బాబు మైండ్ గేమ్‌ పై...వైసీపీ పంచ్ పేలిందే!

Update: 2017-09-19 08:37 GMT
క‌ర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీకి జ‌రిగిన ఉప ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత అధికార టీడీపీ ఓ ర‌క‌మైన వ్యూహాన్ని అమ‌లు చేస్తోంద‌న్న వార్త‌ల‌కు ఇప్పుడిప్పుడే బ‌లం చేకూరుతోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. నంద్యాల బై పోల్స్‌ లో విజ‌యం, ఆ వెంట‌నే కాకినాడ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో గెలుపు కూడా ఈ న‌యా వ్యూహానికి ఆ పార్టీ ప‌దును పెట్టింద‌న్న పుకార్లు కూడా ఇప్పుడు షికారు చేస్తున్నాయి. అయితే గ‌తంలోనూ ఇదే వ్యూహంతో ముందుకు వెళ్లిన టీడీపీ.... ఇప్పుడు ఆ పాత ప్లాన్‌కే కాస్తంత రంగులేసి మ‌రీ కొత్త క‌ల‌రింగ్‌లో ఆ వ్యూహాన్ని అమ‌లు చేస్తోంద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఆ వ్యూహం ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... నంద్యాల, కాకినాడ‌ల్లో గెలుపు త‌ర్వాత 2019 ఎన్నిక‌ల్లో కూడా త‌మ‌నే గెలుపు వ‌రిస్తుంద‌ని ట‌డీపీ బ‌లంగా విశ్వ‌సిస్తోంది. అంటే మ‌రో ఐదేళ్ల వ‌ర‌కు టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడే న‌వ్యాంధ్ర‌కు సీఎంగా కొన‌సాగుతార‌న్న మాట‌.

ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదిన్న‌ర స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో ఈ త‌ర‌హా ప్ర‌చారానికి టీడీపీ శ్రీ‌కారం చుట్ట‌డం వెనుక ప‌లు వ‌ర్గాల్లో విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. అదే స‌మ‌యంలో ముందే కూసిన కోయిల... అన్న చందాన రాజ‌కీయ పార్టీలు చెప్పే మాటే క‌దా అని కూడా కొంద‌రు టీడీపీ వ్యాఖ్య‌ల‌ను అంత‌గా ప‌ట్టించుకోలేదు. అయితే ఇదే మాట‌ను ప‌దే ప‌దే చెబుతున్న చంద్ర‌బాబు అండ్ కో... విజ‌యం త‌మ‌నే వ‌రిస్తుంది గ‌నుక‌... ఇప్పుడు వైసీపీలో ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో చాలా మంది త‌మ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నార‌ని స‌రికొత్త ప్ర‌చారం మొద‌లుపెట్టారు. ఇక టీడీపీ అనుకూల మీడియా అయితే ప‌నిగ‌ట్టుకుని మ‌రీ... కొంద‌రు వైసీపీ నేత‌ల పేర్ల‌ను ప‌రోక్షంగా ప్ర‌స్తావిస్తూ క‌థ‌నాలు రాసేస్తోంది. ఈ క్ర‌మంలోనే వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత జిల్లా క‌డ‌ప‌కు చెందిన మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి కూడా త్వ‌ర‌లో పార్టీ మారుతున్నారంటూ క‌థ‌నాలు వ‌చ్చాయి.

మిగిలిన నేత‌లు... టీడీపీ కొత్త వ్యూహాన్ని అంత‌గా ప‌ట్టించుకోకున్నా... ర‌ఘురామిరెడ్డి మాత్రం చాలా వేగంగా స్పందించారు. తాను పార్టీ మారుతున్న‌ట్లుగా వ‌స్తున్న వార్త‌ల్లో ఎలాంటి వాస్త‌వం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కాసేప‌టి క్రితం మీడియా ముందుకు వ‌చ్చిన ఆయ‌న చంద్ర‌బాబు అండ్ కో ప్రారంభించిన మైండ్ గేమ్‌ను చాలా సూటిగానే కాకుండా కాస్తంత గ‌ట్టిగానే కొట్టేశారు. తాను టీడీపీలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయని... ఇందులో వాస్తవం లేదని, ఇదంతా కేవలం దుష్ప్రచారం మాత్రమేనని రఘురామిరెడ్డి అన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఓ సామెత‌ను చెప్పి... బాబు అండ్ కోకు మైండ్ బ్లాక్ అయ్యే ప్ర‌క‌ట‌న చేశారు. ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరిగినట్టు కొన్ని దుష్ట శక్తులు తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఓ పార్టీ తరపున గెలిచి, మరో పార్టీలోకి వెళ్లడం తన నైజం కాదని కూడా ఆయ‌న‌ అన్నారు. మ‌రి ఈ కామెంట్ల‌పై టీడీపీ నేత‌లు ఏమంటారో చూడాలి.
Tags:    

Similar News