ఎన్నికల వేళ.. మరోమారు యోగి 'పిడకల' మంత్రం!

Update: 2023-04-04 23:00 GMT
వచ్చే ఏడాది వేసవిలో లోక్‌ సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యధికంగా 80 పార్లమెంటు సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్‌ లో మెజారిటీ సీట్లను కొల్లగొట్టడమే లక్ష్యంగా బీజేపీ సంసిద్ధమవుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించడానికి మళ్లీ గోవు కేంద్రంగా రాజకీయాలకు తెర తీస్తోంది. హిందుత్వ రాజకీయాలనే నమ్ముకున్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో మరోమారు విజయం సాధించడానికి ఇప్పటి నుంచే ఈ దిశగా వ్యూహాలు రచిస్తోంది.

ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అధికారులకు సంచలన ఆదేశాలు జారీ చేశారు.  శ్మశానవాటికలలో అంత్యక్రియలకు ఉపయోగించే కలపలో 50 శాతం మేర ఆవు పేడతో చేసిన పిడకలు ఉంచాలని ఆదేశించారు. ఆవు పేడ పిడకల విక్రయం ద్వారా  వచ్చే ఆదాయాన్ని సంబంధిత గోసంరక్షణ కేంద్రం నిర్వహణకు వినియోగించాలని సూచించారు. ఉత్తరప్రదేశ్‌ లో ఆవు పేడ పిడకల వినియోగం పెంచాలని కోరారు.

అలాగే గోసంరక్షణ ప్రదేశాల్లో గోసంరక్షకులను నియమించాలని అధికారులను యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశించారు. పశువులు అనారోగ్యంతో మరణిస్తే సంరక్షకుడు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.

అదేవిధంగా ఆవులను కూడా ఎప్పటికప్పుడు నడకకు తీసుకెళ్లాలని యోగి ఆదిత్యనాథ్‌ సంచలన ఆదేశాలు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో 17 మునిసిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 'పశువు క్యాచర్‌' వాహనం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

ప్రజల మనోభావాలకు తమ ప్రభుత్వం గౌరవిస్తోందని యోగి ఆదిత్యనాథ్‌ తన నిర్ణయాన్ని సమర్థించుకోవడం విశేషం. బలహీనంగా ఉన్న పశువుల సంరక్షణ, వాటి మేత కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం 6719 పశుసంరక్షణ కేంద్రాల్లో 11.33 లక్షలకు పైగా పశువులను ప్రభుత్వమే సంరక్షిస్తోందని తెలిపారు.

ఇప్పటికే గంగా నది ప్రక్షాళన, కాశీ పుణ్యక్షేత్రం కారిడార్, అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తదితర హిందుత్వ అంశాలతో బీజేపీ ముందుకు వెళ్తోంది. ఇప్పుడు గోవు కేంద్రంగా ఆవు పిడకలు అంటూ రాజకీయాలకు తెర తీయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.             


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News