సప్తగిరి నటించిన లవర్స్ సినిమాలో అందరినీ అలరించిన సీన్ ఒకటి గుర్తుందా మీకు? అదేనండి మగజాతి అణిముత్యంగా తనకు తాను సర్టిఫికేట్ ఇచ్చుకునే సప్తగిరి తనను ఓ అపార్ట్‌మెంట్‌కు తీసుకువెళుతున్న సమయంలో...రోడ్డుపై ఓ అమ్మాయి స్కర్ట్‌తో వెళుతుంటే ఆటోలోంచి దూకి మరీ...ఆమెపై దాడి చేస్తాడు. ``బాత్రూంలో వేసుకునే బట్టలను బయట వేసుకొని తిరుగుతావా? నా దేశం పరువు ఏం కాను?`` అంటూ ఫైర్ అయిపోతాడు. అచ్చూ అలాంటి సంఘటనే ఇస్తాంబుల్లో జరిగింది. బస్సులో వెళుతున్న సమయంలో పొట్టి దుస్తులు వేసుకుందని అమ్మాయి చెంపచెళ్లుమనిపించాడు ఓ అబ్బాయి. అలా ఒకటి కాదు రెండు సార్లు చేశాడు ఆ ఘనుడు!
21 ఏళ్ల అసీనా మెలిసా సగ్లామ్ అనే యువతి బస్సులో ప్రయణిస్తున్న సమయంలో షార్ట్ వేసుకొని ఉంది. ఆమె వెనుక సీటులో కూర్చున్న ఓ యువకుడు బస్సు దిగేందుకు అన్నట్లుగా వెళుతూ అసీనా చెంపచెళ్లుమనిపించాడు. ఆ యువతి తేరుకొని వెంటనే అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా మరోమారు అదే రీతిలో చెంపపై కొట్టిన అగంతకుడు బస్సు దూకి పరారయ్యాడు. ఈ సంఘటన చూసి షాక్ తిన్న పలువురు ఆ అమ్మాయిని ఓదార్చారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు మొదట సీసీటీవీ రికార్డులను సేకరించారు. దాని ప్రకారం నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
మరోవైపు సదరు అగంతకుడి చర్యకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సదరు యువకుడి తీరుపై పలువురు మండిపడుతున్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/