యనమలకు బడ్జెట్ తలనొప్పులు

Update: 2016-02-17 07:40 GMT
మామూలుగానే బడ్జెట్ కూర్పు అంటే బుర్రకు పనిచెప్పాల్సిన వ్యవహారం.. అలాంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కూర్పు అంటే కత్తి మీద సామే. ఆదాయం తక్కువ, ఆర్భాటం ఎక్కువ అన్నట్లుగా ఉన్న ఏపీలో శాఖల అవసరాలు, ప్రభుత్వ ఆశలకు భారీగా డబ్బు అవసరం. కానీ, ఏం చేసినా అందులో సగం కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదట. దీంతో బడ్జెట్ కూర్పు ఎలాగో తెలియక ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆర్థిక శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారట.

బడ్జెట్‌ కూర్పులో జాప్యం జరుగుతోంది.... అదేసమయంలో  నిధుల కేటాయింపుపై వివిధ శాఖల ఆశలు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయానికి కలిపి దాదాపు మూడున్నర లక్షల కోట్లకుపైగానే డిమాండ్లు వచ్చినట్లు సమాచారం. వీటిని దాదాపు 1.30 లక్షల కోట్లకు కుదించాలని యనమల ఆర్థిక శాఖ అధికారులకు సూచించారట... దీంతో వారు అయోమయానికి గురవుతున్నారు. ప్రణాళికేతర వ్యయానికి దాదాపు 2 లక్షల కోట్ల వరకు ప్రాధమిక ప్రతిపాదనలు రాగా, ప్రణాళికా రంగానికి కూడా లక్ష కోట్లకు పైగా ప్రతిపాదనలు వచ్చాయి. వాస్తవానికి వివిధ శాఖల నురచి సరైన సమయంలో ప్రతిపాదనలు రాకపోవడంతో ఆర్ధిక శాఖే నేరుగా తాత్కాలిక ప్రతిపాదనలు రప్పించుకుంది. లేని పక్షంలో ప్రణాళిక డిమాండ్లు మరింతగా పెరిగేవి.

బడ్జెట్‌ కసరత్తు కొలిక్కి రాకపోవడంతో ఆ ప్రభావం బడ్జెట్‌ సమావేశాల ప్రారంభంపైనా పడుతోంది. మార్చి 1 నుంచి ప్రారంభం కావాల్సిన బడ్జెట్‌ సమావేశాలు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. సమావేశాలను ఐదో తేదీన ప్రారంభించిన 10న బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు శాఖల వారీ కసరత్తులు పూర్తికాలేదు. మంత్రులతో కూడా భేటీలు ప్రారంభం కాలేదు. అనేక శాఖలు వాస్తవ అవసరాల కన్నా ఎక్కువగా ప్రతిపాదనలు పెట్టడంతో వాటిని ఏంచేయాలన్న కోణంలోనే ఆర్ధిక శాఖ ఆలోచనలు చేస్తోంది.
Tags:    

Similar News