చింతమనేనికి 'అబ్బాయి' టెన్షన్

Update: 2018-12-25 08:33 GMT
దూకుడు సినిమాలో మహేష్ బాబు కంటే స్పీడుగా రాజకీయాల్లో రెచ్చిపోతున్నారు దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. చూడడానికి గంభీరంగా కనిపించే ఈ టీడీపీ ఎమ్మెల్యే తీరు ఆది నుంచి వివాదాస్పదమే.. ఎన్నో గొడవలు - కొట్లాటలతో మీడియాలో హైలెట్ అవుతుంటారు. ప్రభుత్వ అధికారులతో ఈయన పెట్టుకున్న గొడవలతో టీడీపీకి చెడ్డపేరు కూడా వచ్చింది. అయితే ప్రజల్లో మాత్రం ఈయన మాస్ ఫాలోయింగ్ కు కొంచెం ఆదరణ ఉండేది. ప్రజలకు అందుబాటులో ఉండే నేతగా పేరుండేది. కానీ ఇప్పుడు ఒకే ఒక్కడు.. ఎన్ ఆర్ ఐ యువకుడు ఆయనకు చెమటలు పట్టిస్తున్నాడు. కుర్రాడే కదా అని లైట్ తీసుకున్న చింతమనేనికి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఎవరా కుర్రాడు.. అంతలా చింతమనేనిని ఎలా షేక్ చేస్తున్నాడన్నది ఆసక్తిగా మారింది.

బయటకు మాస్ లీడర్ గా దూకుడుగా కనిపించే చింతమనేని ప్రభాకర్ కు ఇన్నాళ్లు కరెక్ట్ మొగుడెవరు దొరకలేదు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన దెందలూరు నియోజకవర్గంలో ఆయనను హోరాహోరీ ఢీకొట్టే నాయకుడు ఇన్నాల్లు కనిపించలేదు. దెందలూరులో బలమైన టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న చింతమనేనికి ఇన్నాళ్లు ఎదురులేకుండా ఉంది. అక్కడ చింతమనేనికి పోటీ ఇచ్చే నేత కోసం అన్ని పార్టీలు కళ్లు కాయలు కాసేలా వెతికినా సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు వైసీపీకి ఒక యువ నేత దొరికాడు. ఆయన దూకుడు ఇప్పుడు చింతమనేనిని షేక్ చేస్తోంది.

యూకేలో చదువుకొని రాజకీయాలపై ప్రేమ.. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో మూడు సంవత్సరాల క్రితం భారత్ కు వచ్చాడు  యువ నాయకుడు ‘అబ్బాయి చౌదరి’.. రెండేళ్లుగా వైసీపీ పార్టీలో క్రియాశీలంగా మారారు. ఈయన స్టామినా - అభిరుచి చూసి వైఎస్ జగన్ దెందలూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జిగా నియమించారు. అయితే యూకేలో చదువుకున్నాడు.. చింతమనేనికి ఏం పోటీ ఇస్తాడు అని అందరూ మొదట్లో అనుకున్నారు.. చింతమనేని కూడా అబ్బాయి చౌదరిని లైట్ తీసుకున్నాడు. ఈ కుర్రాడు ఏం చేస్తాడు అని అనుకున్నాడు.. కానీ ట్రైయిన్ రివర్స్ అయ్యింది.

అబ్బాయి చౌదరి దెందలూరు వైసీపీ ఇన్ చార్జిగా అయిన మొదలు స్లోగా చాపకింద నీరులా పార్టీని బలోపేతం చేశారు. కార్యకర్తలు - నేతలను సమీకరించారు. ఇప్పుడు చింతమనేనికే చెక్ పెట్టే స్థాయికి తన బలాన్ని విస్తరించాడు. అతని స్పీడు, దూకుడు  తాజాగా ‘అబ్బాయి చౌదరి’ పుట్టిన రోజు వేడుకల నాడు కళ్లకు కట్టింది. ఈనెల 22న జరిగిన అబ్బాయి చౌదరి బర్త్ డే వేడుకల్లో ఆయన అభిమానులు కార్యకర్తలు దాదాపు 6వేల బైక్ లు - వందలాది కార్లలో నియోజకవర్గం మొత్తం ర్యాలీ తీసి సత్తా చాటారు. ఈ ర్యాలీ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని సొంతూరు దుగ్గిరాలకు కూడా వచ్చింది. అక్కడ చింతమనేనికి వ్యతిరేకంగా వైసీపీకి నిలబడే ధైర్యం ఎవ్వరూ చేయలేరు.. చింతమనేనిని ఎదురించలేరు. కానీ ఇక్కడే అద్భుతం జరిగింది. దుగ్గిరాల సెంటర్ లో కూడా ‘అబ్బాయి చౌదరి’ వచ్చాడని దాదాపు 10వేల మంది ప్రజలు వచ్చి ఘన స్వాగతం పలికారు.

ఈ పరిణామాలన్నీ చూశాక చింతమనేనికి ఇప్పుడు ‘అబ్బాయి’ టెన్షన్ పట్టుకుంది. అస్సలు పోటీ కాడనుకున్న అబ్బాయికి నియోజకవర్గంలో వస్తున్న స్పందన చూసి వచ్చే ఎన్నికల్లో తేడా కొడుతుందేమోనన్న  భయం చింతమనేనిని వెంటాడుతోందట.. ఇప్పుడు యువనేత ను చూసి ఓటమి భయం చింతమనేనికి పట్టుకుందట..

ఇదంతా చూస్తున్న నియోజకవర్గ ప్రజలు ఇన్నాళ్లకు చింతమనేనికి కరెక్ట్ మొగుడొచ్చాడ్రా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. చింతమనేని దూకుడుకే డబుల్ దూకుడుగా ఉన్న ఈ ఎన్ఆర్ఐ నిలిచాడని.. వచ్చాడు వెళ్లిపోతాడనుకుంటే ఏకుమేకయ్యాడు అని  చర్చించుకుంటున్నారు. దెందులూరు నియోజకవర్గంలో బలంగా లేని లేని వైసీపీ పార్టీని బలోపేతం చేసి.. చింతమనేని సామాజికవర్గం కమ్మ నేతలు - ప్రజలను తనవైపు తిప్పుకుంటున్నాడు. ప్రజలకు ఆశాకిరణంగా కనిపిస్తున్న అబ్బాయి చౌదరిని చూస్తుంటే టీడీపీ ఎమ్మెల్యేకు చెక్ పెట్టేనాలే కనిపిస్తున్నాడంటున్నారు.. చూడాలి మరి ఏం జరుగనుందో..


Tags:    

Similar News