జీవితాంతం అలా ఎలా వర్క్‌ చేస్తాం సర్‌..!

Update: 2021-08-01 02:30 GMT
కరోనా మహమ్మారి అన్ని రంగాలను అతలాకుతలం చేసింది. తమ సంస్థలకు చెందిన ఉద్యోగులు అనేక రంగాల్లోని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలభ్యాన్ని కల్పించాయి. ఇక కరోనా కంగారు సమసిపోయే వరకు వర్క్ ఫ్రమ్ హోం ఆప్షనే ఉత్తమ మార్గం అని అన్ని కంపెనీలు భావించాయి. అదే విధంగా ఉద్యోగులను కూడా సన్నద్ధం చేశాయి. ప్రస్తుతం కరోనా కంగారు తగ్గు ముఖం పట్టడంతో త్వరలో అందరు ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లాల్సి ఉంటుందని చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ అందరి అభిప్రాయాలను తల కిందులు చేస్తూ ఓ సంస్థ తమ ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ సౌకర్యాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఉద్యోగుల ఇష్టం కొద్దీ ఆఫీసుకు రావాలనుకుంటే రావచ్చని ఆ సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. కాగా ఆ సంస్థ తాజా నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా ఉంటున్న 16 వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. వారంతా ప్రస్తుతం సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంతో తెగ సంబర పడిపోతున్నారు. ఇక మీదట శాశ్వతంగా సొంత ఊళ్లో ఉండి విధులు నిర్వర్తించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ మరో విషయమేంటంటే తప్పని సరిగా ఆఫీసుకు వస్తేనే పనులు పూర్తయ్యే ఉద్యోగులు మాత్రం రావాల్సిందేనని సంస్థ తెలిపింది. ఫస్ట్ వేవ్ సమయంలో చాలా సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం సౌలభ్యాన్ని కల్పించాయి.

ఫస్ట్ వేవ్ భయం సమసిపోయిన తర్వాత అందరు ఉద్యోగులను ఆఫీసులకు పిలుద్దామని సంస్థలు భావించే లోపే మరలా సెకండ్ వేవ్ భయాలు చుట్టుముట్టాయి. ఈ కారణంతో సంస్థలు తమ అభిప్రాయాన్ని మార్చుకుని అందరూ ఇంటి వద్దే ఉంటూ విధులు నిర్వర్తించేలా ఆదేశాలను కొనసాగించాయి. ప్రస్తుతం సెకండ్ వేవ్ భయం కూడా తొలగిపోవడంతో అందర్నీ ఆఫీసుకు పిలిచేలా సంస్థలు అడుగులు వేస్తున్నాయి. ఈ సమయంలో ఓ సంస్థ తీసుకున్న నిర్ణయంతో మిగతా సంస్థలన్నీ షాక్ లో ఉన్నాయి. ఇంతకీ విషయమేంటంటే మైక్రోసాఫ్ట్ ఆధ్వర్యంలో పని చేస్తున్న ప్రముఖ సోషల్ మీడియా నెట్ వర్క్ లింక్డిన్ తమ ఉద్యోగులు ఊరట చెందే విషయాన్ని చెప్పింది. తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు శాశ్వతంగా వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ను ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వర్క్ ఫ్రం హోమ్ బోర్ కొట్టి ఉద్యోగులు ఆఫీసులకు వచ్చినా తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ప్రకటించింది. ఇలా లింక్డిన్ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో దాదాపు 16 వేల మంది ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. కానీ కొన్ని సెక్షన్ల ఉద్యోగులు మాత్రం తప్పని సరిగా ఆఫీసులకు రావాలని సంస్థ తెలపడం విశేషం. అంతే కాకుండా ఎవరైనా ఉద్యోగులు నివాస స్థలాలు మార్చితే పెరిగిన ఇంటి అద్దె అనుగుణంగా వేతనాలు చెల్లిస్తామని స్పష్టం చేసింది.

కేవలం ఈ ఒక్క సంస్థ మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రముఖ సంస్థలు కూడా మెజార్టీ ఎంప్లాయిస్‌ ను వర్క్‌ ఫ్రమ్‌ హోమ్ చేయాల్సిందిగా సూచిస్తుంది. కొందరు ఎంప్లాయిస్ దీన్ని బంపర్‌ ఆఫర్‌ అనుకుంటూ ఉంటే కొందరు మాత్రం బాబోయ్ ఇదేం తలనొప్పి అనుకుంటున్నారు. ఎంతైనా జీవితాంతం ఇంట్లోనే కూర్చుని వర్క్‌ చేయడం అంటే చాలా కష్టమైన విషయమే అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News