భీమ్లా నాయ‌క్ : ప‌వ‌ర్ స్టార్ వెర్స‌స్ పొలిటిక‌ల్ మెగాస్టార్ ?

Update: 2022-02-28 05:49 GMT
పెద్ద,పెద్ద నాయ‌కుల‌ను ఢీ కొన్న శ‌క్తి జ‌గ‌న్ ది.. అన్న‌ది నాని మాట..ఆయ‌న‌కు నా మ‌రియు నీ అన్న భేదం లేవు అన్న‌ది కూడా నాని మాట.ఆ విధంగా ఆయ‌న ముఖ్య‌మంత్రి ని ఆకాశంతో పోల్చారు.ఆకాశంలో ఉన్న ధ్రువ తార లాంటి వారు అన్న‌ది

ఆ మాట‌కు ఉన్న అర్థం.క‌నుక చంద్ర‌బాబును తిట్టి య‌థాలాపంగా జ‌గ‌న్ ను పొగిడి చివ‌రికి ప‌వ‌న్ ను కూడా తిట్టి ప్రెస్మీట్ ముగించ‌డ‌మే పొలిటిక‌ల్ పంచ్ అని తేల్చారు నాని.మంత్రి నాని అని రాయాలి.నిర్మాత నాని అని కూడా రాయాలి. ఒక‌ప్పుడు ప‌వ‌న్ సినిమాలు కొనుగోలు చేసి వ్యాపారం చేసిన నాని అని కూడా రాస్తే బెట‌ర్.గుడివాడ డిస్ట్రిబ్యూట‌ర్ నాని అని కూడా రాయాలి.అప్పుడయినా ఆయ‌న నిజాలు తెలుసుకుంటారు అన్న‌ది జ‌న‌సేన వాద‌న.ప‌వ‌న్..సినిమాలు వ‌దిలి రాజ‌కీయ రంగం లోకి రాలేదు.సినిమాలు చేస్తూనే రాజ‌కీయం చేస్తున్నారు.ఆయ‌న్ను ఆ రోజు  అడ్డుకోవాల‌ని అనుకుంటే మ‌రి! సాక్షిలో రంగు రంగుల పేజీల్లో ఇంట‌ర్వ్యూలు ఎందుకు అని కూడా ప్ర‌శ్నిస్తోంది జ‌న‌సేన.అంటే అడ్డు వ‌చ్చిన వారు విల‌న్లు.తోచిన రీతిన మంచి చేయాల‌నుకున్న వారంతా విల‌న్లు.ప్ర‌శ్నిస్తే విల‌నిజం.మౌనంగా ఉంటే హీరోచితం..అదేలేండి వీరోచితం అని  అంటున్నాయి జ‌న‌సేన వ‌ర్గాలు.

రెండంటే రెండు పార్టీల పోరు మాత్రం ఇది అని తేలిపోయింది. జ‌న‌సేన‌కు పెద్ద‌గా ఓటు బ్యాంకు లేదు అని పైకి  చెప్పే వైసీపీ రాజ‌కీయంగానూ సినిమా ప‌రంగానూ భ‌లే అడ్డుకుంటోంది.ఆ విధంగా ఆయ‌న‌తో ఆడుకుంటోందిజ‌.ఆట‌లేవీ వ‌ద్దు అని కూడా చెప్ప‌గ‌లుగుతోంది.ఇదే మాట ఆ రోజు చెప్ప‌గ‌లిగితే ఎంత బాగుండు..మాకు వ్య‌తిరేకం అనుకున్న వారు ఎవ్వ‌రూ కూడా మాట్లాడేందుకు వీల్లేద‌ని.. సినిమాలు చేసేందుకు వీల్లేద‌ని..ఇదీ జ‌న‌సేన ప్ర‌శ్న.

తాము రాజ‌కీయంగా విభేదించినంత మాత్రాన ఏకంగా కొన్ని ల‌క్ష‌ల కుటుంబాల‌ను ప్ర‌భావితం చేసే సినిమా ప‌రిశ్ర‌మ‌ను ఎలా తొక్కేస్తార‌ని కూడా ప్ర‌శ్నిస్తోంది.అవును! పొలిటిక‌ల్ మెగాస్టార్ జ‌గ‌న్ మాత్ర‌మే! కానీ అంద‌రినీ స‌మదృష్టితో ఆయ‌న చూసిన రోజునే ఆయ‌న పొలిటిక‌ల్ మెగాస్టార్ అన్న ప‌దానికి తూగ‌గ‌ల‌రు అని కూడా అంటోంది జ‌న‌సేన.అస‌లు సంబంధం లేని శాఖ మంత్రి వ‌చ్చి ప్రెస్మీట్ పెట్టి ఇన్ని తిట్లూ,శాప‌నార్థాలూ ఎలా పెడుతున్నార‌ని కూడా అంటోంది జ‌న‌సేన.ఇవ‌న్నీ చూస్తుంటే క‌క్ష‌పూరిత ధోర‌ణి అని మాత్ర‌మే అని స్ప‌ష్టం చేస్తోంది.కానీ నాని మాత్రం తాము ఆ సినిమాను తొక్కాల‌ని అనుకోవ‌డం లేదు అని అంటున్నారు.అంతేకాదు అదేమ‌యినా బాహుబ‌లి లాంటి సినిమానా అని కూడా ఎదురు ప్ర‌శ్నిస్తున్నారు.త‌న దృష్టిలో హీరో అంటే జ‌గ‌న్ అని తేల్చేశారు.ఆ విధంగా ఆయ‌న స్వామి భ‌క్తి అద్భుత రీతిలో వెల్ల‌డించారు..అని గోడు పెడుతోంది..గోస పెడుతోంది జ‌న‌సేన‌.

మెగాస్టార్ అంటే చిరంజీవి..పొలిటిక‌ల్ మెగాస్టార్ అంటే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.ఆయ‌నను మించి ఇంకెవ్వ‌రూ లేరు అని అంటున్నారు నిర్మాత మ‌రియు మంత్రి అయిన కొడాలి నాని.ఆయన కార‌ణంగానే తాము ఇవాళ ఈ విధంగా ఉన్నామ‌ని, ఇండ‌స్ట్రీకి కూడా మేలు చేసే ఉద్దేశ‌మే ఉంద‌ని మ‌రో మారు చెప్పారు.జీఓ ఆల‌స్యం  అయినందున త‌మ‌ను నిందించ‌డం త‌గ‌ద‌ని అంటున్నారు. అయినా మేం ఏమ‌యినా స‌వ‌రించిన టికెట్ ధ‌ర‌ల‌కు సంబంధించి ఫిబ్ర‌వ‌రి 25 నాటికి జీఓ ఇస్తామ‌ని చెప్పామా? చేశామా ?  అని ఎదురు ప్ర‌శ్నిస్తున్నారు.ఆ విధంగా ముఖ్య‌మంత్రి ఎదుట మంచి మార్కులే కొట్టేస్తున్నారు.

రాజకీయంగా ప‌వ‌న్ కు జ‌గ‌న్ కు ఉన్న సైద్ధాంతిక విభేదాల‌ను మ‌రింత పెంచేందుకు చేస్తున్న ఒక చిన్న‌యుద్ధం ఇది అని మ‌రోవైపు రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు.నాని చెప్పిన విధంగా సోనియాలాంటి అధినేత్రిని ఎదుర్కొన్న ఆయ‌న‌కు భ‌యం లేదు కానీ ఇండస్ట్రీ పెద్ద‌లే పాపం ఆయ‌న పేరు చెబితే చాలు వణికిపోతున్నారు.అవును!అందుకే మెగాస్టార్ చేతులెత్తి దండంపెట్టి మ‌మ్మ‌ల్ని కాపాడ‌మ‌ని వేడుకున్నారు.ఇదంతా నాని ద‌గ్గ‌రుండి చూశారు క‌నుకనే పొలిటిక‌ల్ మెగాస్టార్ జ‌గన్ అని అన్నారు.

నాల్రోజులు ఆగితే ఓటీటీకి వ‌చ్చేసే సినిమాపై ఎందుకు ఇంత‌టి ర‌గ‌డ అని కూడా అంటున్నారు.ఆహా! ఇదే మాట అఖండ విష‌య‌మై అన‌లేక‌పోయారా? ఇదే మాట పుష్ప సినిమా విష‌య‌మై అన‌లేక‌పోయారా? ఇదే మాట బంగార్రాజు సినిమా విష‌య‌మై అన‌లేకపోయారా? ప‌వ‌న్ ఒక్క‌రే జ‌గ‌న్ దృష్టిలో విల‌న్ అయిపోతున్నారే ఎందుక‌ని? అంటే జ‌గ‌న్ ను విభేదిస్తే విల‌న్ అని,జ‌గ‌న్ కు సాహో అని చెప్పిన వారంతా హీరోల‌ని వ‌ర్గీక‌రించి వివ‌రించి నిర్వచించి వెళ్లాలా అన్న‌ది ఇవాళ జ‌న‌సేన వినిపిస్తున్న వాద‌న‌
Tags:    

Similar News