జగన్ బార్ పాలసీ రెడీ... బార్ ఓనర్లకు బ్యాండే

Update: 2019-11-23 03:35 GMT
ఏపీలో దశలవారీ మద్య నిషేధం దిశగా సాగుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు... ఇప్పటికే బెల్టు షాపుల తాట తీసేసి వైన్ షాపులకు కళ్లెం వేసింది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా పుట్టగొడుగుల్లా కొనసాగుతున్న బార్లను కూడా నియంత్రించేందుకు జగన్ సర్కారు... సంచలన నిర్ణయాలను తీసుకుంది. రెండు రోజుల క్రితం కొత్త బార్ పాలసీపై జగన్ సమీక్ష చేయగా... జగన్ సూచనల ఆధారంగా అబ్కారీ శాఖ ఏపీలో నయా బార్ పాలసీకి రూపకల్పన చేసింది. శుక్రవారం సాయంత్రం ఈ పాలసీకి సంబంధించిన అధికారిక ఉత్వర్వులను కూడా జగన్ సర్కారు విడుదల చేసి పారేసింది. జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న ఈ పాలసీ చూస్తే... బార్ ఓనర్లకు బ్యాండ్ తప్పదన్న వాదన గట్టిగానే వినిపిస్తోంది. బార్ కావాలని అడిగే మద్యం వ్యాపారులకు జగన్ మార్కు షాక్ తప్పదన్న వాదన కూడా వినిపిస్తోంది.

అసలు ఏపీ కొత్త బార్ పాలసీలో ఏముందన్న విషయానికి వస్తే.. బార్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే రూ.10 లక్షల ఫీజు చెల్లించాలట. దీనిని దరఖాస్తు ఫీజుగానే పరిగణించనున్న ప్రభుత్వం... లక్కీ డిప్ ద్వారా బార్లను కేటాయించనుండగా... బార్ దక్కని బిడ్దర్లు దరఖాస్తు ఫీజుగా చెల్లించే రూ.10 లక్షలను వదులుకోవాల్సిందే. దరఖాస్తు ఫీజును నాన్ రీఫండబుల్ గా మార్చడంతో బార్ వచ్చినా... రాకున్నా కూడా బిడ్డింగ్ లో పాలుపంచుకోవాలంటేనే రూ.10 లక్షలు వదులుకునేందుకు సిద్ధం కావాల్సిందేనట. ఇది బిడ్దర్లకు ఒకింత షాక్ కొట్టే అంశమే. ఇక లైసెన్స్ ఫీజులను కూడా భారీగానే పెంచేశారు. ఒక్కసారి లైసెన్స్ దక్కించుకుంటే.. రెండేళ్ల పాటు బార్ ను నడుపుకునే అవకాశం ఉన్నా... లైసెన్స్ ఫీజును మాత్రం ఏడాదికోమారు చెల్లించాల్సిందే.

లైసెన్స్ ఫీజులను కూడా జగన్ సర్కారు భారీగానే పెంచేసింది. 50 వేల లోపు జనాభా కలిగిన ప్రాంతాల్లో బార్ కోసం రూ.25 లక్షలను లైసెన్స్ ఫీజుగా నిర్ణయించారు. అదే సమయంలో 50 వేల నుంచి 5 లక్షల లోపు జనాబా కలిగిన ప్రాంతాల్లో రూ.50 లక్షలు, 5 లక్షలకు పైగా జనాభా కలిగిన ప్రాంతాల్లో రూ.75 లక్షలుగా లైసెన్స్ ఫీజుగా నిర్ణయించారు. ఈ లైసెన్స్ ఫీజు ఏడాదికి మాత్రమే అంటే... లైసెన్స్ కాల పరిమితి రెండేళ్లు ఉన్నా... ఏడాదికోమారు నిర్దేశిత లైసెన్స్ ఫీజు చెల్లించాలన్న మాట. అంతటితో ఆగని జగన్ సర్కారు.. బార్ల సమయాలను కూడా కుదించేసింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే బార్లలో మద్యం సరఫరాకు అనుమతి ఇచ్చింది. దీంతో ఒకే సారి బార్ల సమయాలను రెండు గంటలకు కుదించేసిందన్న మాట. ఓ వైపు దరఖాస్తు ఫీజును నాన్ రీఫండబుల్ గా మార్చడం, లైసెన్స్ ఫీజులను భారీగా పెంచడం, ఆపై బార్ వేళలను కుదించడం చూస్తుంటే... జగన్ మద్యం పాలసీతో బార్ ఓనర్లకు నిజంగానే బ్యాండేనని చెప్పక తప్పదు.

Tags:    

Similar News