వ‌చ్చాడ‌య్యో.. సామీ.. ఆర్‌. కృష్ణ‌య్య అరంగేట్రం.. డిమాండ్ ఏంటంటే!

Update: 2022-09-19 02:30 GMT
సీఎం కేసీఆర్ గిరిజ‌నుల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తామ‌ని.. అన‌డ‌మే ఆల‌స్యం.. `వ‌చ్చాడ‌య్యో.. సామి` అన్న‌ట్టుగా.. బీసీ నాయ‌కుడు ఆర్‌. కృష్ణ‌య్య హైద‌రాబాద్‌లో వాలిపోయారు. ఆ వెంట‌నే.. డిమండ్ల చిట్టాను తెర‌మీదికి తెచ్చాడు.. పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు బీసీలు ఐకమత్యంతో ముందుకు నడవాలని  అన్నారు. అన్ని రాజకీయపార్టీలు బీసీలకు అన్ని రంగాల్లో అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. రాష్ట్రంలో గిరిజనులకు 6 శాతం నుంచి 10 శాతం రిజర్వేషన్లు ఎలా కల్పించారో.. అలాగే బీసీలకు ఉన్న 29 శాతం రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని డిమాండ్‌ చేశారు.

నేడు ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందని.. అన్ని రాజకీయ పార్టీల్లో డబ్బు ఉన్నవారు, అగ్రకులాల వారే అధికారం చెలాయిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు కూడా అయిన ఆర్‌.కృష్ణయ్య అన్నారు. ప్రపంచ వెదురు దినోత్సవం పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా మేదరి సంఘం ఆధ్వర్యంలో తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ గార్డెన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన   మాట్లాడారు.

ప్రపంచ నాగరికతకు పునాది వెదురు అన్నారు. ఇప్పుడు ప్లాస్టిక్ వాడకం పెరిగిన తర్వాత వెదురు వృత్తి దెబ్బతిన్నదని పేర్కొన్నారు. పుట్టినప్పటి నుంచి కాటి వరకు వెదురు, మేదరులు లేనిది జీవనం ముందుకు సాగడం కష్టం అని అన్నారు. గతంలో వెదురుతో మేదరులు జీవనం కొనసాగించే వారని గుర్తు చేశారు. తట్ట, బుట్ట, గంప, చాట ఇలా మనిషి జీవన విధానంలో ప్రథమ భూమిక మేదరిదన్నారు.

పుట్టినప్పటి నుంచి పుట్టెడు కష్టాలతో మేదరి కులం ఉందన్నారు. సమాజానికి ఉపయోగపడే కులవృత్తులు చేస్తున్న కులాలకు ప్రభుత్వాలు ఏం ఇచ్చాయని ప్రశ్నించారు. ప్రభుత్వాలను ప్రశ్నించినప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని సూచించారు. ప్రతి కులాభివృద్ధిలో చదువు కీలకం.. దానితో అధికారం చేతికొస్తుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు వేల హాస్టళ్లు ఉన్నాయన్న ఆయన.. గురుకులాల కోసం కొట్లాడితే 1,200 గురుకులాలు మంజూరయ్యాయని తెలిపారు. ఇప్పుడు రిజ‌ర్వేష‌న్ల‌పైనా పోట్లాడాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.
Tags:    

Similar News