అర్జంటుగా ఆ ఇద్దరూ కలవాలి...జగన్ కి ఫుల్ హ్యాపీట...

Update: 2022-11-02 00:30 GMT
రాజకీయాల్లో లెక్కలు ఎవరికీ అంత సులువుగా అర్ధం కావు. నిజానికి ఒకరికి ఇద్దరు కలిస్తే లాభమే కదా. బలమే కదా అన్నది సామాన్యుడికి వచ్చే ఆలోచన. వాడికి ఉన్న లెక్క. కానీ రాజకీయ గణితంలో లెక్కలు అన్నీ ఉల్టా సీదాగా ఉంటాయి. విడిగా ఉంటే మేలు అని అనుకుంటారు కానీ కలసిగా మేలే అని కూడా రుజువు చేసే ఎన్నికలు బోలేడు జరిగాయి. ఉదాహరణకు 2009 ఎన్నికల్లో ఒక వైపు కాంగ్రెస్ ఉంటే మరో వైపు మహాకూటమి ఉంది. అందులో అయిదారు పార్టీలు ఉన్నాయి. కానీ చివరికి వైఎస్సార్ నాయకత్వాన కాంగ్రెస్ బంపర్ విక్టరీ కొట్టింది.

ఇపుడు చూస్తే ఏపీలో కూడా అలాంటి సీన్ ని 2024 ఎన్నికల్లో చూడబోతారా అంటే ఫుల్ కాన్ఫిడెంట్ గా వైసీపీ నేతలు ఉన్నారు. అదే ఖఛ్చితంగా  జరుగుతుంది అని బల్ల గుద్దుతున్నారు.  వారి విషయం పక్కన పెడితే అధినాయకుడు జగన్ కి ఈ తరహా లెక్కలు పక్కాగా తెలుసు అంటున్నారు. ఆయన సోషల్ ఇంజనీరింగులో బాగా పండారు కూడా. అందుకే ఆ ఇద్దరినీ కలవనీ అంటున్నారుట. ఎవరా ఇద్దరు, ఏమా కధ అంటే ఏపీ రాజకీయాల్లో కొన్ని రోజుల క్రితం చోటు చేసుకున్న కీలకమైన పరిణామం టీడీపీతో జనసేన అధినేతలు చంద్రబాబు  పవన్ కళ్యాణ్  చేతులు కలపడం, రాజకీయం రాజధాని విజయవాడ వేదికగా ఈ ముచ్చట చోటుచేసుకుంది.

దాంతో చాలా మంది ఇంకేముంది వైసీపీ పని సరి. ఇక ఓటమే. ప్రస్తుతం ఉన్న సర్కార్ రోజులు లెక్కబెట్టుకోవడమే అన్నారు. దానికి రాజకీయ విశ్లేషణలు కూడా ఆ విధంగానే సాగుతున్నాయి. కానీ జగన్ మాత్రం బాగా ధీమాగా ఉన్నారుట. మనమే మళ్లీ అధికారంలోకి వస్తాం, నో డౌట్ అని పార్టీ వారికి చెబుతున్నారుట. అలా ఎందుకు జరుగుతుంది అంటే అక్కడే జగన్ మార్క్ లెక్కలు ఉన్నాయని అంటున్నారు.

అవేంటి అంటే పవన్ కళ్యాణ్ జనసేన పట్ల కాపులలో పూర్తి స్థాయిలో మద్దతు లేదని, ఆయనకు నూరు శాతం అనుకూలత లేదని వైసీపీ అధినాయకత్వం విశ్లేషించుకుంటోందిట. జనసేన ఒంటరిగా పోటీ చేసినా కాపులు అంతా గంపగుత్తగా ఓట్లేసే సీన్ లేదని అంచనా కడుతున్నారుట. అదే టైం లో పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీతో కలిస్తే ఇంకా పెద్ద నష్టమే రెండు పార్టీలకు కలుగుతుంది అని కూడా లెక్కలు తీస్తున్నారుట.

జనసేన కలయిక వల్ల టీడీపీలో ఎటూ సీట్లు పోతాయి. ఆ అసంతృప్తి ఉంటుంది. దాంతో పాటు కాపులు ఎంతో కొంత జనసేనకు మద్దతుగా ఉన్నా కోరి వెళ్ళి టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఆ ఓట్లు కూడా వెనక్కి వస్తాయని భావిస్తున్నారుట. పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు అంటే కాపులలో ఎంతో కొంత సానుకూలత ఉంటుంది కానీ పోయి పోయి చంద్రబాబుని సీఎం గా చేస్తామంటే ఎవరు మద్దతు ఇస్తారు అన్నదే వైసీపీ నిఖార్సు అయిన విశ్లేషణ.

దానికి తోడు ఈ రెండు పార్టీల పొత్తు వికటించి మొత్తం కాపు ఓట్లో మెజారిటీ వైసీపీకే పడతాయని కూడా అంచనా వేసుకుంటున్నారుట. అందుకే ఈ రెండు పార్టీలు పొత్తు ప్రకటన ఎంత తొందరగా చేస్తే తమకు అంత మంచిందన్న ఆలోచనలో  వైసీపీ పెద్దలు ఉన్నారని అంటున్నారు.

ఇప్పటికే మెగా ఫ్యామిలీ  రాజకీయ పార్టీలతో కాపులు సీఎం అయ్యే చాన్స్ కోల్పోయారని ఆ సామాజిక వర్గంలో బలంగా ఉందని అంటున్నారు. ఆనాడు చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేయడం అతి పెద్ద తప్పిదమని కాపులు ఈ రోజుకీ భావిస్తారు. ఇపుడు తమ్ముడు జనసేన పెట్టి సొంతంగా ఎదగకుండా తాను సీఎం అయ్యేందుకు చూడకుండా టీడీపీతో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబే మరోసారి సీఎం అవుతారు తప్ప పవన్ కాదని కాపులకు తెలియదా అంటున్నారుట.

దానికి తోడు కోస్తా జిల్లాలలో చూసుకుంటే మొదటి నుంచి కాపులకు, మక్కలకు మధ్య సామాజిక వైరుధ్యాలు ఉన్నాయని, ఇపుడు ఈ రెండు పార్టీలు పొత్తుల రూపేణ జనసేనలోకి వస్తే అది కూడా బాగా నెగిటివిటీ అవుతుంది అని వైసీపీ వ్యూహకర్తలు విశ్లేషించుకుంటున్నారు. సో పవన్ బాబు పొత్తులతో వస్తే తమకు డబుల్ బెనిఫిట్ అని వారు భావిస్తున్నారుట. చూడాలి మరి ఆసక్తికరమైన ఈ అంచనాలు ఏ మేరకు నిజం అవుతాయో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News