చీరాలలో బట్టలు చింపుకున్న వైసీపీ నేతలు

Update: 2020-12-15 13:16 GMT
ఏపీలో వైసీపీ నేతలు బహిరంగంగా బట్టలు చింపుకున్నారు. ఇదేదో గేమ్ అనుకుంటే పొరపాటే.. వాళ్లు విభేదాలతో కొట్టుకొని ఇలా చేసుకున్నారు. వైసీపీ ఎంపీ మోపిదేవి సాక్షిగా ఇలా వైసీపీ నేతల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గాల పరస్పర దాడులతో చీరాలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇందులో ఐదుగురికి గాయాలయ్యాయి.

చీరాలలో మత్స్యకారుల మధ్య నెలకొన్న వివాదం రాజకీయరగడగా మారింది. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ సాక్షిగా ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తొలుత ప్రసాదనగరంలోనూ, అనంతరం వాడరేవు, కఠారివారిపాలెం, రామన్నపేటల్లో పరస్పర దాడులకు తెగబడ్డారు. ఈ సందర్భంగా ఇరువర్గాలకు చెందిన ఐదుగురు గాయపడ్డారు.

గాయపడిన ఐదుగురులో ఇద్దరు బలరాం వర్గీయులు, ముగ్గురు ఆమంచి వర్గీయులని చెప్తున్నారు. దీంతో నియోజకవర్గంలో మరోసారి వాతావరణం వేడెక్కింది.

నేతల పర్యటన సందర్భంగా కాన్వాయ్‌లో ఒకరి వాహనాలను ఒకరు అధిగమించేందుకు బలరాం, కృష్ణమోహన్‌ అనుచరులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా కొందరు వాహనాల బయట నిలబడి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఇదే గొడవకు కారణమైంది. ప్రసాదనగరం దాటిన తర్వాత ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. అది పెద్దదై దాడుల వరకు వెళ్లింది.

ఇక వాడరేవులో మహిళలు పెద్ద సంఖ్యలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘గ్యాంగ్ ను పంపించావని.. కొట్టించావని ఇప్పుడు పరామర్శించడానికి వచ్చావా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ మోపిదేవి వారికి సర్ధిచెప్పారు. సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మోపిదేవీ చీరాల పర్యటన సందర్భంగా వైసీపీ ఆమంచి, కరణం వర్గాల మధ్య విభేదాలు ఇలా రచ్చ కెక్కాయి.
Tags:    

Similar News