త‌న వాటా 30 శాతం అంటున్న ఆ వైసీపీ ఎమ్మెల్యే?

Update: 2020-02-04 00:30 GMT
ఆయ‌న తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపువ‌చ్చిన నేత‌ల్లో ఒక‌రు. ఎన్నిక‌ల ముందు హ‌డావుడిగా వైసీపీలోకి చేరి, ట‌క్కున టికెట్ కూడా పొందారు. జ‌గ‌న్ గాలిలో భారీ మెజారిటీతో నెగ్గారు. ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఆయ‌న‌. ఆయ‌న విష‌యంలో ర‌క‌ర‌కాల అభియోగాలు గ‌ట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. ఒక‌వైపు పార్టీ విజ‌యం కోసం, త‌న విజ‌యం కోసం ప‌ని చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఆయ‌న చాలానే నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌ని స్థానిక క్యాడ‌ర్ బాగా ఆవేద‌న చెందుతూ ఉంది.

ఈ విష‌యంలో అధిష్టానం వ‌ర‌కూ కంప్లైంట్స్ వెళ్లినా ఎమ్మెల్యే తీరులో మాత్రం మార్పు లేద‌ని స‌మాచారం. పైపెచ్చూ.. స‌ద‌రు ఎమ్మెల్యే వ‌సూళ్ల దందాకు కూడా గ‌ట్టిగానే తెర తీశార‌ట‌. ప్ర‌స్తుతం ఆయ‌న 30 శాతం క‌మిష‌న్ డిమాండ్ చేస్తూ ఉన్నార‌ని టాక్. ప‌ని ఏదైనా త‌న క‌మిష‌న్ మాత్రం ముప్పై శాతం అని ఆయ‌న తేల్చి చెబుతున్నార‌ట‌. ఏ ప‌నిలో అయినా త‌న‌కు ఆ క‌మిష‌న్ ఇచ్చే వారికే ప‌నులు ద‌క్కుతాయ‌ని ఆయ‌న చెబుతున్న‌ట్టుగా స‌మాచారం.

ముప్పై శాతం ఇస్తేనే ఏ వ్య‌వ‌హారం అయినా ఎమ్మెల్యే క‌నుస‌న్న‌ల్లో క‌దులుతుంద‌ట. అలా కాకుండా.. తేడా వ‌స్తే అధికారుల‌కు ఫోన్లు చేసి ఆయ‌న ఆ ప‌నుల‌ను ఆపేయిస్తున్న‌ట్టుగా స‌మాచారం. తాజాగా మ‌రో వ్య‌వ‌హారంలో  ఎమ్మెల్యే ముప్పై శాతం క‌మిష‌న్ల మేర‌కు తెలుగుదేశం పార్టీ కాంట్రాక్ట‌ర్ల‌కు ప‌నులు అప్ప‌గించినట్టుగా ఆ నియోజ‌క‌వ‌ర్గంలో చ‌ర్చ జ‌రుగుతూ ఉంది.

ఇది భూములు చ‌దును చేసే వ్య‌వ‌హారం. పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాల కోసం ప్ర‌భుత్వం భారీ ఎత్తున భూ సేక‌ర‌ణ చేసింది. అందులో భాగంగా వాటిని చ‌దును చేసే ప‌నులు సాగుతూ ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఆ కాంట్రాక్టు వ‌ర్క్ ను ప్రైవేట్ వాళ్ల‌కు అప్ప‌గించింది ప్ర‌భుత్వం. అందులో ఎమ్మెల్యే వాటా గ‌ట్టిగానే ముడుతోంద‌ని స‌మాచారం. ప‌ని విలువ‌లో 30 శాతం మేర‌కు ఎమ్మెల్యేకు వాటాగా ఇచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్లు ఆ కాంట్రాక్టు ప‌నులు చేప‌ట్టార‌ట‌.  ఎమ్మెల్యే ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ తెలుగుదేశంలో ప‌ని చేసిన వ్య‌క్తి కావ‌డంతో.. ఆయ‌న ద‌గ్గ‌ర టీడీపీ వాళ్ల ప‌ర‌ప‌తి గ‌ట్టిగా ఉంద‌ట‌. గెలిపించింది వైసీపీ శ్రేణులు అయితే, ఎమ్మెల్యేకు క‌మిష‌న్లు ఇచ్చి టీడీపీ వాళ్లు ప‌నులు చేయించుకుంటున్న‌ట్టుగా తెలుస్తోంది.

ఈ విష‌యంలో వైసీపీ శ్రేణులు గ‌గ్గోలు పెడుతూ ఉన్నాయి. అధినాయ‌క‌త్వానికి కూడా ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. అయినా ఎమ్మెల్యే మాత్రం తీరు మార్చుకోవ‌డం లేద‌ట‌. నిజాయితీగా ఉండే స‌మ‌స్యే లేద‌ని, దీపం ఉండ‌గానే ఇళ్లు చ‌క్క‌బెట్టుకోవ‌డం త‌న ఉద్దేశ‌మ‌ని.. వీలైనంత దండుకునేదే అని, ఎవ‌రేమ‌నుకున్నా ఫ‌ర్వాలేద‌ని ఆయ‌న తెగేసి చెబుతున్నార‌ట‌. ఈ విధంగా ఆ ఎమ్మెల్యే తీరుపై నియోజ‌క‌వ‌ర్గంలో చ‌ర్చ సాగుతూ ఉంది.


Tags:    

Similar News