బ‌ర్ఖాద‌త్ ఇంట‌ర్వ్యూలో జ‌గ‌న్ ఏం చెప్పారు?

Update: 2019-05-28 05:30 GMT
ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్‌.. హెచ్ టీఎన్ ఛాన‌ల్ మేనేజింగ్ ఎడిట‌ర్ బ‌ర్ఖాద‌త్ కు ఏపీకి కాబోయే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు అంశాల‌పై సూటిగా స‌మాధానం ఇచ్చేశారు. తాజా ఇంట‌ర్వ్యూలోనూ ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో త‌న వాద‌న‌ను బ‌లంగా వినిపించిన ఆయ‌న‌.. హోదాకు బ‌దులుగా ప్యాకేజీ కుద‌ర‌ద‌ని తేల్చేశారు. హోదాతోనే ఏపీకి ప్ర‌యోజ‌న‌మ‌ని.. ప్యాకేజీతో ఏ మాత్రం లాభం ఉండ‌ద‌ని తేల్చేశారు.

హోదాతో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌.. ఉద్యోగ క‌ల్ప‌న‌కు అనువుగా ఉంటుంద‌న్న ఆయ‌న‌.. ప‌లు అంశాల మీద త‌న అభిప్రాయాన్ని స్ప‌ష్టంగా చెప్పేశారు. ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా బ‌ర్ఖాద‌త్ అడిగిన ప్ర‌శ్న‌లు.. వాటికి జ‌గ‌న్ చెప్పిన స‌మాధానాల్ని చూస్తే..

బర్ఖాదత్‌: కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా.. ప్యాకేజీ ఇస్తామంటే..?

జగన్‌: ప్రత్యేక ప్యాకేజీతో ప్రయోజనం లేదు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో వంద శాతం ఆదాయ పన్ను - జీఎస్టీ మినహాయింపులున్నాయి. అలాంటి ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు లభించకపోతే.. ఎవరైనా ఆంధ్రప్రదేశ్‌ లో ఓ హోటల్‌ ఎందుకు కడతారు? పరిశ్రమ ఎందుకు పెడతారు? హైదరాబాద్ - బెంగళూరు - చెన్నై వంటి టైర్‌ –1 నగరాలతో పోటీ పడాలంటే.. టైర్‌ –2 నగరాలు మాత్రమే ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సాధ్యం కాదు. కాబట్టి మాకు ప్రత్యేక హోదా అవసరం.

బర్ఖాదత్‌: ఫలితాలు వెలువడేంత వరకూ చంద్రబాబు ఢిల్లీలో పలువురు రాజకీయ నేతలతో సమావేశాలు జరిపారు. రాష్ట్రంలోనే కాదు.. కేంద్రంలోనూ కీలకపాత్ర పోషించే స్థాయిలో విజయం సాధిస్తామనుకున్నారు. అంత విశ్వాసం ఎలా ఏర్ప‌డింది?

జగన్‌: ఆ సమావేశాలన్నీ గెలుస్తామన్న విశ్వాసంతో చేసినవని అనుకోవడం లేదు. ఎందుకంటే అదో డ్రామా. తాను ఓడిపోతున్నానని.. రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ ప్రభంజనం ఉందన్న విషయాన్ని ఆయన ముందుగానే గుర్తించారు. అందుకే రాజకీయంగా జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించుకునే ఉద్ధేశంతో తనను తాను ఓ సంధానకర్తగా - అన్ని పార్టీల వారికి ఇష్టుడిగా చూపించుకునేందుకు ప్రయత్నం చేశారు.

అప్పటికే కలిసి ఉన్న వారిని చంద్రబాబు కొత్తగా కలిపేదేముంటుంది? శరద్‌ పవార్ - రాహుల్‌ గాంధీ మాట్లాడుకోకుండా ఉన్నారా? కుమారస్వామికి - రాహుల్‌ గాంధీకి మధ్య సంబంధాలు లేవా? యూపీఏ కూటమిలో భాగంగా ఉన్న వారిని మళ్లీ కలుపుతానని బాబు వెళ్లడం ఏమిటి?

బర్ఖాదత్‌: ఏపీలో కాంగ్రెస్‌ ఓట్లు రెండు శాతం కంటే తక్కువకు పడిపోయాయి. మీకు చేసిన అన్యాయానికి శిక్షపడిన‌ట్లు భావిస్తున్నారా?

జగన్‌: ఈ విషయాలకు ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. ఆ విషయాలను అలా వదిలేద్దాం. ఇప్పుడు వాటి గురించి మరిన్ని వ్యాఖ్యలు చేయడంలో అర్థం లేదు. ఓటర్లు ఒక విషయాన్ని స్పష్టం చేశారు. వ్యక్తిగా నేను చేసిందేమీ లేదు. నన్ను విమర్శించిన వారికి ఓటర్లు సమాధానం చెప్పారు.

బర్ఖాదత్‌: విజయం సాధించిన తరువాత ఉదాత్తంగా ఉండాలని అనుకుంటున్నారా?

జగన్‌: వాస్తవం ఏమిటంటే.. నాకు కక్షలు - కార్పణ్యాలపై నమ్మకం లేదు. మనుషులుగా మనకే అంశంపైనా అధికారం లేదన్నది నా నమ్మకం. అవన్నీ దేవుడి నుంచి వచ్చేవి. ఏ చర్య తీసుకోవాలన్నా అది దేవుడికే సాధ్యం.

బర్ఖాదత్‌: ఓట్లకు కోట్లు కేసు ఏమవుతుంది?

జగన్‌: చంద్రబాబు అంటే వ్యక్తిగతంగా నాకేమీ కక్ష, పగ లేదు. అయితే కొన్ని స్కాములు చేశారు. ప్రజా ప్రతినిధిగా ఉంటూ వాటిని ఎలా విస్మరించగలం? వాటన్నింటినీ వెలికితీసి ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధిగా నా మీద ఉంది. ఇందుకోసం ఓ విచారణ కమిషన్‌ ఏర్పాటు చేస్తాం.

భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని కాంట్రాక్టులు కట్టబెట్టారు. రాజధాని భూ సేకరణ విషయంలోనూ ఇదే జరిగింది. ఈ డబ్బు అంతా ప్రజలది. ఈ అక్రమాలను వెలికి తీయాలి. ఆయా పనులకు వాస్తవంగా ఖర్చయ్యేది. ఎంత అన్నది ప్రజలకు చెప్పాలి. ఇందుకోసం రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియను చేపడతాం. ఆరు నెలల్లో ఈ దేశానికి - ప్రపంచానికి ఈ ప్రభుత్వం అవినీతి రహితమన్నది చూపుతాం.

బర్ఖాదత్‌: తెలుగుదేశం - కాంగ్రెస్‌ కుట్ర పన్ని మీమీద పెట్టాయని చెబుతున్న కేసుల పరిస్థితి ఏమిటి?

జగన్‌: ప్రజాక్షేత్రంలో 50 శాతం ఓట్లతో ఇచ్చిన విజయం.. నాపై కుట్రలు ఇకనైనా ఆపండి అనేందుకు నిదర్శనం. కక్ష సాధింపు ధోరణితో కాంగ్రెస్ - టీడీపీలు కలిసి పెట్టిన కేసుల్లో డొల్లతనం ఏమిటో ఈ తీర్పుతోనే అర్థమవుతుంది. ఏపీలో నేను ఎలాంటివాడినో - నా తల్లిదండ్రులు ఎలాంటివారో అందరికీ తెలుసు. నా తండ్రి మరణించేంత వరకూ నాపై కేసుల్లేవని, కాంగ్రెస్‌ను వదిలిన తరువాతే ఈ కేసులు వచ్చిపడ్డాయనీ అందరికీ తెలుసు.


Tags:    

Similar News