రంగుల రాజకీయం.. వైసీపీ దిద్దుబాటు

Update: 2019-10-31 10:49 GMT
వైసీపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఓ గ్రామ పంచాయతీ కార్యాలయంపై ఉన్న త్రివర్ణ పతాకాన్ని తొలగించి వైసీపీ రంగు వేయడం.. ఆ ఫొటో వైరల్ అయ్యి దుమారం రేగిన సంగతి తెలిసిందే.  దీంతో ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది.

తుమ్మదేపల్లి గ్రామ పంచాయతీపై ఉన్న మూడు రంగులను తొలగించి వైసీపీ రంగు వేయించిన ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆర్. ప్రకాష్ ను సస్పెండ్ చేసింది. తిరిగి ఆ పంచాయతీ  కార్యాలయ భవనానికి త్రివర్ణ పతాకం రంగులను వేయించింది.

పంచాయతీ ఆఫీసుకు వైసీపీ రంగులు వేయించడంలో తోడ్పాటు నందించిన నాయకులకు కూడా వైసీపీ పెద్దల నుంచి చీవాట్లు పడ్డట్టు తెలిసింది.వెంటనే పంచాయతీ ఆఫీసుకు వైసీపీ రంగులు తీసివేయాలని.. మునుపటి మూడు రంగుల జెండా రంగులు వేయాలని ఆదేశించడంతో ఆగమేఘాల మీద తిరిగి పంచాయతీ పాత రంగులోకి మార్చారు.

వైసీపీ నేతల అత్యుత్సాహానికి పాపం పంచాయతీ కార్యదర్శి బలయ్యాడని అధికార వర్గాలు వాపోతున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నా క్యాంటీన్లు సహా టీడీపీ రంగులు వేసిన అన్నింటిని వైసీపీ రంగులోకి మార్చేశారు. కానీ ఈ ఒక్క ఘటనలో మాత్రం అధికారిపై చర్యలు తీసుకోవడం వివాదాస్పమవుతోంది.

ఈ వివాదంపై  ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వ భవనాలపై యూనిఫాం కలర్స్ వేయాలని మాత్రమే ప్రభుత్వం ఆదేశించిందని.. ఇప్పుడు వేస్తున్న రంగులు వైసీపీ పార్టీ రంగులు కాదని వివరణ ఇచ్చారు. ఈ పంచాయతీకి వైసీపీ రంగుల వాడడంలో ఎక్కడ తప్పు జరిగిందో దర్యాప్తు చేస్తున్నామని వివరణ ఇచ్చారు.

అయితే ఎవ్వరు తప్పు చేసినా ఈ పరిణామం జగన్ సర్కారుకు దెబ్బగా పరిణమించింది. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జరగాల్సిన నష్టం జరిగింది. ఇప్పుడు నష్ట నివారణ చర్యలు తీసుకున్నా అపఖ్యాతి మాత్రం పోని పరిస్థితి నెలకొంది.
Tags:    

Similar News