‌డం ఎలా అన్న‌ది సందిగ్ధంలో ప‌డింది. ఈ విష‌యంలో బీసీసీఐ గానీ, భార‌త్ గానీ చొర‌వ తీసుకుంటే త‌ప్ప‌.. వారు ఇంటికి వెళ్ల‌లేని ప‌రిస్థితి. మ‌రి, ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి. ఓ నిర్ణ‌యం వ‌చ్చే వ‌ర‌కూ ఇక్క‌డ హోట‌ళ్ల‌కే వాళ్లు ప‌రిమితం కావాల్సి ఉంది.
Tags:    

Similar News