త‌న ఎంట్రీపై అదిరిపోయే క్లారిటీ ఇచ్చిన ప‌రిపూర్ణ‌

Update: 2018-10-24 13:11 GMT
బీజేపీలో చేరిన పరిపూర్ణానంద స్వామి కాషాయ‌కండువా క‌ప్పుకున్న అనంత‌రం తొలిసారిగా హైద‌రాబాద్‌ కు వ‌చ్చారు. ఎయిర్‌ పోర్ట్ నుంచి పాత‌బ‌స్తీలోని చార్మినార్ ప‌క్క‌న ఉన్న భాగ్య‌ల‌క్ష్మీ అమ్మ‌వారి దేవాల‌యానికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్న ఆయ‌న అనంతరం బీజేపీ కార్యాల‌యానికి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్‌ తో క‌లిసి విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. తాను ఎందుకు రాజకీయాల్లోకి రావాల‌నుకున్నానో క‌థ రూపంలో వివ‌రించిన ప‌రిపూర్ణానంద స్వామి త‌న ల‌క్ష్యం ఏంటో కూడా ఈ సంద‌ర్భంగా వివ‌రించారు. ``గత 25 సంవత్సరాలుగా దళిత వాడలు - నిరాదరణకు గురయిన.. బస్తీల్లో తిరిగాను. అనేక గ్రామాల్లోపర్యటన చేశా. అనంత‌రం రాజకీయాల్లోకి రావాల‌నుకున్న‌ప్పుడు ఇమడగలనా లేదా అని అనుకున్నాను. నాకు దేవుడు తప్ప ఇంకెవరు లేరు. రాజకీయాల్లో ఫాదర్ - లేదా గాడ్ ఫాదర్ అయినా ఉండాలి. నన్ను కన్న తల్లి.. కళ్లు లేకపోయిన నన్ను మలిచింది. తల్లి - తండ్రి - గురువులు మాత్రమే నాకు ఆదేశాలు ఇవ్వగలరు. అలాంటి ఆదేశాల ద్వారానే రాజ‌కీయ అరంగేట్రం`` అంటూ కథ ద్వారా.. రాజకీయ అరంగేట్రం పరిపూర్ణానంద వివ‌రించారు.

ధర్మం కోసం సన్యాసం తీసుకున్నావ్ - ఇప్పుడు దేశం కోసం పని చెయ్యాలంటే ఏం చేయాలో ఆలోచించుకో అని తల్లి - తండ్రులు చెప్పార‌ని ప‌రిపూర్ణానంద వివ‌రించారు. ``ఇప్పుడు రాకపోతే...ఇంకెప్పుడు అడుగు పెట్టొద్దు అని.. గురుస్థానంలో ఉన్న వ్యక్తి చెప్పారు. ఏది ఆశించవద్దు, ఏది కోరుకోవద్దు అని ఆ ముగ్గురు మాట తీసుకున్నారు. అలా రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను`` అని వివ‌రించారు. ``బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌ షాని కలిసినప్పుడు నా మీద చూపిన గౌరవం - ఆయ‌న మాట‌తీరుతో నా ధైర్యం మరింత రెట్టింపు అయ్యింది. మీ సేవ ఈ దేశానికి కావాలన్నారు అమిత్ షా. పార్టీని ఈ స్థాయికి తీసుకువచ్చిన ఘనత మోడీ - అమిత్‌ షా దే. అద్వానీ - వాజపేయి జోడి..ఈ పార్టీ ని నడిపింది.. ఇప్పుడు మరో జోడి.. అమిత్‌ షా-మోడీ రూపంలో పెను సంచలనం.. సృష్టించింది`` అని అన్నారు. ఈనెల 8న అమిత్‌ షాను కలిశానని - న‌వరాత్రులు అయ్యాక నిర్ణయం చెబుతా అన్నానని ప‌రిపూర్ణానంద తెలిపారు. ``స్వామిజీ.. తెలంగాణకు వెళ్ళాలి - లక్ష్మణ్‌ ను కలిశాక పార్టీ మీకు సూచన చేస్తుంది అని అమిత్‌ షా అన్నారు. అనంత‌రం ఉజ్జయినీ క్షేత్రంలో 3రోజులు ఉండి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాను. దేశాన్ని రక్షించుకోవాలి, ధర్మాన్ని పరి రక్షించుకోవాలి అంటే బీజేపీ.. రావాలి అనుకున్నాను. అందుకే చేరాను``అని తెలిపారు.

రాజకీయం కాదు రాజనీతి ఉండాలని అనుకుంటున్నానని ప‌రిపూర్ణానంద‌ తెలిపారు. ``బీజేపీలో కులాలు - కుటుంబాలు లేవు అవినీతి లేదు - గుణమే హద్దు. బంగారు లక్ష్మణ్ - నరేంద్ర మోడీ - అబ్దుల్‌ కలాం - కొవింద్ లాంటి వారిని దేశానికి అందించింది. తెలంగాణలో జనతా సర్కార్.. రావాలి. పరివార్‌ సర్కార్ పోవాలి.. అదే నినాదం. తెలంగాణ కురుక్షేత్రంలో.. పంచ‌పాండవులు కలిసి అధికారంలోకి వస్తోంది. మిషన్ 70లో తెలంగాణ బీజేపీ అధికారం వస్తోంది`` అని అన్నారు. అమిత్ షా బాధ్యత తీసుకోమన్నారని పేర్కొన్న ప‌రిపూర్ణానంద ``ఏ పదవి వద్దు - బాధ్యత వద్దు అన్నాను. మిషన్ 70 తెలంగాణలో పూర్తి చేశాక.. ఇతర ప్రాంతాల వద్దకు వెళ్తాను. పని చేయడానికి వచ్చాను.. పదవి కోసం కాదు. లక్ష్మణ్ గారు ఏ గీత గీసిన పాటిస్తాను. ఆశ లేదు ఆశయం మాత్రమే ఉంది. ఇప్పటి ప్రభుత్వం.. దారుసాలం ఆజ్ఞ‌ల‌తో నడుస్తోంది. ఇప్పుడు వచ్చే బీజేపీ సర్కార్ లాల్ దర్వాజ ఆజ్ఞలతో నడుస్తాయి. నా బహిష్కరణ.. అమిత్ షా ఆవిష్కరణ అయింది. తెలంగాణ ఎన్నికలు ప్రపంచం చూసేలా.. ఉంటాయి. అమావాస్య..నాకు మంచి ముహూర్తం. తెలంగాణ కాషాయ తెలంగాణ గా మారబోతోంది`` అంటూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.
Tags:    

Similar News