ఎమ్మెల్యేను తిట్టాకే ఆమె అక్రమ మద్యం వ్యాపారం మొదలెట్టిందా?

Update: 2022-07-18 07:32 GMT
ఉమ్మ‌డి అనంత‌పురం పోలీసులు త‌మ రూటే సెప‌రేటు అంటున్నారు. ఎమ్మెల్యే శంక‌ర నారాయ‌ణ‌ను దూషించి, వార్త‌ల్లో నిలిచిన ల‌క్ష్మీబాయిని పోలీసులు స్టేష‌న్-కు పిలిచి అక్ర‌మ మ‌ద్యం కేసు ఒక‌టి బ‌నాయించాల‌ని చూశార‌ని టీడీపీ అంటోంది.

బాధిత మ‌హిళ కూడా  త‌న‌పై చేయ‌ని నేరానికి కేసు పెట్టాల‌ని చూశార‌ని., తాను పింఛ‌ను విషయ‌మై  ఎమ్మెల్యేను ప్ర‌శ్నించినందునే ఈ విధంగా చేశార‌ని ఆమె వాపోతోంది. త‌న‌కు గ‌తంలో వితంతు పింఛ‌ను అందేద‌ని, ఈ ప్ర‌భుత్వం వ‌చ్చాక దానిని తొల‌గించారు అని, అదే కోపంతో తాను ఎమ్మెల్యేను తిట్టాన‌ని అంటోంది.

ఇదే సమ‌యాన బాధితురాలు చెబుతున్న ప్ర‌కారం.. తాను ప‌నికి వెళ్లిన  కొత్త చెరువు మండ‌లం, భైరాపురం స‌మీపంలో పోలీసులే ఇసుక‌లో మ‌ద్యం బాటిళ్లు దాచి, వాటిని బ‌య‌ట‌కు తీసి వీటిని  అక్రమంగా నువ్వే అమ్ముతున్నావా అంటూ త‌న‌ను ప్ర‌శ్నిస్తూ వేధిస్తున్నార‌ని చెబుతోంది. క‌న్నీటిప‌ర్యంతం అయింది.

ఇందుకు పూర్తి భిన్నంగా పోలీసులు మాత్రం త‌మ‌కు వ‌చ్చిన స‌మాచారం మేర‌కే ఆమెను స్టేష‌న్-కు పిలిచామ‌ని అంటున్నారు. అసలు అక్క‌డ ఎవ్వ‌రు మ‌ద్యం బాటిళ్లు దాచి ఉంచారు అన్న‌ది క‌నుక్కొని చెబుతామ‌ని త‌మ‌దైన వాద‌న వినిపిస్తున్నారు.

మ‌రోవైపు బాధితురాలు అందిస్తున్న స‌మాచారం ప్ర‌కారం.. తాను పోలీసులు అడిగిన వాటిపై తీవ్రంగా ప్ర‌తిఘ‌టించాన‌ని, దాంతో పోలీసులు ప్ర‌స్తుతానికి కేసు లేక‌పోయినా, కొన్ని తెల్ల‌కాగితాల‌పై వేలి ముద్ర‌లు సేక‌రించార‌ని, అవెందుకు తీసుకున్నారో కూడా త‌న‌కు తెలియ‌ద‌ని అంటోంది.

ఇదే విష‌య‌మై తాము ఎప్పుడు ర‌మ్మంటే అప్పుడు స్టేష‌న్ కు వ‌చ్చివెళ్లాల‌ని కూడా పోలీసులు చెప్పార‌ని అంటోంది. బాధితురాలు ఉంటున్న శెట్టిప‌ల్లి తండాకు చెందిన వారంతా పోలీసుల తీరునే త‌ప్పుప‌డుతున్నారు అని, మ‌హిళ అని చూడకుండా విచార‌ణ పేరుతో  గంట‌ల త‌ర‌బ‌డి స్టేష‌న్లో ఉంచి, చేయ‌ని త‌ప్పు చేసిన విధంగా ఒప్పుకుని తీరాల‌ని చెప్ప‌డం చ‌ట్ట విరుద్ధం అని టీడీపీ అంటోంది.
Tags:    

Similar News