ఎంపీ రఘురామకృష్ణం రాజుకు షాకిచ్చిన వైసీపీ

Update: 2020-06-24 09:00 GMT
కొద్దిరోజులుగా వైసీపీ ప్రభుత్వం మీద.. జగన్ మీద విమర్శలు చేస్తూ అసమ్మతి రాజేస్తున్న వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుపై ఎట్టకేలకు షాక్ తగిలింది. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ వైసీపీ అధిష్టానం జలక్ ఇచ్చింది.  ఈ షోకాజ్ నోటీసులు వైసీపీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రఘురామ చేసిన వివిధ వ్యాఖ్యలను ఎత్తిచూపింది. వివిధ న్యూస్ చానల్స్ చర్చలలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన వివిధ వ్యాఖ్యలను షోకాజ్ నోటీసుల్లో పేర్కొంది. ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు  రఘురామకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

రఘురామకృష్ణం రాజుకు పంపిన నోటీసుల్లో ‘ఇటీవలి కాలంలో, మీరు పార్టీ యొక్క ప్రాధమిక సభ్యునిగా ఉండటానికి ఇష్టపడలేదు,  ఏపీలో  అధికార  పార్టీ మరియు ప్రభుత్వ కార్యక్రమాలపై మీరు చేసిన వివిధ ప్రకటనలు అవమానకరమైనవి.   బహిరంగంగా వైయస్ఆర్సిపి పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ  అసమ్మతి రాజేస్తున్నారు.  ” అని పార్టీ క్రమశిక్షణా కమిటీ జారీ చేసిన షో కాజ్ నోటీసులో  పేర్కొంది.

ఏపీలో ఇంగ్లీష్ మీడియా పాఠశాలలను జగన్ ప్రభుత్వం తెచ్చినప్పుడు జనాభాలోని ఎక్కువమంది ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ఇచ్చారు. అయినా దీనిపై వైసీపీ ఎంపీగా ఉండి రఘురామకృష్ణం రాజు విమర్శించారు. వివిధ పత్రికల్లో బహిరంగంగా మాట్లాడారు. చానెళ్లలోనూ వ్యతిరేకించారు. అందుకనే నోటీసులు జారీ చేస్తున్నట్టు వైసీపీ పేర్కొంది.

ఇక ఎటువంటి ఆధారాలు లేకుండా ఏపీలో ఇసుక దోపిడీ జరుగుతోందని ఆరోపించారని అందుకే మీకు నోటీసులు జారీ చేశామని తెలిపింది. పార్టీకి కట్టుబడి ఉండని నేతగా మీరు చేస్తున్న విమర్శలు సహేతుకం కాదని.. నోటీసులపై వారం రోజుల్లోగా స్పందించాలని వైసీపీ అధిష్టానం నోటీసుల్లో పేర్కొంది.


Tags:    

Similar News