వైసీపీ కొత్త ఫైర్ బ్రాండ్ వరదు కల్యాణి.. మాటలు మామూలుగా లేవుగా?

Update: 2022-09-05 05:19 GMT
వంట ఎంత అద్భుతంగా వండినా అందులో పడాల్సినంతగా ఉప్పు పడకపోతే ఏమవుతుంది? సరిగ్గా ఇప్పుడు అలాంటి మాటల్నే చెబుతున్నారు సరికొత్త ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కోసం తపిస్తున్న వైసీపీ ఎమ్మెల్సీ వరదు కల్యాణి. వైసీపీ మహిళా నేత అన్నంతనే గుర్తుకు వచ్చేది మంత్రి ఆర్కే రోజా.. వాసిరెడ్డి పద్మ. వారికి మించినట్లుగా మాట్లాడితే తప్పించి తనకంటూ సొంత ఇమేజ్ రాదని భావిస్తున్నారో ఏమో కానీ.. ఆమె నోటి నుంచి వచ్చిన మాటలు వింటే.. ఔరా అనుకోకుండా ఉండలేం.

ఇప్పటివరకు ఎప్పుడూ.. ఎవరు చెప్పని మాటల్ని ఆమె చెప్పుకొచ్చారు. బాబు హయాంలో మద్యం ఏరులై పారిందని.. లిక్కర్ స్కాం ఒకటి ఉందన్నది ఆమె ఉవాచ. అంతేకాదు లిక్కర్ స్కాం వెనుక భువనేశ్వరీ పాత్ర ఉందన్నారు. చంద్రబాబు కుటుంబంపై ఇప్పటివరకు ఎవరూ చేయని సంచలన ఆరోపణలు ఆమె చేస్తున్నారు. బాబు అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని భువనేశ్వరి వేలాది కోట్ల రూపాయిలు ఆర్జించారన్నారు. మద్యం కంపెనీలన్నీ టీడీపీ వారివేనని.. మద్యం అనుమతుల వెనుక భువనేశ్వరి హస్తం ఉందన్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. మరో కొత్త విషయాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. 'ముడుపుల వాటా కోసమే భువనేశ్వరి.. బ్రాహ్మణి మధ్య గొడవలు. భువనేశ్వరి.. బ్రాహ్మణి గురించి మాకు అంతా తెలుసు. ముడుపుల కోసం ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చారు.

మద్యం ముడుపులపై న్యాయవిచారణ జరగాలి' అంటూ కొత్త తరహా ఆరోపణలు చేసి సంచలనంగా మారారు. భారతమ్మ మీద విమర్శలు చేస్తే తాట తీస్తామని.. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నాలుక కోస్తామంటూ వార్నింగ్ ఇచ్చేశారు.

ఇంతవరకు చంద్రబాబు మీద విమర్శలు చేసినోళ్లే కానీ.. ఆయన సతీమణి భువనేశ్వరి మీద కానీ కోడలు బ్రాహ్మణి మీద కానీ ఆరోపణలు చేసిందే లేదు. వాటా కోసం భువనేశ్వరితో బ్రాహ్మణి గొడవ పడ్డారన్న కల్యాణి మాటల్నే తీసుకుంటే.. అందుకు ఉన్న అవకాశాలేంటి? భువనేశ్వరికి లోకేశ్ కాకుండా ఇంకెవరైనా పిల్లలు ఉంటే వారి కోసం ఆమె గొడవ పడుతుందని అనుకోవచ్చు.

ఉన్నది ఒకే ఒక్క కొడుకు. అది కూడా చంద్రబాబుకు అన్ని విధాలుగా వారసుడిగా గుర్తింపు పొందిన వేళ.. సంపాదించిన సంపాదన మీద గొడవ పడాల్సిన అవసరం ఏముంది. సంచలనాల కోసం ఏది పడితే అది మాట్లాడే కన్నా.. కాస్తంత లాజిక్ అన్నా ఉంటే బాగుంటుందన్న విషయాన్ని వైసీపీ వారి కొత్త ఫైర్ బ్రాండ్ గుర్తిస్తే మంచిదేమో?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News