భార్య అధికారాన్ని అడ్డుపెట్టుకుని చ‌లాయిస్తామంటే షాకే.. జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం

Update: 2021-08-22 13:23 GMT
భార్య అధికారం అడ్డుపెట్టుకుని పెత్త‌నం చ‌లాయించే భ‌ర్త‌లు.. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని దూకుడు ప్ర‌ద‌ర్శించే బిడ్డ‌ల‌కు.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ముకుతాడువేసింది. ఇక‌పై ఇలాంటి రాజ‌కీయాలు చెల్ల‌వ‌ని తేల్చిచెప్పింది. అంతేకాదు.. ఇలాంటివి క్రిమినల్ నేరాల కింద ప‌రిగ‌ణిస్తామ‌ని స్ప‌ష్టం చేస్తూ.. ఉత్త‌ర్వులు జారీ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. విష‌యంలోకి వెళ్తే.. దేశ‌వ్యాప్తంగా కూడా త‌ల్లిదండ్రుల అధికారాలు అడ్డుపెట్టుకుని కుమారులు, కుమార్తెలు, బంధువులు రెచ్చిపోతున్న విష‌యాలు తెలిసిందే. ఎంపీలు, ఎమ్మెల్యేల కుటుంబాల అధికార విచ్చ‌ల‌విడిత‌నం ఎవ‌రూ ఆప‌లేక పోతున్నారు కూడా.

అయితే.. స్థానిక సంస్థ‌లైన గ్రామ‌పంచాయ‌తీలు, ప‌రిష‌త్‌ల‌లోనూ ఈ త‌ర‌హా పోక‌డ‌లు పెరుగుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా భార్య‌ల‌ను సర్పంచులుగా చేస్తున్న భ‌ర్త‌లు.. త‌ర్వాత అంతా తామే అయి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక‌, ప‌రిష‌త్‌ల‌లోనూ ఇలాంటి రాజ‌కీయాలు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వాల‌కు కూడా చెడ్డ‌పేరు వ‌స్తోంది. దీనిని గ‌మ‌నించిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం తాజాగా.. ఇలాంటి రాజ‌కీయాల‌పై కొర‌డా ఝ‌ళిపించేందుకు రెడీ అయింది. గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ అధికారిక సమావేశాల్లో ప్రజాప్రతినిధులకు బదులుగా భార్య, భర్త, కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొంటున్నారని పంచాయతీ రాజ్ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.

పంచాయతీ రాజ్‌ వ్యవస్థకు సంబంధించి నిర్ణయాలు కూడా వారే తీసుకుంటున్నారని, ఇది రాజ్యంగ వ్యతిరేకమని స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు అధికారిక సమావేశాల్లో పాల్గొంటున్నారని తెలిస్తే సంబంధిత పంచాయతీ సెక్రటరీ, ఎంపీడీవో, డీపీవో, జెడ్పీటీసీ ఈవోలపై కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ప్రకారం చర్యలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర పంచాయతీ రాజ్ చట్టం 2018- సెక్షన్ 37(5) ప్రకారం (మహిళ) ప్రజా ప్రతినిధుల భర్త, కుటుంబ సభ్యులు, బంధువులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. మ‌రి ఈ నిర్ణ‌యం ఏ మేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి. ఏదేమైనా కుటుంబ రాజ‌కీయాల‌కు చెక్ పెడుతూ.. ఇన్నాళ్ల‌కు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోవ‌డం మాత్రం సాహ‌స‌మ‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News