అనుబంధాలు గట్టి పడాలి.....వైసీపీ టీడీపీ అజెండా... ?

Update: 2022-03-08 08:50 GMT
బంధాలు అనుబంధాలు రాజకీయాల్లో సాధ్యమేనా అంటే నిజానికి కాదు అనే చెప్పాలి.  మరి ఈ అనుబంధాలు దేనికీ అంటే అవి ఉండాల్సిందే అంటున్నారు. వాటి లెక్క కూడా వేరు అని చెబుతున్నారు. ఈ అనుబంధాలు పార్టీ పటిష్టతకు సంబంధించినవి. రాజకీయానికి సంబంధించినవి. అందుకే వీటికి అంత ప్రాధాన్యత ఉంది. ప్రతీ పార్టీకి అనుబంధ సంఘాలు ఉంటాయి. నిజానికి అవే ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తాయి.

అనుబంధ సంఘాలకు విలువ గౌరవం చాలా పెరిగాయీ అంటే టీడీపీయే దానికి కారణం అని కూడా చెప్పాలి. తెలుగుదేశం పార్టీలో ప్రెసిడెంట్ కి ఎంత విలువ ఉంటుందో తెలుగు యువత అధ్యక్షుడికీ కూడా ఎంతో మర్యాద ఉంటుంది. అలాగే తెలుగు మహిళ కూడా పవర్ ఫుల్ పోస్ట్, ఇక విద్యార్ధి, రైతు విభాగాలు కూడా పార్టీని వెన్నుదన్నుగా ఉంటూ వచ్చాయి.

టీడీపీలో తెలుగు యువత పోస్ట్ ఎంతో గ్లామర్ తో కూడుకున్నది. దానిని దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి హరిక్రిష్ణ లాంటి వారు చేపట్టారు. తెలుగు మహిళ తీసుకుంటే జయప్రద, రోజా వంటి వారు వన్నె తెచ్చారు. అలాంటి అనుబంధ సంఘాలు ఇపుడు పెద్దగా జన సంబంధాలు లేకుండా ఉన్నాయని టీడీపీ హై కమాండ్ కలత చెందుతోంది. అదే టైమ్ లో మిగిలిన విభాగాలను కూడా యాక్టివ్ చేయాలని చూస్తోంది.

దాని కోసం అధినాయకుడు చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. పనిచేసే వారికే పదవులు అని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు కూడా. వచ్చే ఎన్నికల్లో టికెట్లు రావాలీ అంటే అనుబంధ కమిటీలు బాగా పనిచేయాలని కూడా ఆదేశిస్తున్నారు. ఇక టీడీపీ ఇలా జోరు పెంచిందో లేదో అధికార వైసీపీ కూడా అనుబంధ సంఘాల మీద ఫోకస్ పెట్టేసింది.

వైసీపీలో ఉన్న మొత్తం అనుబంధ కమిటీలకు ఇంచార్జిగా విజయసాయిరెడ్డిని జగన్ ఏరి కోరి నియమించారు. మొత్తం పదమూడు అనుబంధ కమిటీలు వైసీపీలో పనిచేస్తున్నాయి. ఇవన్నీ ఈ మధ్య కాలంలో పెద్దగా చలనం లేకుండా ఉన్నాయి. దాంతో వాటిని రీచార్జి చేయాలని అధినాయకత్వం భావిస్తోంది.

ఈ నేపధ్యంలో విజయసాయిరెడ్డి ఈ మధ్య అనుబంధ కమిటీలతో ఇంచార్జి హోదాలో తొలి మీటింగ్ పెట్టి మరీ బాగా పనిచేయాలని ఆదేశించారు. అనుబంధ కమిటీలు పుంజుకుంటేనే పార్టీ కూడా విజయపధాన సాగుతుందని ఆయన దిశా నిర్దేశం చేశారు. మొత్తానికి అనుబంధాలు గట్టి పడాలని రెండు పార్టీలు ఇపుడు కోరుకుంటున్నాయి.

అయితే అనుబంధ కమిటీలలో ఉన్న నాయకుల  మాట అయితే అధినాయకత్వాలు  తమను కరివేపాకుల మాదిరిగా వాడుకుంటున్నాయి తప్ప పదవుల విషయంలో పట్టించుకోవడంలేదనే.  రెండు ప్రధాన పార్టీలలో కూడా ఇదే రకమైన తంతు సాగుతోందని అంటున్నారు.

అలంకారప్రాయంగా ఆరవ వేలుగా ఉంచితే అనుబంధాలు కలకాలం పదిలంగా సాగవని కూడా తేల్చి చెబుతున్నారు. ఎన్నికల వేళ మాత్రమే తాము గుర్తుకువస్తామని కూడా గుస్సా అవుతున్నారు. మొత్తానికి అనుబంధాలు అన్నింటా కానరాని స్థితిలో ఉన్న వేళ రాజకీయ పార్టీల అనుబంధ కమిటీలను యాక్టివ్ చేయడం అంటే పెద్ద సవాలే అంటున్నారు.


Tags:    

Similar News