రోజాను వ్య‌తిరేకించే వ‌ర్గానికి ప‌ద‌వులు!

Update: 2022-02-07 14:30 GMT
వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు, జ‌బ‌ర్ద‌స్త్ రోజా.. రాజీనామాకు రెడీ అయ్యారా ?  ఆమె స్థానికంగా త‌న చుట్టు జ‌రుగుతున్న రాజ‌కీయాల‌తో విసిగిపోయారా?  త‌న‌ను బ‌ద్నాం చేసేందుకు సొంత పార్టీ నాయ‌కులే ప్ర‌య త్నాలు చేస్తున్నా.. అధిష్టానానికి ఈ విష‌యం తెలిసి కూడా మౌనంగా ఉండ‌డంపై ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారా? అందుకే.. త‌న ప‌ద‌వికి రాజీ నామా చేయాల‌ని నిర్ణ‌యిం చుకున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. చిత్తూరు జిల్లా న‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2014, 2019 ఎన్నిక‌ల్లో వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్నారు రోజా.

అయితే... సాధార‌ణంగా.. ఏ ఎమ్మెల్యేకు ఎదురుకాని.. అనేక స‌మ‌స్య‌లు ఆమె రాజ‌కీయంగా ఎదుర‌య్యా యి. 2014లో విప‌క్షంలో ఉన్న‌ప్పుడు.. ఆమెను అణిచి వేసేందుకు అప్ప‌టి అధికార‌ప‌క్షం తీవ్రంగా ప్ర‌య‌త్నించింది. ఈ క్ర‌మంలోనే శాస‌న‌ స‌భ నుంచి ఏడాదిపాటు స‌స్పెండ్ చేసింది. అదేవిధంగా .. మ‌హిళా పార్ల‌మెంటు జ‌రిగిన‌ప్పుడు కూడా ఆమెను అరెస్టు చేశారు. అయిన‌ప్ప‌టికీ.. ఆమె త‌ట్టుకుని నిల‌బ‌డ్డారు. ఇక‌, వైసీపీ త‌ర‌ఫున గ‌ళం వినిపించ‌డంలో ముందున్నారు. పురుష నాయ‌కుల క‌న్నా.. ఎక్కువ‌గానే దూకుడు ప్ర‌ద‌ర్శించారు.

అంతేకాదు.. 2019లో న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ సింప‌తీ రాజ‌కీయాల‌ను(గాలి ముద్దుకృష్ణ‌మ మ‌ర‌ణం తో) కూడా త‌ట్టుకుని విజ‌యం ద‌క్కించుకున్నారు. అన్నింటిక‌న్నా ముఖ్యంగా వైఎస్ జ‌గ‌న్ ముఖ్యమంత్రి కావాల‌ని అభిల‌షించిన నాయ‌కుల్లో రోజా ముందుభాగంలో నిలిచారు. అయితే.. ఆమె చేసిన క‌ష్టానికి, ప‌డిన బాధ‌ల‌కు స‌రైన గుర్తింపు రాలేద‌నే ఆవేద‌న ఉంది. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ క‌నుస‌న్న‌ల్లో స‌ర్దు కుపోతున్నారు.. కానీ, కొన్నాళ్లుగా సొంత నేత‌లే.. ఆమెపై క‌త్తి దూస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. గ‌త 2019 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఏర్పడిన జ‌గ‌న్ స‌ర్కారులో మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌న‌ని అనుకున్నారు.

అయితే.. దీనికి కీల‌క నేత‌, చిత్తూరుకే చెందిన రెడ్డి సామాజిక వ‌ర్గం నాయ‌కుడు అడ్డుప‌డ్డార‌నే వాద‌న ఉంది. అయిన‌ప్ప‌టికీ... త‌న‌కు ఇచ్చిన ఏపీఐఐసీ చైర్ ప‌ర్స‌న్ ప‌ద‌వితో స‌ర్దుకుపోయారు. త‌ర్వాత‌.. దాని నుంచి కూడా ఆమెను ప‌క్క‌న పెట్టారు. ఇక‌, అప్ప‌టి వ‌ర‌కు న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో త‌నే కేంద్రంగా సాగిన రాజ‌కీయాల్లోకి మంత్రుల ప్ర‌మేయం ప్రారంభ‌మైంది. అంతేకాదు.. త‌న వ‌ర్గంలో ఉన్న కేజే కుమార్ కుటుంబాన్ని బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చి.. ఎగ‌స్పార్టీ వ‌ర్గం ఏర్పాటు చేశారు. కార్పొరేష‌న్ ప‌ద‌వి కూడా ఇప్పించారు. దీంతో రాజా స‌మ‌స్య‌లు మ‌రింత పెరిగాయి.

అయిన‌ప్ప‌టికీ.. వాటిని కూడా త‌ట్టుకుంటూ.. రోజా ముందుకు సాగారు. వారంలో నాలుగు రోజులు నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉంటూ.. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తున్నారు. అంతేకాదు.. రోజా చారిటీని ఏర్పాటు చేసి సేవా కార్య‌క్ర‌మాలు  చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. సొంత పార్టీలోని ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం రోజా కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. రోజాకు అస‌మ్మ‌తి నాయ‌కుల‌ను ప్రోత్స‌హించే ప‌నిని చేస్తున్నారు. త‌ద్వారా రోజాను ఒంట‌రిని చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు.

దీనిలో భాగంగానే రోజా అంటే అస్స‌లు గిట్ట‌ని.. చెంగారెడ్డి చ‌క్ర‌పాణి రెడ్డిని శ్రీశైలం దేవ‌స్థానం బోర్డుకు చైర్మ‌న్‌ను చేశారు. త‌ద్వారా.. ఆయ‌న నియోజ‌కవ‌ర్గంలో పుంజుకునేలా చేశారు. దీనిని బ‌ట్టి... రోజాను వ్య‌తిరేకించే వ‌ర్గానికి ప‌ద‌వులు ద‌క్కుతాయ‌నే సంకేతాలు ఇచ్చారు. ఫ‌లితంగా ఇప్పుడు... న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు.. రెండు కేంద్రాలుగా సాగుతున్నాయి. అధికారులు కూడా రెండుగా చీలిపోయారు. అంతేకాదు.. రోజా క‌న్నా.. ఓ మంత్రి ద‌న్నుతో ఏర్ప‌డిన వ‌ర్గానికి నియోజ‌క‌వ‌ర్గంలో ప్రాధాన్యం ఏర్ప‌డింది. ఈ ప‌రిణామాలు అధిష్టానానికి తెలిసి కూడా ప‌ట్టించుకోక‌పోవ‌డం.. త‌నకు మ‌ళ్లీ జ‌రిగే మంత్రి వ‌ర్గం విస్త‌ర‌ణ‌లోనూ.. ప‌ద‌వి ద‌క్కుతుందో లేదో .. అనే అనుమానం ఉండ‌డంతో రోజా.. రాజీనామాకు రెడీ అయ్యార‌నే వాద‌న వినిపిస్తోంది. మ‌రి అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి.


    

Tags:    

Similar News