వామ్మో..ఏబీ ఫోన్ ట్యాపింగూ చేశారట!

Update: 2020-02-10 17:29 GMT
ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి - ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుపై విమర్శల జడివాన కురుస్తోంది. ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న సమయంలో ఇజ్రాయెల్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా నిఘా పరికరాలు కొన్నారని - దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా వ్యవహరించారని - తన కుమారుడి కంపెనీకి లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలపై ఏబీపై జగన్ సర్కారు సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా వైసీపీ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారని ఏబీపై మరో ఆరోపణ వచ్చి పడింది.

ఈ క్రమంలో వైసీపీ నేతలు వరుసగా మీడియా ముందుకు వచ్చి ఏబీ వ్యవహారాలపై సంచలనాలకే సంచలనాలుగా నిలుస్తున్న ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా ఏబీపై సంచలన ఆరోపణలు చేశారు. ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న సమయంలో వైసీపీ నేతలపై నిఘా పెట్టిన ఏబీ... వైసీపీకి చెందిన చాలా మంది నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారని కూడా మల్లాది ఆరోపించారు. ఎన్నికల ముందు తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని.. ఈ వ్యవహారాన్ని ఏబీ వెంకటేశ్వరరావే నడిపించారని ఆయన ఆరోపించారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను త్వరలో ప్రజల ముందు ఉంచుతామని మల్లాది పేర్కొన్నారు.

తెలుగుదేశం హయాంలో ఏబీ ఓ పోలీసు అధికారిగా కాకుండా టీడీపీ కార్యకర్తగా పనిచేశారని మల్లాది విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే వైసీపీ ఓటమికి టీడీపీ ప్లాన్ వేస్తే.. దానిని అమలు చేసే బాధ్యతలను ఏబీ తన భుజానికెత్తుకున్నారన్న దిశగా మల్లాది సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే ఇంటెలిజెన్స్ డీజీగా ఏబీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, ఆ అవినీతి సొమ్ముతో ఆయన పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని వైసీపీకే చెందిన మరో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. పరిస్థితి చూస్తుంటే... ఏబీకి సంబంధించి ఇంకెన్ని ఆరోపణలు వస్తాయోనన్న చర్చ ఆసక్తి రేెకెత్తిస్తోంది.



Tags:    

Similar News