వైసీపీకి షాకులు కొన‌సాగిస్తామంటున్న బాబు మ‌నిషి

Update: 2020-01-23 10:33 GMT
ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు ఏపీ శాస‌న‌మండ‌లి బ్రేక్ వేయ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. రెండ్రోజులు పాటు నాటకీయ పరిణామాలు జరిగి చివరకు బిల్లుల్ని సెలక్ట్ కమిటీకి పంపించేలా మండలిలో టీడీపీ చ‌క్రం తిప్పింది. దీంతో మూడు నెలల పాటు నిర్ణయం ఆలస్యమవుతుందని తెలుస్తోంది. అయితే, ఈ ప‌రిణామంపై తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు మ‌రింత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ సెలెక్ట్ క‌మిటీ నిర్ణ‌యం ఆమోదం కోసం ఎదురుచూడ‌టం మిన‌హా మ‌రేం చేయ‌లేర‌ని అన్నారు. అవ‌స‌ర‌మైతే, సెలెక్ట్ క‌మిటీలోనూ తాము చ‌క్రం తిప్పుతామ‌ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

బిల్లు సెలెక్ట్ క‌మిటీకి పంపించ‌డం, అనంత‌రం మండ‌లి ర‌ద్దు చేస్తామ‌నే సూచ‌న‌లు అధికార ప‌క్షం నుంచి వ‌చ్చిన నేప‌థ్యంలో..య‌న‌మ‌ల మీడియా తో మాట్లాడారు. తనకున్న విచక్షణాధికారాలతో బిల్లుల్ని సెలక్ట్ కమిటీకి పంపిస్తున్నట్టు మండలి ఛైర్మన్ షరీఫ్ ప్రకటించారని, ఈ మేర‌కు సెల‌క్ట్ కంపెనీ ఆదేశాలు వ‌చ్చేదాకా వేచి చూడ‌టం త‌ప్ప‌ద‌న్నారు. మూడునెల‌లు లేదా మ‌రింత ఎక్కువ స‌మ‌యం సెలెక్ట్ క‌మిటీ తీసుకోవ‌చ్చున‌ని ఆయ‌న అన్నారు.

తాము మండ‌లి సెలెక్ట్ క‌మిటీని కోరామే కానీ ఉమ్మడి క‌మిటీ కాద‌ని య‌న‌మ‌ల పేర్కొన్నారు. మండ‌లి సెలెక్ట్ క‌మిటీ లో స‌భ్యులు మెజార్టీ టీడీపీ వారే ఉంటారు కాబ‌ట్టి తాము మ‌ళ్లీ చ‌క్రం తిప్పుతామ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఏపీ ప్ర‌భుత్వం ఆర్డినెన్స్ తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని అయితే అది సాధ్యం కాద‌ని య‌న‌మ‌ల అన్నారు. ప్ర‌భుత్వం మొండిగా వ్య‌వ‌హ‌రించి శాస‌న‌మండ‌లిని ర‌ద్దుచేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని అయితే అది సాధ్యం కాద‌న్నారు. మండ‌లి ర‌ద్దు తీర్మానం కేంద్రానికి పంపించాల‌ని, అనంత‌రం పార్ల‌మెంటులో ఆమోదం పొందాల్సి ఉంటుంద‌ని...ఇదంత సుల‌భంగా జ‌రిగే ప్ర‌క్రియ కాద‌ని య‌న‌మల పేర్కొన్నారు. అప్ప‌టివ‌ర‌కూ ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తి మాత్ర‌మే ఉంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.
Tags:    

Similar News