మంత్రి పదవి కలగా మిగలనుందా?

Update: 2022-01-07 02:30 GMT
మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆ నాయ‌కుడు మంత్రి ప‌ద‌విపై ఆశ పెట్టుకున్నారు. కానీ జిల్లాలో స‌మీక‌ర‌ణాల కార‌ణంగా ఆయ‌న‌కు తొలి విడ‌త‌లో అవ‌కాశం ద‌క్క‌లేదు. దీంతో రెండో విడ‌త‌లో త‌న‌కు క‌చ్చితంగా మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా సొంత పార్టీ నేత‌ల నుంచి ఆయ‌నపై వ‌స్తున్న వ్య‌తిరేక‌త మంత్రి ప‌ద‌విని దూరం చేసేలా క‌నిపిస్తోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇంత‌కీ ఆ నాయ‌కుడు ఎవ‌రంటే.. పాయ‌క‌రావుపేట వైసీపీ ఎమ్మెల్యే గొర్ల బాబూరావు.

మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాబూరావుకు జ‌గ‌న్ అధికారంలోకి రాగానే మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని భావించారు. కానీ అదే జిల్లా నుంచి అవంతి శ్రీనివాస‌రావుకు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంతో బాబూరావుకు నిరాశే ఎదురైంది. ఇక రెండున్న‌రేళ్ల త‌ర్వాత మంత్రివ‌ర్గంలో మార్పులు ఉంటాయ‌ని జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడే చెప్పారు.

దీంతో ఈ సంక్రాంతికి అటూఇటూగా మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ సారి త‌న‌కు క‌చ్చితంగా మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని బాబూరావు ఆశ పెట్టుకున్నారు. కానీ ఈ సారి కూడా ఆయ‌న‌కు మొండిచెయ్యే ఎదురయ్యే అవ‌కాశం ఉంది. క్షేత్ర‌స్థాయిలో సొంత పార్టీ నుంచే ఆయ‌న‌కు వ్య‌తిరేక‌త ఎదుర‌వుతుండ‌డ‌మే అందుకు కార‌ణం.

పాయ‌క‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని మండ‌లాల్లోనూ వైసీపీ పార్టీ నేత‌లే బాబూరావుకు ఎదురు తిరుగుతున్నార‌ని స‌మాచారం. తాము వైసీపీలో ఉంటామ‌ని కానీ బాబూరావుకు మాత్రం వ్య‌తిరేక‌మ‌ని బ‌హిరంగంగా ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మొద‌టి నుంచి కాపుల ఆధిప‌త్యం కొన‌సాగుతోంది. దీంతో ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ కోటా కింద ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లు కాపు నేతలు చెప్పిన‌ట్లు వినాల్సి వ‌స్తుంద‌నే అభిప్రాయాలున్నాయి. ఈ నేప‌థ్యంలో బాబూరావుకు వ్య‌తిరేకంగా పార్టీలో గ్రూపులు ప‌నిచేస్తున్నాయ‌ని చెప్తున్నారు.

మ‌రోవైపు అధిష్టానం కూడా ఈ విష‌యంపై దృష్టి సారించ‌డం లేద‌ని తెలిసింది. బాబూరావుకు సొంత పార్టీ నుంచే వ్య‌తిరేక‌త వ‌స్తున్న‌ప్ప‌టికీ హైక‌మాండ్ ఆయ‌న‌పై పాజిటివ్‌గా లేద‌ని స‌మాచారం. దీంతో కొంత‌కాలం పాటు అధిష్ఠానంపై అలిగిన ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా కూడా ఉన్నారు. ఈ ప‌రిస్థితుల్లో ఆయ‌న్ని టీటీడీ స‌భ్యుడిగా నియ‌మించారు. అది ఆయ‌న‌కు ఇష్టం లేద‌ని స‌మాచారం.


Tags:    

Similar News