జగన్ గొంతు ఎందుకు మూగబోయింది...?

Update: 2022-08-08 11:30 GMT
పులి లాంటి జగన్ పులివెందుల హీరో జగన్ ప్రధాని మోడీ ఎదుట మాత్రం నోరు మెదపలేకపోతున్నారు అన్న టాక్ చాలా కాలంగా ఉంది. ఆయన విపక్షంలో ఉన్నపుడు అయితే కేంద్రం మెడలు వంచుతామని జనాల వద్ద భారీ డైలాగులు కొట్టారు. కానీ అధికారంలోకి వచ్చాక  మాత్రం బాగా తగ్గిపోయారు అని కూడా అంటున్నారు. ఎక్కడి జగన్ ఇలా ఎందుకు జగన్ అన్న మాట మాత్రమే అందరి నోటా వస్తోంది.

ఒకనాడు పవర్ ఫుల్ లీడర్ గా ఉన్న సోనియా గాంధీని ఎదిరించిన జగన్ ఇపుడు మాత్రం మోడీ సర్కార్ ఎదుట ఏమీ మాట్లాడలేని నిస్సహాయతతో ఉన్నారని అంటున్నారు. జగన్ సీఎం అయ్యాక కేంద్రం మరింతగా ఏపీకి అన్యాయం చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. పోలవరం కానీ రాజధాని కానీ ఏపీకి సంబంధించి విభజన హామీలు నెరవేర్చడంలో కానీ ఏపీకి న్యాయంగా ఇవ్వాలసిన నిధుల విషయనంలో కానీ కేంద్రం ఏ మాత్రం ఉలుకూ పలుకూ లేదు.

మరి కేంద్రాన్ని దడాయిస్తామని చెప్పే వైసీపీ పెద్దలు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కగానే ఫుల్ సైలెంట్ మోడ్ లో ఉంటున్నారు అని విమర్శలు ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే లేటెస్ట్ గా నీతి అయోగ్ సమావేశం ప్రధాని అధ్యక్షతన ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి ఏపీ తరఫున ముఖ్యమంత్రి హోదాలో హాజరైన జగన్ ఏపీలో తమ ప్రభుత్వం ఏం చేసింది అన్నదే చెప్పుకొచ్చారు. విభజన తరువాత వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఏపీ ఉందని ఆయన అన్నారు. తాము రైతులకు ఎంతో మేలు చేస్తున్నామని కూడా పేర్కొన్నారు.

అలాగే నాడు నేడు పేరిట విద్య వైద్య రంగాలలో అభివృద్ధి చేశామని కూడా చెప్పుకొచ్చారు. ఇవన్నీ ఓకే కానీ కేంద్రం ఏపీకి ఏమిచ్చింది. ఈ ఎనిమిదేళ్లల్లో విభజన తరువాత కేంద్రం ఏపీకి ఎంత చేయాలి, చివరికి ఏమి చేసింది ఈ వివరాలను గణాంకాలతో సహా జగన్ ప్రధాని వద్ద నీతి అయోగ్ మీటింగులో ఎందుకు చెప్పలేకపోయారు అని అంటున్నారు. జగన్ గొంతు ఎందుకు మూగపోయింది అని కూడ నిలదీస్తున్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన జగన్ మూడేళ్ళుగా కనీసం ఆయన చెప్పిన మేరకు ప్లీజ్ ప్లీజ్ అంటూనే ప్రత్యేక హోదాను ఎందుకు అడగలేకపోతున్నారు అని కూడా అంతా అంటున్నారు.

ఇక పోలవరం విషయంలో కేంద్రం దాష్టికమే చేస్తోంది. 2014 నాటి లెక్కలకే కట్టుబడి ఉంటామని చెబుతూ వస్తోంది. పైగా పునరావస ప్యాకేజి విషయంలో ఏ మాత్రం సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తోంది. పోలవరం పూర్తి కావాలీ అంటే పునరావాస ప్యాకేజీయే ముఖ్యం. ఈ మధ్యనే పోలవరం గ్రామాలను సందర్శించిన జగన్ మీ బాధలు అన్నీ ప్రధాని మోడీకి వివరిస్తాను అని చెప్పారు. మరి మోడీ ఎదురుగా ఉన్నపుడు ఎందుకు అడగలేకపోయారు అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

ఇంకో విషయం తీసుకుంటే మూడు రాజధానులు అని వైసీపీ మంత్రులు హడావుడి చేస్తూంటారు. మరి దాని విషయంలో జగన్ కేంద్రం వద్ద ఏమి అడిగారు, ఎందుకు తేల్చుకోలేకపోతున్నారు అన్నది కూడా ప్రశ్నగానే ఉంది. అంతే కాదు రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కూడా జగన్ గట్టిగా కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేకపోతున్నారు అన్నది కూడా అంతా ప్రశ్నిస్తున్నారు. అసలు మోడీ ఎదుట ఎందుకు జగన్ గొంతు మూగపోయింది అన్నదే ఇపుడు అందరి చర్చగా ఉంది. ఏది ఏమైనా నీతి అయోగ్ మొక్కుబడి తంతు మీటింగ్ అని కేసీయార్ గైర్ హాజర్ అయ్యారు. హాజరైన జగన్ కూడా ఏపీకి ఏమి సాధించారు, కనీసం ఏపీ కష్టాల గురించి ప్రధాని దృష్టికి ఏమి తెచ్చారు అంటే జవాబు మాత్రం లేదు. మొత్తానికి జగన్ ఢిల్లీ వెళ్లారు వచ్చారు అన్నట్లుగానే ఈ కధ ఉంది అంటే తప్పు లేదేమో.
Tags:    

Similar News